మిమ్స్‌ ఉద్యోగుల పోరాటం స్ఫూర్తిదాయకం

Apr 13,2024 21:10

 సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సుబ్బ రామమ్మ

విశాఖ సెంట్రల్‌ జైల్‌ నుంచి విడుదలైన కార్మికలకు ఘన స్వాగతం

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : మిమ్స్‌ యాజమాన్య నిరంకుశత్వాన్ని, పోలీసుల నిర్బంధాన్ని ఎదుర్కొని జైలు కెళ్లి బెయిల్‌పై వచ్చిన మిమ్స్‌ కార్మికులు ఈశ్వరమ్మ, లక్ష్మి, రమణ, రామ శేఖర్‌లకు కలెక్టరేట్‌ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో మిమ్స్‌ ఉద్యోగులు ఘనంగా స్వాగతం పలికారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సిఐటియు ఆధ్వర్యాన మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికులు పెద్దఎత్తున పోరాడుతున్నారు. కక్ష కట్టిన యాజమాన్యం తప్పుడు కేసులు పెట్టి 21 మంది కార్మికులను అరెస్టు చేయించింది. వారిలో ఐదుగురిని విశాఖ సెంట్రల్‌ జైలుకు పంపగా, మిగతా 16 మంది విజయనగరం సబ్‌జైలులో ఉన్నారు. మొత్తంగా నలుగురు బెయిల్‌పై శనివారం విడుదలయ్యారు. ఈ సందర్భంగా వీరికి సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సుబ్బరావమ్మ, జిల్లా ఉపాధ్యక్షులు తమ్మినేని సూర్యనారాయణ, కార్యదర్శి ఎ.జగన్మోహన్‌రావు, మిమ్స్‌ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి మిరప నారాయణరావు ఘన స్వాగతం పలికి పూలదండలు వేసి అభినందించారు. అనంతరం సుబ్బరావమ్మ, తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ యాజమాన్యం, అధికార యంత్రాంగం, పోలీస్‌ వైఖరిని దుయ్యబట్టారు. తప్పు యాజమాన్యం చేస్తే కార్మికులను, అందులోనూ మహిళల్ని సైతం జైల్లో నిర్బంధించడం వంటి చర్యలతో జిల్లా ప్రతిష్టను దిగజార్చారన్నారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చొరవతో వారం రోజులుగా చర్చలు జరుగుతున్నాయని, కార్మికులందరికీ ఆమోద యోగ్యమైన ఒప్పందంతోనే విధులకు హాజరవుతారని స్పష్టం చేశారు. ఇప్పటికైనా మిమ్స్‌ యాజమాన్యం ఉద్యోగులతో స్నేహపూర్వకంగా మెలగాలని హితవు పలికారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కిల్లంపల్లి రామారావు, పలువురు మిమ్స్‌ ఉద్యోగులు పాల్గొన్నారు.

➡️