ఆర్‌కె రోజాకు సీటు ఇస్తే పార్టీకే నష్టం: మురళీధర్‌ రెడ్డి

ఆర్‌కె రోజాకు సీటు ఇస్తే పార్టీకే నష్టం: మురళీధర్‌ రెడ్డి

ఆర్‌కె రోజాకు సీటు ఇస్తే పార్టీకే నష్టం: మురళీధర్‌ రెడ్డిప్రజాశక్తి-తిరుపతి(మంగళం)నగిరి నియోజకవర్గంలో మంత్రి రోజాకు మళ్లీ ఎమ్మెల్యే సీటు అధిష్టానం ఇస్తే నష్టపోక తప్పదని, తామెవ్వరం పనిచేయబోమని నగరి నియోజకవర్గ పరిధిలోని నిండ్ర, పుత్తూరు, వడమాల పేట, విజయపురం, నగరి మండలాలకు చెందిన వైసిపి నాయకులు స్పష్టం చేశారు. శుక్రవారం తిరుపతి ప్రెస్‌ క్లబ్‌ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వడమాలపేట జడ్పిటిసి సభ్యుడు మురళీధర్‌ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే మంత్రి రోజా పట్ల నగరి నియోజకవర్గ ప్రజలు తీవ్ర అసంతప్తితో ఉన్నారని, నియోజకవర్గ వైసిపి క్యాడర్‌ ఆమె ప్రవర్తన పట్ల విసుగుచెంది ఉన్నారన్నారు. జగన్‌ నాయకత్వంలో పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని, కానీ మంత్రి రోజాకు ఎన్నికల్లో ఎటువంటి సహకారం అందివ్వమన్నారు. ఇదే విషయాన్ని అధిష్టానంకు తెలిపినా ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదన్నారు. నగరి నియోజకవర్గ వైసిపి పార్టీ క్యాడర్‌ కు వ్యతిరేకంగా అధిష్టానం నిర్ణయం తీసుకుంటే నగరి స్థానాన్ని పార్టీ కోల్పోవాల్సి వస్తుందన్నారు. మాజీ ఎంపీపీ ఏలుమలై(అమ్ములు) మాట్లాడుతూ రోజా కోసం ఎన్నికల్లో కష్టపడి ఆమెను ఎమ్మెల్యేను, మంత్రిని చేస్తే ఇప్పుడు తమను వేధిస్తోందని, అధికారం చేతబెట్టుకుని ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ‘జగన్‌ ముద్దు-రోజా వద్దు’ ప్లే కార్డులను ప్రదర్శించారు. ఈసమావేశంలో ఎంపీటీసీ లక్ష్మీపతిరాజు, మాజీ సర్పంచి రవిశేఖర్‌ రాజు, ఎంపీటీసీ రెడ్డివారి భాస్కర్‌ రెడ్డి, సర్పంచి తులసీరామ్‌ రెడ్డి, మునీంద్ర, వాసుదేవ రెడ్డి పాల్గొన్నారు.

➡️