కార్మికులపై ‘ఆక్సోరా’ ఉక్కుపాదం

Mar 14,2024 22:11
కార్మికులపై 'ఆక్సోరా' ఉక్కుపాదం

వేతనాలు చెల్లించకుండా కాలయాపననిరసన తెలిపితే తొలగిస్తామంటూ బెదిరింపులుప్రజాశక్తి-శ్రీకాళహస్తి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్‌ తొట్టంబేడు మండలం రౌతు సూరమాల గ్రామ సమీపంలో ఉన్న ఆక్సోరా రిసోర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పరిశ్రమ కార్మికులపై వేధింపులకు పాల్పడుతోంది. యాజమాన్యం అరాచకాలు నానాటికీ మితిమీరిపోతున్నాయి. కార్మికులను కట్టుబానిసల కన్నా హీనంగా చూస్తున్న పరిస్థితి నెలకొంది. ఆ కంపెనీ నుంచి బయటపడి వేరొక కంపెనీలో ఉపాధి పొందుదామన్నా వెళ్ళనీయని దుస్థితి. గొడ్డులా చాకిరి చేస్తేనే బకాయిలు చెల్లిస్తాం.. లేదంటే ఇక్కడే మీరు పస్తులతో మగ్గాల్సిందే అంటూ ఆక్సోరా యాజమాన్యం కార్మికులపై బెదిరింపులకు పాల్పడుతుండడం విచారకరం. ఒకవేళ మీరు నిరసన తెలిపినా.. ఉపాధి కోసం వేరొక పరిశ్రమకు వెళ్లినా ఒప్పందం ప్రకారం మీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆక్సోరా కార్మికులు తమకు న్యాయం చేయాలనీ, ఆక్సోరా యాజమాన్యం వేధింపుల నుంచి రక్షించాలంటూ ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు. అయినా ఉన్నతాధికారుల నుంచి స్పందన కరువవడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక కన్నీరు మున్నీరవుతున్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక చట్టాలను నీరు గార్చడంతోనే పరిశ్రమల యాజమాన్యాలు కార్మికుల పట్ల ఉక్కు పాదం మోపగలుగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి.తొట్టంబేడు మండలంలోని రౌతు సూరమాల గ్రామ సమీపంలో 2016లో ఆక్సోరా మెటల్‌ అండ్‌ లెడ్‌ కంపెనీని నెలకొల్పారు. ఈ పరిశ్రమలో సుమారు 90 మంది కార్మికులు గత కొన్ని సంవత్సరాలుగా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరిలో స్థానికులతో పాటు స్థానికేతరులూ ఉన్నారు. అయితే కొన్ని సంవత్సరాలుగా ఆక్సోరా కార్మికుల వద్ద శ్రమ దోపిడీకి పాల్పడుతోందన్న విమర్శలు వస్తున్నాయి. అంతేకాకుండా కార్మికులకు చెల్లించాల్సిన వేతనాలు, పీఎఫ్‌ లు సకాలంలో చెల్లించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. పదిమంది చేయాల్సిన పనిని ముగ్గురు, నలుగురితో చేయిస్తూ కార్మికుల చేత గుడ్డు చాకిరి చేయించుకుంటున్నారని విమర్శలు వచ్చాయి. దీంతో విసిగి వేసారిన కార్మికులు తమకు రావాల్సిన వేతన బకాయిలు, పీఎఫ్‌ లు వెంటనే చెల్లించాలనీ, లేకుంటే విధులను బహిష్కరిస్తామని కార్మికులు నోటీసులు ఇచ్చారు. కార్మికులకు మూడు నెలల వేతనాలు యాజమాన్యం చెల్లించకపోవడంతో కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితి ఏర్పడింది. కార్మికుల నుంచి నిరసన నోటీసు అందుకున్న పరిశ్రమ అధినేత విజయేంద్ర కేడియా బకాయి ఉన్న రెండు నెలల 8 రోజుల జీతం ఇవ్వకపోగా, పని చేయండి.. పని చేస్తే నే జీతం, లేకుంటే కేసులు పెడతామంటూ బెదిరింపులకు దిగిన పరిస్థితి ఏర్పడింది. అంతటితో ఆగకుండా కార్మికులను మధ్యాహ్నం వరకు ఎండలోనే నిలబెట్టి వారికి కనీసం తాగునీరు కూడా అందించకుండా ఇబ్బందులు పెట్టినట్లు సమాచారం. ఎండ తీవ్రతకు వడదెబ్బ సోకి ఇద్దరు కార్మికులు అస్వస్థతకు గురైనా వారిని కనీసం ఆస్పత్రికి కూడా తీసుకెళ్లలేదని తెలుస్తోంది. మధ్యాహ్నం పైబడి క్యాంటీన్‌ కి వెళితే అక్కడ భోజనం పెట్టొద్దంటూ నిర్వాహకులకు హుకుం జారీ చేసినట్లు సమాచారం. అక్కడితో ఆగకుండా కార్మికులు నివాసాలు ఉంటున్న అద్దింటి నిర్వాహకులకు ఫోన్‌ చేసి వాళ్లను వెంటనే ఖాళీ చేయించాల్సిందిగా ఒత్తిడి తెచ్చిన విచిత్ర పరిస్థితి. అంతేకాకుండా పరిశ్రమ కేంద్ర కార్యాలయం నుంచి న్యాయవాదులతో కార్మికులకు ఫోన్‌ చేసి మీరు నిరసన తెలిపితే, కంపెనీ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకుంటామో, వివరించి వారిని భయభ్రాంతులకు గురి చేసినట్లు సమాచారం. దీంతో ఆక్సొర వేధింపులకు తాళలేక ఇతర పరిశ్రమలకు ఉపాధి కోసం వెళ్లిన కార్మికులకు ఉద్యోగాలు రాకుండా, ఆయా పరిశ్రమల యాజమాన్యాలకు ఫోన్‌ చేసి కార్మికుల గురించి చెడుగా చెప్పి వారికి అక్కడ కూడా భతి లేకుండా చేశారని కార్మికులు ఆరోపిస్తున్నారు. పెండింగ్‌ వేతనాలు,,పీఎఫ్‌ అడిగితే ఏమైనా చేసుకోండి ఒక రూపాయి కూడా ఇవ్వనని, తనకు ఇన్సూరెన్స్‌ ఉందని, తాను క్లైమ్‌ చేసుకుంటా అంటూ క్రూరంగా వ్యవహరిస్తున్నారని కార్మికులు కన్నీరు మున్నీరవుతున్నారు. జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎస్పీ స్పందించి తమకు ఇకనైనా న్యాయం చేయాలని కోరుతున్నారు.

➡️