మన్యానికి దారేది.?

Apr 24,2024 21:36

ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అనువైన రహదారులు ఉండాలి. అప్పుడే అక్కడ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యంతోపాటు అభివృద్ధి చెందిన ప్రాంతాలతో సత్సంబంధాలు ఏర్పడతాయి. వారి జీవన ప్రమాణాల్లో వెలుగు రేఖలు వెల్లివిరుస్తాయి. 57 ఏళ్ల పాలనలో మన్యం పరిధిలోని నియోజకవర్గాల్లో టిడిపి, కాంగ్రెస్‌, వైసిపి హయాంలో రహదారుల నిర్మాణాలు కలగానే మిగిలాయి. దీంతో ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోయింది. గిరిజనులు దుర్భర జీవితాలను అనుభవిస్తున్నారు.

ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం: పార్వతీపురం ఐటిడిఎ పరిధిలోని ఎనిమిది మండలాల్లో 77 పంచాయతీలు, 289 గ్రామాలు, 773 గిరిజన గూడేలు ఉన్నాయి. వీటిలో 323 గ్రామాలు కొండలపైనే ఉన్నాయి. సుమారుగా 1,87,829 మంది గిరిజనులు నివశించే గ్రామాల్లో 70 శాతం రోడ్లు లేక అవస్థలు పడుతున్నారు. కురుపాం మండలంలో సుమారు 23 పంచాయతీల్లో 55 గ్రామాలకు రోడ్లు లేవు. దీనివల్ల మొండెంఖల్లు, నీలకంఠాపురం పిహెచ్‌సిలతోపాటు కురుపాం సిహెచ్‌సికి రోగులు వెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నారు. గిరిజనులు 10 నుంచి 30 కిలోమీటర్ల దూరం కాలినడకన ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది. ముఖ్యంగా కొండల మీద గ్రామాల్లో గిరిజనులకు డోలీ మోతలు తప్పడం లేదు. దీంతో వైద్యం కోసం ఆస్పత్రులకు చేరేలోపే ప్రాణాలు విడిస్తున్నారు. గుమ్మలక్ష్మీపురం మండలం 27 పంచాయతీల్లో 60 గ్రామాలకుపైగా రోడ్లు లేవు. దీంతో తాడికొండ, రేగిడి, దుడ్డుకల్లు పిహెచ్‌సిలకు రావాలంటే డోలీలతో మోసుకు రావాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. కొమరాడ మండలం పూడేసు, ఎండభద్ర, పల్లపాడు, కూనేరు, మసిమండ, పెడుము, తుమ్మలవలస తదితర గిరిజన గ్రామాలకు చెందిన ప్రజానీకం ప్రయాణమంతా కాలినడకనే. ఇక లంజి గిరిజన గూడెం దాటి ఉన్న గూకల్లు, గుర్లిమ్మ, కుంతేసు, కో, జొప్పంగి, జాకూరు, జల, సంకేసు, వాటకకోసు తదితర గ్రామాలకు రహదారే లేదు. జియ్యమ్మవలస, సాలూరు, పాచిపెంట మండలాల్లోనూ అధ్వాన రోడ్లతో గిరిజనులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఒడిశాకు అతి చేరువగా ఉన్న గ్రామం లంజి. కొమరాడ మండలం కూనేరు ప్రధాన రహదారి నుంచి 20 కిలోమీటర్లు కొండల్లో వెళ్తే తప్ప ఈ గ్రామానికి చేరుకోలేం. లంజి గ్రామంలో 300 మంది గిరిజనులు నివశిస్తుంటారు. బస్సు సౌకర్యం లేదు. తెల్లవారు జామున నాలుగు గంటలకు కాలినడకన బయల్దేరితే గానీ 11 గంటలకు మండల కేంద్రానికి చేరుకోలేని పరిస్థితి. అనారోగ్య పరిస్థితులు సంభవిస్తే ప్రాణాలు గాల్లో కలిసి పోవాల్సిందే. ఒక్క లంజి గ్రామమే కాదు. ఈ ప్రాంతంలో కుంతేసు, గొర్లెమ్మ, గూనకళ్లు, బెడ్డతోపాటు 35కు పైగా గ్రామాలకు ఇదే దుస్థితి. అనేకమార్లు వినతులిచ్చినా పరిష్కారం మాత్రం శూన్యం. గుమ్మలక్ష్మీపురం మండలం వాడజంగి గ్రామానికి రహదారి లేకపోవడంతో గ్రామస్తులు శ్రమదానంతో కొంతమేర నిర్మించారు. ఇక్కడ 50 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. తాగడానికి కనీసం మంచినీళ్లు కూడా లేని పరిస్థితి. ఇక్కడ గిరిజనులకు వైద్యం గగనమే. కురుపాం మండలం ఒబ్బంగి పంచాయతీ జలబగుడలో 120 కుటుంబాలు ఉన్నాయి. గ్రామానికి రోడ్డు లేక వీరంతా నరకయాతన అనుభవిస్తున్నారు. ఐటిడిఎ, కలెక్టర్‌ గ్రీవెన్సులో గిరిజనులు అనేకసార్లు ఫిర్యాదులు చేశారు. కానీ రోడ్డు మాత్రం బాగుపడలేదు. జలబగుడ గ్రామస్తులు మండల కేంద్రానికి రావడానికి 50 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఐదేళ్లకోసారి ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వస్తున్న నాయకులు రహదారుల అభివద్ధికి శ్రద్ధ చూపడం లేదు. ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు. దీంతో గిరిజన గ్రామాలు అభివృద్ధికి దూరంగా ఉండిపోతున్నాయి.

➡️