ప్రలోభాల ఎర!

May 10,2024 00:52

పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం కోటనెమలిపురిలో వైసిపికి చెందిన జెడ్‌పిటిసి డి.సునీతరెడ్డి భర్త శ్రీనివాసరెడ్డి మిల్లులో పట్టుబడిన మద్యం సీసాలు
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి :
పోలింగ్‌ తేదీ సమీపిస్తుండటంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు వివిధ రూపాల్లో తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల సంఘం అధికారుల పరిశీలన జరుగుతున్నా రహస్యంగా అభ్యర్థుల తరుఫున కొన్ని బృందాలు ఓటర్లను ఆకట్టుకునేందుకు డబ్బు పంపిణీని ఇప్పటికే ప్రారంభించారు. జిల్లాలో గురువారం ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌లు ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనకు సంబంధించి నిర్వహించిన తనిఖీల్లో ఇప్పటి వరకూ మొత్తం రూ.3,64,11,311ల విలువైన నగదు, మద్యం ఇతర వస్తువులు సీజ్‌ చేశారు. కానీ భారీ ఎత్తున మద్యం,డబ్బు పంపిణీ కొనసాగుతోంది. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పది నియోజకవర్గాల్లో డబ్బు విపరీతంగా ఖర్చు చేస్తున్నారు. ప్రధాన పార్టీలకు ఈ ఎన్నికలు జీవనర్మణ సమస్యగా మారడంతో ఎట్టిపరిస్థితుల్లో గెలవాలన్న తాపత్రాయంతో ఓటర్లకు ఎర వేస్తున్నారు. పోస్టల్‌ ఓట్లను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఒక్కొ ఓటుకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ఉద్యోగులకు అందించారు. కొంత మంది ఉద్యోగులు డబ్బు తీసుకునేందుకు నిరాకరించారు. డబ్బు తీసుకున్న వారి నుంచి రశీదు తీసుకునే పద్ధతిలో కొన్నిపోలింగ్‌ కేంద్రాల్లో బ్యాలెట్‌పై తమ పార్టీకి ఓటు వేసినట్టు ఫొటో తీసి పెట్టాలని అధికార పార్టీ నాయకులు కొన్ని నియోజకవర్గాల్లో షరతుపెట్టారు. పోలింగ్‌ కేంద్రంలోకి సెల్‌ఫోన్‌ అనుమతించరాదని, సెల్‌ఫోన్‌ బయట డిపాజిట్‌ చేయాల్సి ఉండగా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో చాలా మంది ఓటు వేసిన బ్యాల్‌ట్‌ను ఫోటోలు తీయడం కన్పించింది. గుంటూరు జిల్లాలో బుధవారం వరకు 19,255 పోస్టల్‌ ఓట్లు పోలవ్వగా, గురువారం మరో వెయ్యి ఓట్ల వరకు పోలయ్యాయి. ఇతర జిల్లాలకు చెందిన ఉద్యోగులు, అధికారులకు బ్యాలెట్‌ రాకపోవడం వల్ల చాలామంది నిరాశతో వెనుదిరిగారు. బ్యాలెట్‌ పేపర్లు సరిపోనంత సరఫరా లేక ఇబ్బంది ఎదుర్కొన్నారు. నాలుగు రోజులుగా అభ్యర్థులు, వారి అనుచరుల పోస్టల్‌ ఓట్లపోలింగ్‌పై దృష్టి సారించారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి సామాజిక తరగతులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించి తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల్లో తమకు మద్దతివ్వని సామాజిక తరగతులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఎక్కువ మందిని ప్రభావితం చేయకలిగిన వారిని పిలిపించి మద్దతు కోరడంతోపాటు కొన్నిసందర్భాల్లో కాళ్లబేరానికి దిగుతున్నారు. వ్యక్తిగత అంశాలతో పాటు సామాజిక అంశాలపైనా టిడిపి, వైసిపి నేతలు హామీలు గుప్పిస్తున్నారు. వ్యాపారులను వివిధ రూపాల్లో మచ్చిక చేసుకుని గతంలో జరిగిన ఘటనలను పునరావృత్తం కాకుండా చూస్తామని పలువురు టిడిపి అభ్యర్ధులు ప్రస్తావిస్తున్నారు. గతంలో తమకు అనుకూలంగా పనిచేయని సామాజిక తరగతులను ఆకట్టుకునేందుకు వైసిపి కూడా తమ పార్టీ అధికారంలోకి వస్తే అది చేస్తాం…ఇది చేస్తాం అని హామీలు గుప్పిస్తున్నారు. మరోవైపు టిడిపి, వైసిపి విచ్చలవిడిగా డబ్బు పంపిణీ, మద్యం పంపిణీకి ప్రారంభించారు. జిల్లాలో టిడిపి, వైసిపి తరుఫున 70 శాతం మంది కార్పొరేట్‌, పలు వ్యాపార సంస్థలకు చెందిన కోటిశ్వరులు బరిలో ఉండటంతో డబ్బు పంపిణీకి పలు రూపాల్లో సన్నాహాలు చేస్తున్నారు.

➡️