‘ఆర్పీ’లకు తప్పని ‘వెట్టి’ రాజకీయ ఒత్తిళ్లతో పనిభారం చెత్త పన్నుల వసూళ్లకూ వీరే

'ఆర్పీ'లకు తప్పని 'వెట్టి' రాజకీయ ఒత్తిళ్లతో పనిభారం చెత్త పన్నుల వసూళ్లకూ వీరే

‘ఆర్పీ’లకు తప్పని ‘వెట్టి’శ్రీ రాజకీయ ఒత్తిళ్లతో పనిభారం శ్రీ చెత్త పన్నుల వసూళ్లకూ వీరేప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ తిరుపతి నగర పాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న ఆర్‌పిలు వెట్టిచాకిరీతో సతమతమవుతున్నారు. పనులు సక్రమంగా చేయలేదంటూ పనిష్మెంట్‌ విధించడమే గాకుండా రాజకీయ ఒత్తిళ్లు పెరిగాయి. మెప్మా విభాగంలో పట్టణాల్లో పనిచేస్తున్న ఆర్‌పిలకు మూడు నెలలకు ఒకసారి, ఐదు నెలలకు ఒకసారి వేతనాలు ఇస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేసి వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వడంలో ఆర్‌పిలు కీలకపాత్ర పోషిస్తున్నారు. పని గంటలతో ప్రమేయం లేకుండా పనిచేస్తున్న వీరికి కనీస వేతనం ఇవ్వకుండా, ఆందోళనలు చేస్తే ఉద్యోగాలు ఊడగొడతామని హెచ్చరికలతో వారు మానసికంగా కుంగిపోతున్నారు. గతంలో తిరుపతి కొర్లగుంట మారుతీనగర్‌లో ఉండే ఓ ఆర్‌పి వైసిపి రాజకీయ నేతల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం విదితమే. వేతన పెంపు ఏది? ఆర్‌పిలకు కనీస వేతనం 10వేల రూపాయలు. అది కూడా సక్రమంగా ఇవ్వని పరిస్థితి. తిరుపతి జిల్లాలో దాదాపు 350 మంది రిసోర్స్‌ పర్సన్లుగా పనిచేస్తున్నారు. వైసిపి అధికారంలోకి వచ్చిన కొత్తలో యానిమేటర్లకు 10వేలు వేతనం ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. అయితే ఇంతవరకూ వారికి రూ.10వేలు ఇచ్చిన దాఖలా లేదు. సాంకేతిక కారణాల పేరుతో ప్రతినెలా వేతన చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి రుణాలు ఇప్పించడంలో తోడ్పాటు చేయాలి. కొత్త గ్రూపులు ఏర్పాటు చేయాలి. పట్టణాల్లో చెత్త సేకరణ నిర్వహణ బాధ్యత వీరిదే. టిడ్కో గృహాలు 35వేల రూపాయల రుణం ఇప్పించాలి. ఒటిఎస్‌ వసూళ్లు వీరే చేయాలి. జగనన్న తోడు లబ్దిదారుల ఎంపిక మహిళా గ్రూపులకు బ్యాంకు లింకేజి బాధ్యత వీరిదే. స్త్రీ నిధి, ఆసరా పథకాలకు మొబైల్‌ బ్యాంక్‌ కీపింగ్‌ పనులు వీరే చేయాలి. ఇతర పనులు అధికమవడం, మొబైల్‌నెట్‌ వర్కు సాంకేతిక కారణాల నేపథ్యంలో అధికశాతం మంది పనులు చేయడం లేదు. వర్కు డన్‌ పనులు చేయలేని వారి వేతనాల్లో కోత విధిస్తున్నారు. అనేక కుంటిసాకులు చెప్పి వారికి 5వేల నుంచి ఆరువేలు మాత్రమే చెల్లింపులు చేస్తున్నారు. 45 సంవత్సరాలు పైబడిన వారిని తొలగిస్తున్నారు. రాజకీయ వేధింపుల నుంచి వారికి విముక్తి లభించడం లేదు.

➡️