జిల్లా పోలీసులు అప్రమత్తతో వ్యవహరించాలి

జిల్లా ఎస్‌పి కెవి.మురళీకృష్ణ

ప్రజాశక్తి-అనకాపల్లి : జూన్‌ ఒకటి నుంచి ఎగ్జిట్‌ పోల్స్‌, 4న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్‌పి కెవి.మురళీకృష్ణ సూచించారు. ఆదివారం స్థానిక పోలీసు కార్యాలయంలో జిల్లా పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ ర్యాలీలు, ఊరేగింపులు, పండుగలలో స్టేజ్‌ ప్రోగ్రాములకు అనుమతులు లేవని, పెట్రోల్‌ బంకులలో లూజ్‌ పెట్రోల్‌ అమ్మకాలు అనుమతించకూడదని, బాణసంచా తయారీ, అమ్మకాలపై నిరంతరం నిఘా పెట్టాలని ఆదేశించారు. రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా పెట్టి వారేమైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే జిల్లా నుంచి బహిష్కరించక తప్పదని హెచ్చరించారు. గ్రామాల్లో దాబాలు, హోటళ్లు, పాన్‌ షాప్‌లలో మద్యం అక్రమ అమ్మకాలు జరగకుండాచూడాలని, జూదం, కోడిపందేలు,కాయిన్‌ గేమ్‌, బెట్టింగ్‌ వంటి చట్ట విరుద్ధ చర్యలను అరికట్టాలని ఆదేశించారు.గ్రామాల్లో పోలీసు పికెట్‌, పెట్రోలింగ్‌ చెక్‌ పోస్ట్‌లను ప్రణాళికతో ఏర్పాటుచేసి అసాంఘిక చర్యలను నియంత్రించాలన్నారు. ఇలాంటివి ప్రోత్సాహించే వారిని బైండోవర్‌ చేయాలన్నారు. గ్రామస్థాయిలోని వివిధ వర్గాల ప్రజలతో సమావేశాలు నిర్వహించి, ఎన్నికల నియమావళి, 144సెక్షన్‌, 30 పోలీస్‌ యాక్ట్‌, బౌండ్‌ డౌన్‌ గురించి వివరించాలని, చట్ట ఉల్లంఘన జరిగితే ఎలాంటి చర్యలు ఉంటాయో ప్రజలకు వివరించాలన్నారు. నేరుగాగానీ, సామాజిక మాధ్యమాల్లోగానీ రెచ్చగొట్టే సందేశాలు, నిరాధార ఆరోపణలు చేస్తే కఠినచర్యలు ఉంటాయన్నారు. అనుమతి లేని ర్యాలీలు, ఊరేగింపులు,సమావేశాలు నిర్వహణ, బాణసంచా పేల్చడం నిషేధమని, అలాంటివి నిర్వహించినా, ప్రోత్సహించినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.గత ఎన్నికల్లో నేరాలకు పాల్పడిన నిందితులపై నిఘా ఉంచాలన్నారు. అభ్యర్థుల గెలుపోటములపై బెట్టింగులు నిర్వహణ నేరమన్నారు. గ్రామాల్లో ఫ్లాగ్‌ మార్చ్‌లు, అనుమానాస్పద గ్రామాల్లో కార్డన్‌, సెర్చ్‌ ఆపరేషన్‌లు చేపట్టాలన్నారు. అపరిచిత వ్యక్తులపై నిఘా ఉంచాలన్నారు. తమ పరిధిలోని శాంతిభద్రతల పరిరక్షణ, నేరనియంత్రణపై జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బంది పూర్తి నియంత్రణ ఉండి, వాటిని అరికట్టాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్‌పిలు బి.విజయభాస్కర్‌, పి. సత్యనారాయణ రావు, అనకాపల్లి, పరవాడ, నర్సీపట్నం డిఎస్‌పిలు ఎస్‌.అప్పలరాజు, కె.వి.సత్యనారాయణ, జిఆర్‌ఆర్‌.మోహన్‌, డిటిసి డిఎస్‌పి డి.రామవర్మ, దిశా డిఎస్‌పి ఎం.ఉపేంద్రబాబు, ట్రైనీ డిఎస్‌పి భవ్య, ఇనస్పెక్టర్‌లు లక్ష్మణమూర్తి, చంద్రశేఖర్‌, అప్పలనాయుడు, కుమారస్వామి, గణేష్‌, సతీష్‌ , మన్మధరావు, ఎస్‌ఐలు రామారావు, రఘువర్మ, బి.తేజేశ్వరరావు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎస్‌పి మురళీకృష్ణ

➡️