ఎన్నికల బాండ్ల దృష్టి మరల్చడానికే బిజెపి కుట్ర: గోపాల్‌ రెడ్

ఎన్నికల బాండ్ల దృష్టి మరల్చడానికే బిజెపి కుట్ర: గోపాల్‌ రెడ్డిప్రజాశక్తి-తిరుపతి(మంగళం): కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అధికార దాహంతో ప్రతిపక్షాలను ఆర్థికంగా ఇబ్బంది పెట్టి తిరిగి మళ్లీ అధికారం చేపట్టడానికి కుయుక్త రాజకీయాలను చేస్తోందని, ఇందులో భాగంగానే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ కూతురు కవిత, ఆప్‌ పార్టీ వ్యవస్థాపకులు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ లను అరెస్టు చేసిందని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి మాంగాటి గోపాల్‌ రెడ్డి ఆరోపించారు. శనివారం తిరుపతి ప్రెస్‌ క్లబ్‌ లో విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలను ఆర్థికంగా బలహీనపరచడానికి, ఇదే సమయంలో బిజెపి అధికారం చేపట్టడానికి కార్పొరేటర్‌ కంపెనీల నుండి ఎలక్ట్రోల్‌ బాండ్ల రూపంలో భారీగా స్వీకరించిన విరాళాల విషయాలను ప్రజల దృష్టినుండి మరల్చడానికి ఇలాంటి నీచ రాజకీయాలకు తెరతీసిందన్నారు. వాస్తవానికి కార్పొరేట్‌ కంపెనీలు తమ లాభంలో 7.5 శాతం మాత్రమే రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వవచ్చన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కూడా ఎలక్ట్రోల్‌ బాండ్ల విషయంలో సీరియస్‌ గా వ్యవహరించి ఇది క్విడ్‌ ప్రోకో గా పేర్కొనిందన్నారు. దేశంలోని వివిధ కార్పొరేట్‌ కంపెనీలు ద్వారా బిజెపికి 6 వేల కోట్ల రూపాయలకు పైగా విరాళాలు ముట్టాయన్నారు. కాంగ్రెస్‌కి చెందిన ఖాతాలను ఎప్పుడో 30 ఏళ్ల నాటి రిటర్న్‌ లను చూపలేదని ఎన్నికల సమయంలో స్తంభింప జేయడం వెనుక బిజెపి కుట్ర దాగి ఉందని దేశ ప్రజలందరికీ తెలుసన్నారు. 400 సీట్లు వస్తాయని చెప్పుకుంటున్న బిజెపికి ఈ ఎన్నికల్లో 200 సీట్లు రావడం కూడా గగనమేన్నారు. ఈ సమావేశంలో వెంకట నరసింహులు, సిద్దయ్య, రామచంద్రయ్య, రమేష్‌, గోపి గౌడ్‌, ప్రేమ్‌ సాగర్‌ పాల్గొన్నారు.

➡️