సార్వత్రిక సమరానికి ఇక మూడ్రోజులే!

May 10,2024 00:44

ఎంపీ అభ్యర్థులు శ్రీకృష్ణదేవరాయలు, అనిల్‌కుమార్‌ యాదవ్‌
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
నరసరావుపేట నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. నరసరావుపేట పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానంపై వైసిపి, ఎన్‌డిఎ కూటమి, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు ముమ్మర ప్రచారం చేపట్టారు. పోలింగ్‌కు రెండ్రోజులే మిగిలి ఉంది. శనివారం సాయంత్రం 5 గంటలతో ప్రచార గడువు ముగుస్తుంది. ఈ లోగా ప్రచారాన్ని మరింత ఉధృతంగా చేయాలని ఆయా పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేశాయి. ఇప్పటికే వైసిపి అధినేత సిద్ధం పేరుతో చేపట్టిన బస్సు యాత్ర పల్నాడు ముగిసింది. ప్రకాశం జిల్లా నుండి వినుకొండ వచ్చిన బస్సు యాత్ర రొంపిచర్ల మీదుగా పిడుగురాళ్ల చేరుకొని పిడుగురాళ్లలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అనంతరం పెదకూరపాడు, తాజాగా రెండ్రోజుల క్రితం మాచర్లలో సభ ఏర్పాటు చేశారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం, సంసిద్ధం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటిస్తున్న నేపథ్యంలో శుక్రవారం పల్నాడు జిల్లాలో శుక్రవారం పర్యటిస్తారని భావించినా అది రద్దయింది.

ఎమ్మెల్యే అభ్యర్థులు శ్రీనివాసరెడ్డి, అరవిందబాబు
నరసరావుపేట నియోజకవర్గంలో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆయన భార్యడాక్టర్‌ సుస్మితతో వైసిపి డాక్టర్స్‌ అంటూ 20 మందికిపైగా పట్టణానికి చెందిన వైద్యులు, ద్వితీయ శ్రేణి నాయకులు సైతం గోపిరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ నెల రోజుల నుండి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. హ్యాట్రిక్‌ విజయం సాధింస్తానని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెబుతున్నారు. టిడిపి అభ్యర్థి డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు, ఆయన భార్య సుధారాణి, కుమారుడు ఆదిత్య కోడలు ప్రణవి, కుమార్తె అమూల్యలు పట్టణంలో టిడిపికి చెందిన వైద్యులు బృందాలుగా ఏర్పడి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. 2004 నుండి నాలుగుసార్లు జరిగిన ఎన్నికలలో రెండుసార్లు కాంగ్రెస్‌, రెండుసార్లు వైసిపి విజయం సాధించగా టిడిపి వరుసగా పరాజయం పాలైంది. ఐదేళ్లుగా వైసిపి అరాచకాలు తట్టుకొని కార్యకర్తలకు అండగా ఉన్న తనను గెలిపించాలని కోరుతూ అరవిందబాబు ప్రచారం చేస్తున్నారు. అసెంబ్లీతోపాటు పార్లమెంట్‌ స్థానంలోనూ తమ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన అంటున్నారు.

➡️