అడ్డంగా దొరికినా చర్యలేవీ..?

Mar 17,2024 22:31
అడ్డంగా దొరికినా చర్యలేవీ..?

ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌ సహజంగా రాజకీయ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంటారు… ఇక్కడ తిరుపతి మున్సిపాలిటీలో మాత్రం టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు కమిషనర్‌ అదితి సింగ్‌ను తప్పుదోవ పట్టించారు. టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు ఒక ఐఏఎస్‌ ఆఫీసర్‌ తప్పుదోవ పట్టించడం ఇదేమి కొత్త కాదు.. గతంలో కూడా ఇక్కడ పనిచేసిన ఐఏఎస్‌ అధికారులు, కమిషనర్లను తప్పుదోవ పట్టించిన సంఘటనలు ఉన్నాయి. కమిషనర్‌ అదితి సింగ్‌ గత కొన్ని నెలలుగా తిరుపతి ఎన్నికల నిర్వహణపై దష్టి కేంద్రీకరించారు. ఆమె ఇతర పనులు చూడడానికి సమయం లేకపోవడంతో టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల ఇష్టారాజ్యంగా మారిపోయింది. కమిషనర్‌ దృష్టి పెట్టకపోవడమే అలుసుగా తీసుకొని లక్షలాది రూపాయలు అక్రమ కట్టడాల నుంచి వసూలు చేశారని ఆరోపణలు నగరపాలక సంస్థలు గుసగుసలాడుతున్నాయి. అధికారులు ప్రజలను మభ్య పెట్టడం ఒకే ఎత్తు అయితే ఇక్కడ ఐఏఎస్‌ అధికారిగా ఉన్న కమిషనర్ను మభ్య పెట్టడం మరో ఎత్తుగా మారింది. టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు ఏ విధంగా తయారయ్యారో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నది సుబ్బారెడ్డినగర్‌లోని ఓ ఇంటిని గత బుధవారం సాయంత్రం నగరపాలక అధికారులు కూల్చుతున్న దశ్యం. పట్టణ ప్రణాళిక సిబ్బంది, ప్రణాళిక కార్యదర్శుల సమక్షంలో దాదాపుగా పూర్తయిన నిర్మాణాన్ని ఆకస్మికంగా కూల్చేందుకు రావడంతో ఇంటి యజమానురాలి రోదనలు మిన్నంటాయి. నగరపాలిక ఇచ్చిన ఇంటి నంబరు, భవననిర్మాణ ప్రాథమిక అనుమతులు, పన్ను చెల్లిస్తున్నా భవనం అనధికారమంటూ కమిషనర్‌ ఆదేశాలతో కూల్చుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనల్ని పరిశీలిస్తే నగరపాలక సంస్థ మరీ ఏ స్థాయికి చేరిందో అర్థమవుతుంది. ఓ భవనానికి అసలు అనుమతే లేకపోయినప్పటికీ దాని జోలికెళ్లని అధికారులు సిబ్బంది.. నిర్మాణం పూర్తి అయిన భవానన్ని కూల్చేందుకు సిద్ధం కావడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నగరంలో వివాధాలు లేని భూములు అరుదు… ఓ మోస్తరు నిర్మాణం అయితే అధికారులు (దొడ్డివారి) సహకారం, న్యాయస్థానం ఉత్తర్వులు కచ్చితంగా ఉండాల్సిందే. ఈక్రమంలో కొందరు అధికారులు అనధికారిక కట్టడాల వ్యవహారంలో తిరకాసులు సష్టించి పబ్బం గడుపుతున్నారు. ఇది ఇలా ఉండగా సుబ్బారెడ్డినగర్‌లో కూల్చిన నిర్మాణానికి కమిషనర్‌ ఇచ్చిన ఉత్తర్వులకు టౌన్‌ప్లానింగ్‌ అధికారులు పంపిన బట్వాడకు తేడా ఉండడంతో బాధితులు కమిషనర్‌ దష్టికి తీసుకెళ్లారు. కమిషనర్‌ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు పిలిపించి విచారించారు కమిషనర్‌ ఇచ్చిన ఉత్తర్వుల తేదీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు బాధితులు పంపిన బట్వాడా తేదీ తేడా ఉండడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఎవరిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ టౌన్‌ప్లానింగ్‌ అధికారులను ప్రశ్నించారు. దీంతో టౌన్‌ప్లానింగ్‌ అధికారులు తలవంచుకొని నిల్చుకోవడం జరిగింది. దీంతో కమిషనర్‌ తప్పుదోవ పట్టించినట్ల అయింది .కమిషనర్‌ ఆర్డర్‌ పై కోర్టును ఆశ్రయిస్తామని బాధితులు అంటున్నారు.అనధికార కట్టడాలపై ఇలా… అనధికారిక కట్టడాలకు సంబంధించి రెండు పర్యాయాలు, తాఖీదులు జారీ చేసిన తరువాత సంతప్తికరమైన సమాధానం లభించకపోతే భవనాల కూల్చివేతకు ఉత్తర్వులు జారీ అవుతాయి. అయితే తాఖీదులకు సంబంధించి జారీచేసే తేదీలు, వాటిని బట్వాడా చేసే తేదీలకు చాలా వ్యత్యాసం ఉంటోంది. వారంరోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తూ కమిషనర్‌ గతనెల ఒకటిన జారీ చేసినట్లు అధికారుల దస్త్రాల్లో ఉండగా.. అదేనెల 29న తపాలా కార్యాలయంలో పోస్టు చేయడం, తద్వారా సమాధానం లేని కారణంగా భవనాన్ని కూల్చివేస్తున్నట్లు కమిషనర్‌ నుంచి ఆదేశాలు పొందడం వంటి తిరకాసుల్లో అధికారులు ఆరితేరినట్లు రుజువులున్నాయి. కొందరు అధికారపార్టీ నాయకులు సైతం క్షేత్రస్థాయిలో ఉన్న ప్రణాళిక కార్యదర్శుల వ్యవహారశైలిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా వారి తీరులో మార్పు కనిపించకపోవడం విశేషం. ఇటీవలే ఓ భవనం ముందు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన మెట్లను తొలగించేస్తామని టెదిరించి రూ.3లక్షలు తీసుకున్న వ్యవహారంపై నగరపాలిక కార్యాలయంలో చర్చ జరుగుతోంది. కొత్తగా వచ్చిన కమిషనర్‌ పూర్తిగా ఎన్నికల విధులకే పరిమితం కావడంతో నగరంలో అక్రమ భవనాలకు మంచిరోజులు వచ్చాయని చర్చ సాగుతోంది..ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకున్నాం.. సుబ్బారెడ్డి నగర్‌లోని ఓ నిర్మాణంపై ఫిర్యాదు రావడంతోనే కూల్చివేయడం జరిగిందని, ఎక్కడ కమిషనర్‌ను తప్పుదోవ పట్టించేలేదని తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ సిటీ ప్లానర్‌ శ్రీనివాసులు రెడ్డి ప్రజాశక్తికి తెలిపారు.

➡️