ఓటరు తీర్పు నేడు

May 13,2024 00:04

పోలింగ్‌ సామగ్రితో గుంటూరు ఏసీ కాలేజీ నుండి పోలింగ్‌కేంద్రాలకు బయలుదేరిన సిబ్బంది
ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి :
సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈవిఎంలు, వీవీప్యాట్‌లు, ఇతర సామగ్రితో ఎన్నికల సిబ్బంది పోలింగ్‌ కేంద్రాలకు తరలి వెళ్లారు. ఆదివారం ఉదయం నుంచి ఎన్నికల సరంజామా పంపిణీ చేపట్టారు. వీటిని తీసుకుని అధికారులు, సిబ్బంది తమకు కేటాయించిన ప్రాంతాలకు చేరుకున్నారు. ఆదివారం రాత్రి 10 గంటల కల్లా గుంటూరు, పల్నాడు జిల్లాలోని అన్ని పోలింగ్‌ కేంద్రాలు ఈవిఎంలు, ఇతర సామగ్రి చేరిందని సోమవారం ఉదయం 7 గంటల కల్లా పోలింగ్‌ జరుగుతుందని అధికారులు తెలిపారు. పోలింగ్‌కేంద్రం అధికారులు, ప్రిసైడింగ్‌ అధికారులు, సిబ్బంది దాదాపు 30 వేల మంది వరకూ విధుల్లో పాల్గొంటున్నారు. 9 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తులో పాల్గొంటున్నారు. పోలింగ్‌ సోమవారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. గుంటూరు, నర్సరావుపేట లోక్‌సభ స్థానాలకు, 14 అసెంబ్లీ స్థానాలకు కలిపి 288 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. గుంటూరు లోక్‌సభ పరిధిలో 162 మంది, నర్సరావుపేట లోక్‌సభ పరిధిలో 122 మంది పోటీ చేస్తున్నారు. టిడిపి, వైసిపి, కాంగ్రెస్‌, వామపక్షాలు, జనసేనతోపాటు పలు రిజిస్ట్రర్డ్‌ పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు దాదాపు 100 మంది వరకు ఇండిపెండెంట్‌ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. గుంటూరు లోక్‌సభ పరిధిలో 17,91,543 మంది ఓటర్లు ఉన్నారు.1,915 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గానికి 30 మంది అభ్యర్థులు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు 132 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో విధులు నిర్వహించడానికి 2,300 మంది పీఓలు, 2,300 మంది ఏపీఓలు, 9,800 మంది ఓపిఓలను నియమించారు. జిల్లాలో 1,915 పోలింగ్‌ కేంద్రాలో 372 పోలింగ్‌ కేంద్రాలు సమస్యాత్మక్మమైనవిగా గుర్తించారు. 1,498 పోలింగ్‌ కేంద్రాల్లో (78 శాతం) వెబ్‌ కాస్టింగ్‌ చేయనున్నారు. సమసాత్మకమైన పోలింగ్‌ కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 487 మందిని మైక్రో అబ్జర్వర్లు, పోలింగ్‌ కేంద్రాల పర్యవేక్షణకు 176 మందిని సెక్టోర్‌ ఆఫీసర్లును ఎంపిక చేశారు. పోలింగ్‌ కేంద్రాల లోపల, క్యూ లైన్లకు మూడు వేల సీసీ కెమెరాలతో పాటు 187 మంది వీడియోగ్రాఫర్ల ద్వారా పర్యవేక్షణ ఉంటుంది. గత ఎన్నికల్లో జరిగిన ఘటనలు, గత ఏడాదికాలంలో జరిగిన ఘర్షణలు, రాజకీయ వివాదాలను ఆధారంగా చేసుకుని సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలుగా పరిగణిస్తున్నారు. ఈసారి పలు నియోజకవర్గ వర్గాల్లో భారీగా ఓటర్లు పెరగడం వల్ల ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ సమయం ఇచ్చారు. అయినా ఆరు గంటల తరువాత కూడా పోలింగ్‌ జరిగే అవకాశం ఉండటంతో రాత్రి వేళ లైట్లు కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గుంటూరు జిల్లాలో మంగళగిరి, గుంటూరు పశ్చిమలో అత్యధిక ఓటర్లున్నారు. మంగళగిరిలో 2,92,432 మంది ఓటర్లుండగా గుంటూరు పశ్చిమలో 2,78,158 మంది ఉన్నారు.
ఎఎన్‌యులో 7 నియోజకవర్గాల ఈవిఎంల భద్రం
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో గుంటూరు లోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఈవిఎంలు, వివిప్యాట్‌లు, ఇతర ఎన్నికల సామాగ్రిని భద్రపరుస్తున్నారు. 7 నియోజకవర్గాల పరిధిలో లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల ఓట్ల లెక్కింపు వచ్చేనెల 4న నాగార్జున విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తారు.

పోలింగ్‌ సామగ్రితో నరసరావుపేట నుండి పోలింగ్‌కేంద్రాలకు బయలుదేరిన సిబ్బంది
పల్నాడు జిల్లాలో ఏర్పాట్లు

నరసరావుపేట లోక్‌సభ పరిధిలో మొత్తం 1929 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. 17,20,526 మంది ఓటర్లున్నారు. మొత్తం 557 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలుగా గుర్తించారు. మొత్తం 1929 పోలింగ్‌ కేంద్రాల్లో పీవోలు 2125, ఏపీవోలు 2125, ఓపివోలు 8319, మైక్రో అబ్జర్వర్లు 466, సెక్టార్‌ అధికారులు 187 మంది పనిచే స్తారు. మొత్తంగా 13,035 మంది ఉద్యో గులు పోలింగ్‌ విధుల్లో పాల్గొటారు. గురజా లతో అత్యధికంగా 2,71,913 మంది ఓట ర్లున్నారు. జిల్లాలో మొత్తం 122 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో 15 మంది నర్సరావుపేట లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తుండగా 107 మంది ఏడు అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్నారు. ఓటర్లు పెరగ డం వల్ల సాయంత్రం 6 గంటల తర్వాతా పోలింగ్‌ జరుగుతుందని అధికారులు అంచనా. ఈమేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.
జెఎన్‌టియులో ఈవిఎంలకు భద్రత
నర్సరావుపేటలోనిజెఎన్‌టియు కళాశాలలో ఈవిఎంలకు భద్రత కల్పించను న్నారు. ఏడు స్ట్రాంగ్‌ రూమ్‌లలో ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన 1929 ఈవిఎంలను ఉంచనున్నారు. వచ్చేనెల 4న ఇక్కడే ఓట్ల లెక్కింపు జరగనుంది.

➡️