ఉమ్మడి శెట్టిపల్లె పంచాయతీలోనే స్థలాలు ఇవ్వండి: సిపిఎం

ఉమ్మడి శెట్టిపల్లె పంచాయతీలోనే స్థలాలు ఇవ్వండి: సిపిఎం

ఉమ్మడి శెట్టిపల్లె పంచాయతీలోనే స్థలాలు ఇవ్వండి: సిపిఎం ప్రజాశక్తి-తిరుపతి(మంగళం): మంగళం పరిధిలోని పేద ప్రజలకు ఇచ్చిన జగనన్న ఇళ్ల పట్టాలకు స్థానికంగానే స్థలాలు చూపాలని కోరుతూ మంగళవారం సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు వేణుగోపాల్‌, బుజ్జి ఆధ్వర్యంలో తిరుపతి ఆర్డీవో కార్యాలయంలో పరిపాలనాధికారికి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వేణుగోపాల్‌, బుజ్జి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేదలందరికీ ఇళ్లు ఇవ్వాలని లక్ష్యంతో వైసిపి ప్రభుత్వం జగనన్న నవరత్నాల్లో భాగంగా ఇళ్ల పట్టాలను ఇవ్వడానికి నిర్ణయించిందని, అయితే కొన్ని ప్రాంతాల్లో పట్టాలు మాత్రం ఇచ్చి స్థలాలు చూపలేదని విమర్శించారు. ఉమ్మడి శెట్టిపల్లె పంచాయతీలో దాదాపు 2,500 కు పైగా జగనన్న ఇళ్ల పట్టాలు ఇచ్చారని, మూడేళ్లు కావస్తున్న స్థలాలు చూపకపోవడంతో పోరాటాలు చేసామన్నారు. ఉమ్మడి శెట్టి పల్లె పంచాయతీలో జగనన్న ఇళ్ల పట్టాలు పొందిన వారికి ఎక్కడో సుదూర ప్రాంతమైన చిందేపల్లిలో స్థలాలు ఇవ్వడం సరికాదని, మంగళం పరిధిలోని నూతనంగా ఏర్పడ్డ తిరుమల నగర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని చెన్నాయిగుంట గ్రామ లెక్క దాఖల సర్వేనెంబర్‌ 195/2, 195/4లోని 41 ఎకరాల భూమిలో లబ్ధిదారులకు స్థలాలు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. మొదట్లో సర్వే నెంబర్లలో జగనన్న ఇళ్ల పట్టాలు పొందిన లబ్ధిదారులకు స్థలాలు ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసినా ఆ తర్వాత జరిగిన రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశంలో ఈ స్థలాన్ని సర్వే ట్రైనింగ్‌ అకాడమీకి బదలాయిస్తూ క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుందన్నారు. నిర్ణయం తీసుకున్న నాటి నుండి నేటి వరకు ఈ స్థలంలో ఎలాంటి కార్యకలాపాలు ప్రారంభించలేదని, జగనన్న ఇళ్ల పట్టాలు పొందిన వారికి ఇక్కడే స్థలాలు చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మోదీన్‌, ఇళ్ల స్థలాల పోరాట కమిటీ నాయకులు మీరాంబీ, కుమారి, జానకి, అములమ్మ పాల్గొన్నారు.

➡️