ఇనుము పనిముట్ల తయారీ వృత్తిగా..వలస ‘బతుకు’లురాజస్థాన్‌ నుంచి ఓజిలికి..

ఇనుము పనిముట్ల తయారీ వృత్తిగా..వలస 'బతుకు'లురాజస్థాన్‌ నుంచి ఓజిలికి..

ఇనుము పనిముట్ల తయారీ వృత్తిగా..వలస ‘బతుకు’లురాజస్థాన్‌ నుంచి ఓజిలికి..ప్రజాశక్తి – ఓజిలి’కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం, శరీర కష్టం స్ఫూరింపచేసి.. గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి సహస్ర వత్తుల సమస్త చిహ్నాలు’ అని శ్రీశ్రీ దేశంలో చేతివత్తులను కీర్తిస్తూ రాసిన కవిత్వం ఇక్కడ గుర్తు రాకమానదు. భాష, ప్రాంతం వేరైనా. జీవన పోరాటం ముందు అన్నీ బలాదూర్‌. ఆధునిక యుగంలో మరయంత్రాలతో పోటీపడి ఎండకు, చలికి తట్టుకొని కమ్మరి పని చేస్తూ జీవన పోరాటం సాగిస్తున్నారు. రాజస్తాన్‌ రాష్ట్రానికి చెందిన కుటుంబాలు పిల్లాజెల్లలతో ఆంధ్రప్రదేశ్‌ లోని తిరుపతి జిల్లా ఓజిలి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ప్రతి ఏటా వలస వస్తుంటారు. రోడ్డు పైనే వంటా వార్పు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఆడ, మగ, పిల్లలు, ముసలి అన్న తేడా లేకుండా అందరూ కష్టపడతారు. ఇనుమును కొలిమిలో కాల్చి రకరకాల పనిముట్లు తయారు చేస్తున్నారు. కఠినమైన ఇనుమును కరిగించి కావలసిన రీతిలో మలచి పనిముట్లు తయారు చేసే వీరికి తమ జీవితాలు ఎలా మలుచు కోవాలో తెలియదు. సంచార జాతి వలె చలికి, ఎండకు తట్టుకొని బతుకు బండి లాగుతున్నారు. పండు ముసలి మొదలు పాలుతాగే పిల్లలు వరకు ఇదే పనిలో ఉంటున్నారు. లారీ కమాన్‌ ముక్కలు కేజీ రూ.30 చొప్పున కొనుగోలు చేస్తారు. కొలిమి కాల్చడానికి బొగ్గును కొంటారు. వీటి ద్వారా కొలిమి కాల్చి వివిధ రకాల ఇనుము పనిముట్లు తయారు చేసి విక్రయిస్తున్నారు. రోజుకు సుమారుగా రూ. 4 వేలు నుండి రూ. 5 వేలు వరకు అమ్మకాలు ఉంటాయని మహేందర్‌ సింగ్‌ తెలిపారు. పెట్టుబడి పోను మిగిలింది వీరి కష్టానికి ప్రతిఫలం. కుటుంబమంతా ఒళ్లొంచి పనిచేస్తే గాని వీరి నోట్లోకి ముద్ద పోదు. వీరి పిల్లలకు బడులుండవు. వీరితో పాటే వారూ సంచార జీవనం గడపాల్సిందే.

➡️