అధికారుల బదిలీలతో కాంట్రాక్టర్లకు బిల్లుల టెన్షన్‌

Jan 28,2024 22:50
అధికారుల బదిలీలతో కాంట్రాక్టర్లకు బిల్లుల టెన్షన్‌

ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌ ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్‌ వెలువడుతుందని విస్తృత ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే పోలీసుశాఖతో పాటు జిల్లాలో ఉన్న మున్సిపల్‌ కార్పొరేషన్‌, పురపాలక సంఘాల్లో కమిషనర్లు బదిలీలు మొదలయ్యాయి. నేడు, రేపు రెవెన్యూ, ఇతర ప్రభుత్వశాఖలో మూడు సంవత్సరాల పైబడిన వారిని బదిలీలు కానున్నారు. ప్రభుత్వశాఖలో కాంట్రాక్టర్లు చేసిన పనులకు బిల్లులు పేరుకుపోయి ఉన్నాయి. ఇందులో మున్సిపల్‌ కార్పొరేషన్‌తో పాటు మున్సిపాలిటీలు, ఆర్‌ అండ్‌ బి, తుడా, ఇరిగేషన్‌, పబ్లిక్‌ హెల్త్‌, పంచాయతీరాజ్‌, ఇతర శాఖలో అభివృద్ధి పనులు చేసిన బిల్లులు అలానే నిలిచిపోయి ఉన్నాయి. తిరుపతి జిల్లాలో మున్సిపల్‌ కార్పొరేషన్‌లో, మున్సిపాలిటీలో చేసిన పనులు బిల్లులు ఎక్కువ ఉన్నట్టు తెలుస్తోంది. కమిషనర్లు బదిలీ అవుతుండడంతో ఉన్న కమిషనర్‌ తమ బిల్లుల ఇస్తారా.. లేదా.. అని ప్రతి రోజు పగలు రాత్రి వారి వెంట తిరుగుతూనే ఉన్నారు. గత పది రోజుల నుంచి ఎక్కడా లేని విధంగా కాంట్రాక్టర్లు పెద్ద మొత్తంలో చేసిన పనులకు వెంటనే బిల్లులు ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. వారి నుంచి సరైన సమాధానం రాకపోతే రాజకీయనేతలతో ఒత్తిడి చేయిస్తున్నారు.. కమిషనర్లు బదిలీపై వెళితే కొత్తగా వచ్చే కమిషనర్లు ఎన్నికల విధుల్లో ఉండడం వల్ల, కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చే పరిస్థితి ఉండదు. ఎన్నికల షెడ్డులు వచ్చిన వెంటనే అభివద్ధి పనులన్నీ ఆగిపోతాయి. పాత పనులు తప్ప, కొత్తగా చేపట్టే అవకాశం ఉండదు. వేసవికాలం రానున్నడంతో తాగునీటి లాంటి సమస్యలపై కమిషనర్‌ యుద్ధప్రాతిపదిక చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.పేరుకుపోయిన బిల్లులు…తిరుపతి పార్లమెంటు పరిధిలో ఇటు తిరుపతి కార్పొరేషన్‌, శ్రీకాళహస్తి, గూడూరు, పుత్తూరు, నాయుడుపేట మున్సిపాలిటీలో చాలా వరకు కాంట్రాక్టర్లు చేసిన పనులకు బిల్లులు పేరుకుపోయి ఉన్నాయి. తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో జనరల్‌ ఫండ్స్‌ కింద కాంట్రాక్టర్లకు సుమారు రూ.35 కోట్లు ఇవ్వాల్సి ఉంది. అలాగే మాస్టర్‌ ప్లాన్‌ రోడ్లు చేపట్టిన కాంట్రాక్టర్లు కూడా సుమారు రూ.15 కోట్లు పైగా బిల్లులు ఇవ్వాల్సి ఉంది. వీటితోపాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు కాంట్రాక్టర్లకు సుమారు రూ.20 కోట్లు రావాల్సి ఉంది.. అలాగే తుడా పరిధిలో కూడా సుమారు రూ.20 కోట్ల బిల్లులు కాంట్రాక్టర్లకు రావాల్సి ఉంది. శ్రీకాళహస్తిలో సుమారు రూ.2 కోట్లు, గూడూరు మున్సిపాలిటీలో కూడా సుమారు మూడు కోట్ల రూపాయలు, పుత్తూరు మున్సిపాలిటీ నాయుడుపేటలో కూడా కోటి రూపాయలు పైగా అన్ని బిల్లులు రావాల్సి ఉందని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. దీంతో పాటు ఆర్‌అండ్‌ బి ఇరిగేషన్‌ పంచాయతీ రాజ్‌లో కూడా సుమారు 10 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లు బిల్లు రావలసిందని కాంట్రాక్టర్లు అంటున్నారు. అధికారులు బదిలీలు కాకముందే తమ బిల్లు తమకు ఇవ్వాలని, ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయి ఉన్నామని తమకు బిల్లు ఇచ్చే సహకరించాలని వేడుకుంటున్నారు. అయితే అధికారులు రాజకీయ నేతలు చెప్పిన కాంట్రాక్టర్లకే బిల్లులు ఇస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి, పెద్ద పెద్ద పనులు చేసిన కాంట్రాక్టర్లకు పెద్ద మొత్తంలో బిల్లులు ఇస్తున్నారని,, చిన్న చిన్న కాంట్రాక్టర్లు మాత్రం గత ఆరు నెలల నుంచి బిల్లులు ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి కార్పొరేషన్‌లో కేవలం నలుగురు తప్ప మిగిలిన చిన్న కాంట్రాక్టర్లకు బిల్లు ఇవ్వడం లేదని, కాంట్రాక్టర్లు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. బిల్లును అడిగితే కార్పొరేషన్‌ డబ్బులు లేవని, డబ్బులు ఉన్నప్పుడు కాంట్రాక్టర్లు ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉంది. చేసిన పనులకు సకాలంలో బిల్లు రాకపోవడంతో కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారు. బిల్లుల కోసం కాంట్రాక్టర్లు కోర్టుకు వెళితే, అధికారులు బిల్లులు ఇవ్వడానికి సహకరించడం లేదని కొంతమంది కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు తమకు బిల్లులు ఇవ్వాలని వేడుకుంటున్నారు.

➡️