ఎస్‌వియు రిజిస్ట్రారు ఎవరో..!రేసులో పలువురు ఆశావహులు

ఎస్‌వియు రిజిస్ట్రారు ఎవరో..!రేసులో పలువురు ఆశావహులు

ఎస్‌వియు రిజిస్ట్రారు ఎవరో..!రేసులో పలువురు ఆశావహులుప్రజాశక్తి – క్యాంపస్‌ శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్‌గా ఆచార్య ఒఎండి హుస్సేన్‌ మూడేళ్లుగా పదవిలో కొనసాగుతున్నారు. సాధారణంగా వర్సిటీ రిజిస్ట్రార్‌ పదవీకాలం ఒకట్రెండు సంవత్సరాలే. ప్రస్తుత రిజిస్ట్రార్‌ మూడేళ్లుగా ఉన్నారు. ఈనెల 15, 16 తేదీల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ ఇవ్వనుండడంతో రిజిస్ట్రార్‌ మార్పుపై ఆసక్తి నెలకొంది. పలువురు ఆశావాహులు ‘కర్చీఫ్‌’ వేసి వేచి వున్నారు. ఈ మూడేళ్లలో బోధనేతర సిబ్బంది, అధ్యాపకుల, పరిశోధకుల ఆర్థికపరమైన ఫైల్స్‌ క్లియరెన్స్‌ ఇవ్వలేదన్న అపవాదు ప్రస్తుత రిజిస్ట్రార్‌పై ఉంది. ఎన్‌ఎంఆర్‌లు, టైంస్కేల్‌ ఉద్యోగులు, శాశ్వత బోధన, బోధనేతర సిబ్బంది సమస్యలను పలుమార్లు ఆయన దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించకపోవడంతో నిరసనలూ చేపట్టారు. ఈ నేపథ్యంలో వచ్చే రిజిస్ట్రార్‌ ఎవరన్న ఆసక్తి వర్సిటీలో నెలకొంది. గతంలో ఫిజిక్స్‌ విభాగానికి చెందిన ఆచార్య పి. శ్రీధర్‌ రెడ్డి పదవి కాలం ముగియడంతో అదే విభాగానికి చెందిన ఆచార్య ఓఎండి హుస్సేన్‌ ప్రభుత్వ పెద్దలు, జిల్లా మంత్రి అండదండలు, రిజర్వేషన్‌ కోటాలోని అంశాలు అన్నీ కలిసి రావడంతో రిజిస్ట్రార్‌ గా కొలువుదీరారు. పదవీకాలం కొనసాగింపుకు ఉన్నతాధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. పరిపాలనా భవనంలో రిజిస్ట్రార్‌ ఛాంబర్‌ ఓ నిగూఢ రహస్య నిధి లాంటిది. అందులో ఎన్నో ఆర్థికపరమైన చిక్కుముళ్లు. చేతులు తడిపితేనే ఫైల్‌ ముందుకు కదలదన్న ఆరోపణలూ ఉద్యోగ, విద్యార్థి సంఘాల నేతల నుంచి ఉంది. ఆర్థికపరమైన అంశాలతో ముడిపడి ఉన్న ఈ పదవిపై పలువురు ఇంజినీరింగ్‌, సైన్స్‌, ఆర్ట్స్‌, మేనేజ్మెంట్‌ కళాశాలల ఆచార్యులు కన్నేసి ఉన్నారు. మంత్రులు, శాసనసభ్యులు, ఇతర ప్రభుత్వ పెద్దలతో ఎవరికి వారే తమ తమ స్థాయిల్లో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ‘సామాజిక న్యాయం’ నెలకొల్పే దిశగా ఉన్నతాధికారుల అధికార విభజన జరగాలని విద్యార్థి సంఘాల నేతలు వీసీకి వినతిపత్రాలు అందజేశాయి. సమర్థుడు, పరిపాలనా అనుభవం కలిగిన వారికే రిజిస్ట్రార్‌ పదవిని విద్యార్థుల, వర్సిటీ శ్రేయస్సు కోసం పనిచేసేవారిని నియమించాలని వర్సిటీ వర్గాలు కోరుతున్నాయి.

➡️