ఆలోచించి ఓటేయండి

Apr 10,2024 23:55

2014 టిడిపి ఎన్నికల మేనిఫెస్టోను చూపుతూ మాట్లాడుతున్న సిఎం జగన్‌మోహన్‌రెడ్డి
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి/ పిడుగురాళ్ల :
టిడిపి అధినేత చంద్రబాబును నమ్మొద్దని, 2014లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన ఎన్‌డిఎ కూటమి మరోసారి ప్రజలను మోసం చేసేందుకు వస్తోందని వైసిపి అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పల్నాడు జిల్లాలో బుధవారం ఆయన బస్సు యాత్ర నిర్వహించారు. శావల్యాపురం మండలం గంటావారిపాలెం నుంచి పుట్టవారిపాలెం, సంతమా గులూరు క్రాస్‌, రొంపిచర్ల క్రాస్‌, విప్పర్ల, నకరికల్లు మీదుగా దేవరంపాడు క్రాస్‌ వద్దకు చేరుకుని భోజన విరామం కోసం ఆగారు. అనంతరం కొండమోడు, పిడుగురాళ్ల బైపాస్‌ మీదుగా సాయంత్రం 5.30 గంటలకు అయ్యప్పనగర్‌ బైపాస్‌ సభ ప్రాంగణానికి చేరుకుని బహిరంగ సభలో పాల్గొన్నారు. సభానంతరం కొండమోడు జంక్షన్‌, అనుపాలెం, రాజుపాలెం, రెడ్డిగూడెం మీదుగా ధూళి పాళ్ల వద్ద బుధవారం రాత్రి 8 గంటలకు రాత్రి బస శిబిరానికి జగన్‌ చేరుకున్నారు. దారి పొడవునా వైసిపి శ్రేణులు భారీగా హాజరయ్యారు.పిడుగురాళ్ల సభలో జగన్‌ మాట్లాడుతూ 14 ఏళ్లు సిఎంగా చేసిన చంద్రబాబు పేదలకు ఉపయోగపడే ఒక్క పథకాన్నీ సమర్ధవంతంగా అమలు చేయలేదన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చిన 58 నెలల్లో రాష్ట్రంలో ఎన్ని విప్లవాత్మకమైన మార్పులు తెచ్చామని, దీన్ని ఆలోచించి ప్రజలు ఓట్లేయాలని కోరారు. కూటమి, ఎల్లో మీడియాతో కలిసి ఓ గాడిదను తెచ్చి అది గుర్రం..గుర్రం అని ఊదరకొడుతున్నారన్నారు. జాబ్‌ రావాలంటే బాబు రావాలని ప్రచారం చేస్తున్న వారు 2014 నుండి 2019 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలన్నారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు కేవలం 36 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని, 2019లోకి అధికారంలోకి వచ్చిన తాము సచివాలయ వ్యవస్థ ద్వారా 1.35 లక్షల ఉద్యోగాలిచ్చామని చెప్పారు. వైద్యారోగ్య శాఖలో 58 నెలల్లో 58 వేల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. ఐదేళ్లలో 2.30 లక్షల ఉద్యోగాలకు నిరుద్యోగులను ఎంపిక చేశామన్నారు. లంచాలు లేకుండా, వివక్ష లేకుండా పాలన అందించామని, 130 సార్లు బటన్‌ నొక్కి రూ. 2.71 లక్షల కోట్లు ప్రజలకు అందించామని అన్నారు. వాలంటీర్ల వ్యవస్థను తప్పుపట్టిన చంద్రబాబు ఇప్పుడు వారికి రూ.10 వేలు జీతం ఇస్తారంటే ఎవరైనా నమ్ముతారా అని ప్రశ్నించారు. నర్సరావుపేట లోక్‌సభ వైసిపి అభ్యర్థిగా అనిల్‌కుమార్‌ యాదవ్‌ను అసెంబ్లీ అభ్యర్థులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాసుమహేష్‌రెడ్డి, అంబటి రాంబాబు, కావటి మనోహర్‌ నాయుడు, బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరు శంకరరావు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని ప్రజలకు జగన్‌ విజ్ఞప్తి చేశారు.

రూ.1964 కోట్లతో గురజాలను అభివృద్ది : మహేష్‌రెడ్డి
గురజాల నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని స్థానిక ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి అన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని 57 గ్రామాలు, మూడు మున్సిపాల్టీల్లో రూ.218 కోట్లతో ప్రతి ఇంటికి పైప్‌ లైను ఏర్పాటు చేసి ఏడాదిలో ఇంటింటికీ కృష్ణానది నీరు అందిస్తామని చెప్పారు. రూ.500 కోట్లతో పిడుగురాళ్లలో మెడికల్‌ కళాశాలను నిర్మిస్తున్నామన్నారు. దాచేపల్లి, గురజాలను మున్సిపాల్టీలుగా మార్చామన్నారు. మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కొత్తగా మేనిఫెస్టో రూపొందించి సొంతగా గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తానని చెబుతున్నారని, రూ.814 గ్యాస్‌ సిలిండర్‌ను రోజుకి 50 పైసలు ముష్టిలా ప్రజలకు ఇస్తానని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు.

➡️