కలెక్టర్‌ లక్ష్మీషా బాధ్యతలు స్వీకరణ

కలెక్టర్‌ లక్ష్మీషా బాధ్యతలు స్వీకరణ

కలెక్టర్‌ లక్ష్మీషా బాధ్యతలు స్వీకరణప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి జిల్లాలో కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించడం ఎంతో సంతోషంగా ఉందని, జిల్లాను అన్ని శాఖల సమన్వయంతో ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తామని జిల్లా కలెక్టర్‌ లక్ష్మీ షా అన్నారు. బుధవారం తెల్లవారుజామున కుటుంబసమేతంగా శ్రీవారిని దర్శించుకున్న లక్ష్మీషా, అనంతరం కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఆయనకు అర్చకులు వేద మంత్రాలతో పూర్ణకుంభ స్వాగతం పలుకగా, జెసి శుభం బన్సల్‌, డిఆర్‌ఓ పెంచల కిషోర్‌ వెంట రాగా కలెక్టర్‌ ఛాంబర్‌ నందు లక్ష్మీ షా తిరుపతి జిల్లా కలెక్టర్‌ గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, ఆర్డీఓలు, డిప్యూటీ కలెక్టర్లు జిల్లా కలెక్టర్‌ కు పుష్ప గుచ్చాలు అందచేసి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్‌ మీడియాతో మాట్లాడుతూ తిరుమల, తిరుపతి కి ఎంతో చారిత్రక ప్రాముఖ్యత, ప్రాశస్త్యం ఉన్నదని, జిల్లా ప్రగతి ఒక్కరితో సాధ్యం కాదని, ఇది అన్ని శాఖల సమన్వయంతో సాధ్యమని, జిల్లా యంత్రాంగాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపిస్తూ ప్రభుత్వ సంక్షేమ, అభివద్ధి పథకాలు అర్హులైన ప్రతి పేద ప్రజానీకానికి అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పనిచేయడం ఎంతో ఛాలెంజ్‌ గా తీసుకొని ఎన్నికల కమిషన్‌ నిబంధనలు, ఆదేశాలమేరకు పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ అభివద్ధి పథకాల అమలుతో పాటు తిరుపతి జిల్లాలో ప్రోటోకాల్‌ బాధ్యతలను సమర్థవంతంగా ప్రజా ప్రతినిధులు, టీటీడీ చైర్మన్‌, ఈఓ, ఎస్పీ తదితరులతో సమన్వయం చేసుకొని చేపడతామని తెలిపారు. జర్నలిజం ప్రజాస్వామ్యానికి వెన్నెముకగా పాత్రికేయులు కళ్ళు, చెవులుగా నిర్మాణాత్మక విమర్శ, ఫీడ్‌ బ్యాక్‌ తో సమ సమాజ నిర్మాణానికి తోడ్పడేలా ఉండాలని వారు కోరారు. అనంతరం టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి ని కలెక్టర్‌ మర్యాద పూర్వకంగా వారి నివాసంలో కలిశారు.

➡️