ఏకంగా ఊళ్లనే కొనేశారు

May 11,2024 20:53

ప్రజాశక్తి- రేగిడి : రాజాం నియోజకవర్గంలోని రేగిడి, వంగర, సంతకవిటి, రాజాం మండలాలలో సార్వత్రిక ఎన్నికలు మరో రెండు రోజుల్లో జరగనున్న నేపథ్యంలో వైసిపి నేతలు ఓటర్లను నగదు ఇచ్చి ఊరు ఊర్లునే కొనేసినట్లు తెలిస్తోంది. మరి కొన్ని గ్రామాల్లో కావలసిన మెటీరియల్‌, పంట పొలాలకు, కూరగాయలు పండించేందుకు పంట భూములకు బోర్లు వేస్తున్నారు. ఇంకొన్ని గ్రామాల్లో హారతులు పేరుతో నగదు పంపిణీ చేస్తున్నారు. గ్రామస్థాయి నాయకులు అనుమతులు లేకుండా డీజేలు, డాన్స్‌లు, తప్పెటగుళ్లు, ఫులి వేషాలు వంటివి ఏర్పాటు చేసి ఆడ, మగ తేడా లేకుండా నృత్య ప్రదర్శనలు చేస్తున్నారు. రాజీనామాలు ఇచ్చిన వాలంటీర్లు ఏకంగా జగన్‌ స్టిక్కర్లు అంటించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. మండలంలోని రేగిడి, ఆమదాలవలస గ్రామాల్లో టిడిపి మాజీ అధ్యక్షులు, చీపురుపల్లి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కిమిడి కళా వెంకట్రావు సోదరుడు కిమిడి రామకృష్ణంనాయుడు వైసిపిలో చేరి ఈ రెండు గ్రామాల్లో ఇంటింటికి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి తలే రాజేష్‌, ఎమ్‌పి అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్‌కు మద్దతుగా డమ్మి ఈవిఎంలతో ఇంటింటి ప్రచారం చేస్తూ ప్రతి ఇంటికి హారతులు ఇచ్చేలా ఏర్పాటు చేసుకుని రూ.500 నుంచి రూ.1000 వరకు నగదు పంపిణీ చేశారు. దీంతో ఈ రెండు గ్రామాల ప్రజలు నగదు పంపిణీ చేయడంతో ఔరా అని ముక్కున వేలేసుకున్నారు. 1983 నుంచి తెలుగుదేశం ప్రభుత్వంలో అనేక పదవులు అలంకరించిన ఆయన టిడిపికి ప్రచారం చేస్తున్నారని హారతులు ఇచ్చారు. అయితే ఈ ఎన్నికల్లో వైసిపికి మద్దతు ఇస్తూ డమ్మీ ఇవిఎంలతో వైసిపికి ఓటు వేయాలని కోరడంతో గ్రామస్తులు నివ్వరపోయారు. వైసిపి సర్పంచులున్న గ్రామాల్లో వారికి, సర్పంచులు లేని గ్రామాల్లో గ్రామస్థాయి నాయకులకు నగదు అందించి పంపిణీ చేయించినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఓటుకు వెయ్యి..? విచ్చలవిడిగా నగదు పంపిణీ పూసపాటిరేగ: ప్రజాసామ్యంలో ఓటు విలువను కూనీ చేసారా అంటే అవుననే చెప్పాలి. స్వాతంత్య్రం వచ్చి ఇప్పిటి వరకూ జరిగిన ఎన్నికల్లో ఏనాడు ఇంత విచ్చలవిడిగా ఓటు విలువను కూనీ చేయలేదు. కానీ నేడు ఆ పద్ధతికి పాలకు పుల్‌స్టాప్‌ పెట్టి ఓటుకు వెయ్యి రూపాయలు ధర పెట్టారు. మరో పార్టీ అయితే మరో రూ. 1000 అదనంగా ఇస్తుంది. ఇదీ గాక పరిస్థితిని బట్టి, ఇంటిలో ఓట్లు బట్టి లెక్కలు గడుతున్నారు. ఈవిధంగా విచ్చలవిడిగా ప్రదాన పార్టీలు చేయడం ఓటర్లు ముక్కున వేలేసుకుంటున్నారు. గతంలో దొంగ చాటుగా, రాత్రి పూట వచ్చి బ్రతిమిలాడుకొని తాయిలాలు ఇచ్చేవారు. కానీ నేడు ఆపరిస్ధితికి స్వస్తి చెప్పారు. ఇరు పార్టీలు నగదు పంపకాలపై ఎటువంటి ఫిర్యాదులూ చేయకూడదని నిర్ణయించుకుని పంపిణీ చేస్తున్నట్లు తెలిస్తోంది. ఇందులో భాగంగానే అందుకే వైసిపి నేతలు ఒక వీధిలో పంచుతుంటే, కూటమి నేతలు మరో వీధిలో పంపకాలు సాగిస్తున్నారు. ఏ పార్టీ అయినా పర్యాలేదు ఓటు ఉంటే రేటు కట్టేస్తున్నారు. తాము ఇచ్చి వెల్లిన వెంటనే మరో పార్టీ వారు వచ్చి ఇస్తారని వారే చెబతుతున్నారు. ఎవరు ఎంత ఇచ్చినా తీసుకొని ఓటు మాత్రం మాకే వేయాలంటూ కోరుతున్నారు. అంటే ఈ ఎన్నికల్లో డబ్బు ఏ లెక్కలో ఖర్చు చేస్తున్నారో అర్దమవుతోంది. ఈ తతంగమంతా అధికార్లుకు తెలిసినా కన్నెత్తి చూడడం లేదు. ఎందుకంటే ప్రజలకు అందుతున్న డబ్బులను ఎందుకు ఇబ్బంది పెట్టాలన్న నిర్ణయానికి వచ్చినట్లున్నారు. గ్రామాల్లో ఓటర్లు కూడా తక్కువేమి కాదు. తమ ఏరియాకు ఎందుకు ఇంకా రాలేదంటూ పోన్‌లు చేస్తున్నారు. ఆ పార్టీ వారు వచ్చి ఇచ్చి వెల్లిపోయారు. మీరు ఎప్పుడు వస్తారని అడుగుతున్నారు. ఇంకొంత మంది అయితే మా పేటలో ఇంత మందిమి ఉన్నాం. మా కుటుంబంలో ఇంత మంది ఓటర్లు ఉన్నారు. ఓల్‌సేల్‌గా మాట్లాడండి అంటున్నారని రాజకీయ నేతలు వాపోతున్నారు. గత పాలకులు ఏం చేసారు… వచ్చిన వారు ఏం చేస్తారు అన్నది చర్చ కాదు.. ఇప్పుడు మాకు ఎంత ఇస్తారో చెప్పండి అన్నదే చర్చ అన్న చందంగా ఓటర్లు ఉండడం నేతలకు అంతుబట్టడం లేదు. అంటే ప్రజాసామ్యంలో బలమైన ఆయుదం విలువ ఎంత దిగజారిపోయిందో అర్ధమవుతోంది. ఈ ప్రలోబాలు ఎవరి గెలుపు, ఓటమిలు మీద ప్రబావం చూపుతాయో వేచి చూడాల్సిందే.

➡️