ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేకే నా చావును కోరుతున్నారు

May 1,2024 21:57

చంద్రబాబుపై జగన్‌ విమర్శ

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి :ప్రజాక్షేత్రంలో తనను ధైర్యంగా ఎదుర్కోలేక జగన్‌ను చంపితే తప్పేంటి అంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారని సిఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్షుడైన సొంతమామను ఎన్టీయార్‌ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. బొబ్బిలిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. వెన్నుపోట్లు పొడవడం, కుట్రలు చేయడం ఇదే చంద్రబాబు నాయుడు నైజమన్నారు. ఎన్టీయార్‌ మొదలుకుని, కొండవీడి మోహనరంగరావును, ఐఎఎస్‌ అధికారి రాఘవీంద్రరావును చంపింది ఎవరని ప్రశ్నించారు. ఇప్పుడు జగన్ని చంపితే తప్పేంటి అంటున్నారని అన్నారు. అంతకు ముందు తన తండ్రి వైఎస్‌ఆర్‌ను కూడా అసంబ్లీ సాక్షిగా ఇలానే అన్నారని జగన్‌ వ్యాఖ్యానించారు. అలా అన్న వారం రోజుల్లోనే ఆయన చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు వస్తున్న ప్రధారణ చూసి ఓర్వలేక, తనను ప్రజాక్షేత్రంలో ధైర్యంగా ఎదుర్కోలేక ఇలాంటి మాట్లాడుతున్నారని అన్నారు. సంక్షేమ పథకాలు అందుకుంటున్న మహిళలు, యువకులు, వృద్ధులే తనకు శ్రీరామరక్షగా ఉంటారని అన్నారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు జీవితంలో మంచిపనులు చేయలేదని విమర్శించారు. ప్రస్తుత ఎన్నికల్లో కొత్తకొత్త మోసాలతో ముందుకు వస్తున్నారని జగన్‌ విమర్శించారు. 2014లో చంద్రబాబు సంతకంతో ముఖ్యమైన హామీలంటూ ప్రతి ఇంటికీ పంపిన కరపత్రికలోని ఒక్క హామీ కూడా అమలు చేయలేదని విమర్శించారు. రైతు రుణమాఫీ కోసం మొదటి సంతకం చేసి, రూ.87వేల 612 కోట్ల ఆర్థిక భారాన్ని తగ్గిస్తానని చెప్పిన చంద్రబాబు మాట నిలబెట్టుకోలేదన్నారు. పొదుపు సంఘాల రుణాలు రద్దుపై ఇచ్చిన హామీ కూడా నెరవేర్చలేదన్నారు. రూ.14వేల 205 కోట్లుకు ఎగమనాం పెట్టారని అన్నారు. ఆడపల్లి పుడితే రూ.25వేల చొప్పున బ్యాంకులో వేస్తానని చెప్పి, ఒక్కరికైనా అమలు చేశాడా అని ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం లేదా, నిరుద్యోగ బృతి అని చెప్పి నిరుద్యోగులను మోసం చేస్తామని చెప్పిన బాబు మోసం చేశారని, అర్హలకు మూడు సెంట్లు ఇంటి స్థలమంటూ ఒక్కసెంటు కూడా పంచలేదన్నారు. ఉమెన్‌ ప్రొటిక్షన్‌ ఫోర్స్‌ మాట కూడా నిలబెట్టుకోలేదన్నారు. ప్రత్యేక హోదాను కూడా అమ్మేశాడని అని, ఇటువంటి వ్యక్తులను ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. ఇవే అంశాలను మోనిఫెస్టోలో చేర్చి సూపర్‌ సిక్స్‌ అంటే ప్రజలు ఏమాత్రం నమ్ముబోరన్నారు.

➡️