పారలు భుజాలపై పెట్టుకొని ఉపాధి కూలీల నిరసన

Mar 30,2024 10:20 #anakapalli, #laborers, #Protests

రావికమతం (అనకాపల్లి) : అనకాపల్లి జిల్లా రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ అజరుపురం. రాయిపాడు గ్రామంలో శనివారం ఉదయం పారలు భుజంపై పెట్టుకుని ఉపాధి కూలీలు నిరసన చేపట్టారు. ఆదివాసి గిరిజన సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

నేతలు మాట్లాడుతూ… ఉపాధి హామీ పథకం కింద తమ ఆదివాసి కూలీలకు రూ.600 ఇవ్వాలని కోరుతుంటే రూ.27 మాత్రమే పెంచడం అన్యాయమన్నారు. సంవత్సరంలో 100 రోజులు పని 200కు పెంచాలని, రోజు కూలి రూ.600 ఇవ్వాలని కోరుతుంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. గతంలో ఇస్తున్న రూ.273కు రూ.27 కలిపి రూ.300 ఇస్తామని ప్రకటించడం అన్యాయమన్నారు. నేడు ధరలు ఆకాశాన్ని అంటుతుంటే నరేంద్ర మోడీ గద్దినెక్కింది మొదలు ఈరోజు వరకు నిత్యావసర వస్తువులు నాలుగు, ఐదు రెట్లు పెరిగాయని గిరిజనులు వాపోయారు. వ్యవసాయ కూలి ఆదాయం మాత్రం గొర్రె బెత్తులు తోక అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. వ్యవసాయం కనీస వేతనం చట్ట ప్రకారం రూ.400 చెల్లించాలి కానీ నేడు మోడీ ప్రభుత్వం ప్రకటించిన వేతనం చట్టం కింద తక్కువగా ఉందని చెప్పారు. కనీస వేతనంపై నియమించిన అనూప్సత్తితి కమిటీ రోజుకు రూ.375 తప్పు కాకుండా ఇవ్వాలని పేర్కొందని కానీ ఆ కమిటీ సూచనలు కూడా పట్టించుకోకుండా తక్కువ కూలి చెల్లించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. బడ్జెట్లో ఉపాధి పథకం నిధులు తగ్గిస్తూ. నేటికీ బకాయిలు విడుదల చేయడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాల్లో గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు కె.గోవిందరావు, జిల్లా కార్యదర్శి పాంగి చంద్రీయ, తదితరులు పాల్గొన్నారు.

➡️