ఆలయంపై రాజకీయం సిగ్గుచేటు

Feb 25,2024 22:13
ఆలయంపై రాజకీయం సిగ్గుచేటు

సుధీర్‌ తీరుమారకుంటే భంగపాటే : ట్రస్ట్‌ బోర్డ్‌ చైర్మన్‌ అంజూరుప్రజాశక్తి- శ్రీకాళహస్తి: ప్రసిద్ధిగాంచిన శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని బొజ్జల సుధీర్‌ రెడ్డి తన రాజకీయ పబ్బం కోసం వాడుకోవడం సిగ్గుచేటని ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌ అంజూరు తారక శ్రీనివాసులు విమర్శించారు. సుధీర్‌ రెడ్డి తన తీరు మార్చుకోకుంటే రాజకీయంగా భంగపాటు తప్పదని హెచ్చరించారు. స్థానిక ఆలయ పరిపాలనా భవనంలో ఆదివారం ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఊరందూరు వేదికగా బొజ్జల సుధీర్‌రెడ్డి శ్రీకాళహస్తీశ్వరాలయంపై విమర్శలు చేయడాన్ని అంజూరు శ్రీనివాసులు ఖండించారు. సూక్ష్మ నందికి బంగారు తాపడం చేయించే క్రమంలో నంది వద్ద ఉన్న రెండు గంటలను తొలగించడం జరిగిందని తెలిపారు. అయితే బొజ్జల సుధీర్‌ రెడ్డి ఆ రెండు గంటలు బంగారవనీ, వాటిని కోట్ల రూపాయలకు అమ్ముకున్నట్లు ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆ రెండు గంటలు కంచువనీ, ఒక్కోటి కనీసం రూ.200లు అయినా ధర పలకవంటూ తొలగించిన గంటలను, బంగారు తాపడం చేయించిన నందిని మీడియా ముందు ప్రదర్శించారు. బొజ్జల సుధీర్‌ రెడ్డికి శ్రీకాళహస్తీశ్వరాలయంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, మరలా నాలుక కరుచుకోవడం అలవాటుగా మారిందన్నారు. గతంలో ప్రసన్న వరదరాజుల స్వామి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా స్వామివారి మూలవిరాటును తొలగించే క్రమంలో విగ్రహం కింద లంకె బిందెలు దొరికాయనీ, వాటిని ఎమ్మెల్యే అమ్ముకున్నాడంటూ ఆరోపించిన సంగతి అందరికీ తెలిసిందేనన్నారు. మళ్లీ ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న సంగతిని గుర్తు చేశారు. ప్రతిపక్ష నేతగా సుధీర్‌ రెడ్డి రాజకీయాలు చేయాలనీ, ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ, ఆలయంపై అబాండాలు వేసి తన మనగడను కాపాడుకోవడం కోసం తాపత్రయపడడం సిగ్గుచేటు అన్నారు. ఆలయ పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.

➡️