ఎర్రజెండా ఉంటేనే పేదలకు న్యాయం

May 6,2024 00:38

మాట్లాడుతున్న ఉమామహేశ్వరరావు
ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్‌ :
పేదలకు అండగా ఎర్ర జెండా ఉంటేనే న్యాయం జరుగుతుందని సిఐటియు రాష్ట్ర నాయకులు వి.ఉమామహేశ్వరరావు అన్నారు. ఆదివారం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం, వడ్డేశ్వరం జాతీయ రహదారి వద్ద ఉన్న కేబీ భవన్‌ లో సిఐటియు తాడేపల్లి మండల స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. సిఐటియు తాడేపల్లి మండల నాయకులు దొంత రెడ్డి వెంకటరెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో గత పదేళ్లుగా మతోన్మాద బిజెపి కేంద్రంలో అధికారంలో ఉండి దేశ సంపదను దోచుకు తింటోందని అన్నారు. మోడీ అధికారంలోకి రాకముందు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యో గాలు కల్పిస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు చూపించకుండా మోసం చేశారని అన్నారు. ప్రస్తుతం 26 కోట్ల మంది నిరుద్యోగులు గా మారారని అన్నారు. పారిశ్రామిక రంగం నిర్వీర్యం అవడానికి ప్రధాన కారణం మోడీ విధానాలే అని, ప్రభుత్వ రంగ సంస్థలను పారిశ్రామిక రంగాలను మోడీ అమ్మేందుకు కుట్ర పన్నారని విమర్శించారు. 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్‌ కోడ్‌ లుగా మార్చడం, 78 వేల కోట్ల చెస్‌ ను కార్మికులకు ఖర్చు పెట్టకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలకు మళ్లించుకోవడం, టిడిపి హయాంలో చంద్రన్న బీమాకు, వైసిపి ప్రభుత్వం వైయస్సార్‌ బీమాకు భవన నిర్మాణ కార్మికుల డబ్బులే దారి మళ్లించడంపై విమర్శలు చేశారు. కానీ భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు పూర్తిగా వర్తింప చేయలేదని మండిపడ్డారు. మున్సిపల్‌ కార్మికులను ఫస్ట్‌ వారియర్స్‌ గా గుర్తించామని చెప్పిన ప్రభుత్వాలు ఒక నెల జీతం కూడా వారికి అదనంగా ఇవ్వలేదని అన్నారు. కష్టజీవుల ఆదాయాలు పెంచకుండా, దేశంలో బడా పారిశ్రామికవేత్తలైన అదాని అంబానీ టాటా బిర్లా ఆదాయాలు మాత్రం రెట్టింపు అయ్యాయని విమర్శించారు. నిరుద్యోగం, దేశ అభివద్ధి గురించి మాట్లాడకుండా, ముస్లిం రిజర్వేషన్‌ రద్దు చేస్తామని, రాజ్యాంగాన్ని మార్చివేస్తామని నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వం చెప్పడం దుర్మార్గమన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో స్త్రీలకు స్వేచ్ఛ లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఇండియా బ్లాక్‌ తరుపున వామపక్ష అభ్యర్థులు పోటీ చేస్తున్నారని ఆయన అన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలంటే, సమస్యలపై గళం విప్పే ఎర్రజెండా అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హౌదాపై నోరు విప్పని టిడిపి వైసిపి, పార్టీలు నేడు మోడీ భజన చేస్తూ ఎన్డీఏ కూటమిగా ఏర్పడడం దుర్మార్గమన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా ట్రాన్స్పోర్ట్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు నన్నపనేనీ శివాజీ మాట్లాడుతూ మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రవాణా రంగంలోని చట్టాలను మార్పు చేశారని విమర్శించారు. పెట్రోల్‌ డీజిల్‌ గ్యాస్‌ ధరలు పెంచడంతో రవాణా రంగంపై భారం పడి, మోటార్‌ రంగం కార్మికులు అనేక ఇబ్బందులు పడ్డారని అన్నారు. ఈ కార్మిక వ్యతిరేక చట్టాల వలన భవిష్యత్తులో మోటారురంగం కార్మికులు రోడ్డున పడే పరిస్థితి దాపురించిందన్నారు. సిఐటియు గుంటూరు జిల్లా కార్యదర్శి వై.నేతాజీ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసేది ఎర్రజెండా మాత్రమేనని అన్నారు. సమావేశంలో ఆర్‌వి.నరసింహారావు, వై.రాధా కృష్ణ, బి.ముత్యాలరావు, ఏపూరి గోపాలరావు, కె.వెంకటేశ్వరరావు, ఎ.రంగారావు, కె.సాంబశివరావు, పున్న, మరియబాబు, రఫీ, బాష, ఎస్‌.కె గన్‌, సంసోను, రాజ్‌ కుమార్‌, భార్గవ్‌, జేమ్స్‌ పాల్గొన్నారు.

➡️