ఓటమి భయంతో వైసీపీ దొంగ ఓట్ల దందా..!- చంద్రగిరిలో జరిగిన అవకతవకలపై ఎన్నికల కమిషన్‌కు కేస్‌ స్టడీ- నానిని పరామర్శించిన చంద్రబాబు

ఓటమి భయంతో వైసీపీ దొంగ ఓట్ల దందా..!- చంద్రగిరిలో జరిగిన అవకతవకలపై ఎన్నికల కమిషన్‌కు కేస్‌ స్టడీ- నానిని పరామర్శించిన చంద్రబాబు

ఓటమి భయంతో వైసీపీ దొంగ ఓట్ల దందా..!- చంద్రగిరిలో జరిగిన అవకతవకలపై ఎన్నికల కమిషన్‌కు కేస్‌ స్టడీ- నానిని పరామర్శించిన చంద్రబాబుప్రజాశక్తి- తిరుపతి టౌన్‌ ఓటమి భయంతో చరిత్రలో లేనివిధంగా వైసీపీ దొంగఓట్ల దందాకు పాల్పడుతోందని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రగిరి నియోజకవర్గం ఓటరు జాబితాలో జరిగిన అవకతవకలు ఎన్నికల కమిషన్‌కు కేస్‌ స్టడీగా తీసుకోవాలని, దొంగఓట్లను తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఇటీవల ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసనల్లో పులివర్తి నాని పెట్రోల్‌ పోసుకుని గాయాలపాలవ్వడంతో చంద్రబుబ నాయుడు నానిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎక్కడైనా ఓటరు లిస్టును ఎన్నికల అధికారులు చేస్తారు.. కానీ దుర్మార్గంగా రాష్ట్రంలో వైసీపీ నేతలు దొంగఓట్లు చేర్చుతున్నారని, టీడీపీ సానుభూతిపరులు ఓట్లు తొలగిస్తున్నారని అన్నారు. ఓట్ల అంశంలో రాష్ట్రమంతా ఏం జరుగుతోందో చూస్తే… ఎన్నికల కమిషన్‌కు చంద్రగిరి నియోజకర్గం కేస్‌ స్టడీగా ఉంటుందన్నారు. ఇటీవల ఎన్నికల కమిషన్‌ తిరుపతి కలెక్టర్‌, ఎస్పీఏలపై ఆగ్రహం వ్యక్తం చేసిందని, లోక్‌సభ ఉపఎన్నికల్లో జరిగిన అక్రమాలపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. విచ్చలవిడిగా ఫామ్‌-6, ఫామ్‌-7 దొంగఓట్ల చేర్పులు, టీడీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపుపై పులివర్తి నాని ఆరు నెలలుగా పోరాడుతున్నారని, ఈ అవకతవకలపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌తో ఆత్మహత్యాయత్నం చేశారన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 11 నియోజకవర్గాల్లో ఫామ్‌-6, ఫామ్‌-7, ఫామ్‌ -8ను విచ్చలవిడిగా ఉపయోగించారని అన్నారు. ఇవన్నీ చూస్తే ఎన్నికల అధికారులు ఎంతగా అధికారపార్టీ నేతలతో కుమ్మక్కయ్యారో తెలుస్తోందన్నారు. ఓట్ల అవకతవకలు చూడాల్సిన బాధ్యత ఉద్యోగులదని తప్పులు జరిగితే జైలుకు పంపించే అవకాశం ఉన్నా అధికారులు తేలిగ్గా తీసుకున్నారని అన్నారు. సచివాలయ సిబ్బందిని నియమించి అవకతవకలకు పాల్పడుతున్నారు. 10 ఎన్నికలు చూశాను..ఎప్పుడూ ఇలాంటి అవకతవకలు చూడలేదని, వైసీపీ నేతలకు పాస్‌వార్డు ఇవ్వడంతో ఎమ్మార్వో కార్యాలయంలో కూర్చుని నమోదు చేస్తున్నారని ఆరోపించారు. వాలంటీర్‌ వ్యవస్థ ఎన్నికల విధుల్లో ఉండదని ఎన్నికల కమిషన్‌ చెప్పిందన్నారు. వాలంటీర్లు కూడా ప్రజలకు మేలు చేయడం వరకే ఉంటే గౌరవిస్తామని, ఒక పార్టీకే పనిచేస్తే శిక్ష పడేలా చేస్తామని హెచ్చరించారు. అధికార యంత్రాగాన్ని నేరస్తులుగా తయారు చేస్తున్నారని, కుప్పంలో దొంగ ఓట్లు ఉంటాయని అన్నారు. తప్పించుకోవడానికి దొంగే దొంగ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

➡️