జగనన్నకు చెప్పనుబోతే అరెస్టు చేస్తారా..!అంగన్వాడీల అక్రమ అరెస్టులపై నిరసనలు

జగనన్నకు చెప్పనుబోతే అరెస్టు చేస్తారా..!అంగన్వాడీల అక్రమ అరెస్టులపై నిరసనలు

జగనన్నకు చెప్పనుబోతే అరెస్టు చేస్తారా..!అంగన్వాడీల అక్రమ అరెస్టులపై నిరసనలుప్రజాశక్తి-శ్రీకాళహస్తి: అంగన్వాడీలు తమ న్యాయపరమైన సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి వివరించేందుకు విజయవాడకు వెళితే అక్రమంగా అరెస్టు చేస్తారా అంటూ కార్మిక సంఘాల నాయకులు మండిపడ్డారు. విజయవాడలో అంగన్వాడి నాయకుల అరెస్టులు, నిర్బంధానికి వ్యతిరేకంగా సోమవారం స్థానిక అంబేద్కర్‌ విగ్రహం వద్ద సిఐటియు, ఏఐటీయూసీ, ఐఎఫ్టియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అంగేరి పుల్లయ్య మాట్లాడుతూ అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీలు తమ జీతాలను పెంచమని అడగడం గొంతెమ్మ కోర్కేమీ కాదనీ, పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా వారి డిమాండ్‌ సబబేనని స్పష్టం చేశారు. అంగన్వాడీల నిరవధిక సమ్మె నెలన్నర రోజులకు చేరుకున్నా గానీ, ప్రభుత్వంలో ఎలాంటి స్పందన లేకపోగా వారి ఉద్యమాన్ని అణచివేసే ధోరణిలోనే ముందుకు పోవడం బాధాకరమన్నారు. దీంతో అంగన్వాడీలు కోటి సంతకాలతో జగనన్నకు చెబుదామని విజయవాడ బయలుదేరితే ఎక్కడికక్కడ అరెస్టు చేసి నిర్బంధించడం జగన్‌ నిరంకుశత్వానికి పరాకాష్టగా నిలుస్తుందని ధ్వజమెత్తారు. ఇకనైనా ప్రభుత్వ తీరులో మార్పు రాకుంటే భవిష్యత్తు ఉద్యమం మరింత ధాటిగా ఉంటుందని హెచ్చరించారు. ఏఐటీయూసీ నాయకులు జనమాల గురవయ్య, మించిల శివకుమార్‌, గోపి, సిఐటియు నాయకులు వెంకటేష్‌, సంక్రాంతి వెంకటయ్య, గురునాథం, అన్వర్‌ బాషా, ఈశ్వరయ్య అంగన్వాడీలు పాల్గొన్నారు. తిరుపతి టౌన్‌: అంగన్వాడీలు కోటి సంతకాలతో జగనన్నకు చెబుదాం అంటూ ఆదివారం తిరుపతి నుంచి విజయవాడకు బయలుదేరారు. అయితే ఆదివారం రాత్రి కావలిలో అంగన్వాడీలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్లో నిర్బంధించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే రకమైన వైఖరితో అన్ని పోలీస్‌ స్టేషన్లో నిర్భందించారు. ప్రభుత్వం అంగన్వాడీలపై ధమనకాండకు పాల్పడడాన్ని నిరసిస్తూ సోమవారం పాత మున్సిపల్‌ కార్యాలయం వద్ద కళ్ళకు నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ అంగన్వాడీ ఆడబిడ్డలపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి అడుగడుగునా పోలీసులతో దమన కాండకు పాల్పడటాన్ని తప్పు పట్టారు. అంగన్వాడీలు చేస్తున్న పోరాటానికి సిపిఎం అండగా ఉంటుందన్నారు. అంగన్వాడీలు విధుల్లో చేరకపోతే విధుల నుండి తొలగిస్తామని ప్రభుత్వం బెదిరించడాన్ని ఖండించారు. అంగనవాడీల పోరాటాన్ని అణచివేయాలని చూస్తే ప్రభుత్వం పతనం కావడం ఖాయమన్నారు. పోరాటాన్ని మరింత ఉధతం చేస్తామని, అవసరమైతే రాష్ట్రబంద్‌కు కూడా వెనకాడబోమని హెచ్చరించారు. డివైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌. జయ చంద్ర, ఐద్వా జిల్లా కార్యదర్శి పి.సాయి లక్ష్మి, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఎం.జయంతి, ఆటో డ్రైవర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి తంజావూరు మురళి, సిపిఎం నగర కార్యదర్శి టి.సుబ్రమణ్యం, టిటిడి కాంటాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు డి.పార్థసారధి రెడ్డి, బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి ఎండి శ్రీనివాసులు పాల్గొన్నారు. వెంకటగిరి: అంగన్వాడీలు చేపట్టిన సమ్మె సోమవారం నాటికి 42వ రోజుకు చేరింది. విజయవాడలో జరుగుతున్న అంగన్వాడీల అక్రమ అరెస్టులను ఖండిస్తూ బంగారుపేట ఏరియాలో ర్యాలీ నిర్వహించారు. సిఐటియు తిరుపతి జిల్లా కమిటీ సభ్యులు వడ్డిపల్లి చెంగయ్య, ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ మండల అధ్యక్షులు సుభాషిని, ప్రాజెక్ట్‌ లీడర్‌ నిర్మల, మల్లీశ్వరి పాల్గొన్నారు. రేణిగుంట: రేణిగుంట ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ నిరసన సమ్మె సోమవారం నాటికి 43వ రోజుకు చేరుకుంది. రేణిగుంట అంబేద్కర్‌ విగ్రహం వద్ద వద్ద అంగన్వాడీల అక్రమ అరెస్టులను నిరసిస్తూ ధర్నా చేశారు. సిఐటియు నాయకులు నర్సింహారెడ్డి, సిపిఎం నాయకులు ఓ.వెంకట రమణ, ప్రజానాట్యమండలి మండల నాయకులు సెల్వరాజ్‌, రాజశేఖర్‌, సత్యశ్రీ పాల్గొన్నారు. పిచ్చాటూరు: అంగన్వాడీ వర్కర్లు తలపెట్టిన చలో విజయవాడకు రాష్ట్రవ్యాప్తంగా వెళ్లనున్న అంగన్వాడీలకు అనుమతి లేదంటూ పోలీసులు ఎక్కడికక్కడ నోటీసులు ఇచ్చి కట్టడి చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా మహిళలపై పోలీసు నిర్భందాలను ప్రయోగించి న్యాయమైన సమస్యలపై పోరాడుతున్న తమని అణచివేయాలని చూడటం సరైన పద్ధతి కాదని అన్నారు. గూడూరు టౌన్‌: రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల నిర్బంధాలు, అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని అంగన్వాడీ యూనియన్‌ అధ్యక్షురాలు ఏ.ఇంద్రావతి, కార్యదర్శి బిఎస్‌.ప్రభావతి, రైతు సంఘం నాయకులు జోగి శివకుమార్‌, సిఐటియు పట్టణ అధ్యక్షులు బివి.రమణయ్య, కార్యదర్శి యస్‌.సురేష్‌ పేర్కొన్నారు. అంగన్వాడీలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ పట్టణంలోని టవర్‌క్లాక్‌ సెంటర్లో నిరసన తెలిపారు. అంగన్వాడీలపై నిర్బంధాన్ని ఆపండిబెదిరింపులు మాని సమస్య పరిష్కారానికి కృషి చేయండిజిల్లా కలెక్టర్‌ ద్వారా ప్రభుత్వానికి అఖిలపక్షం వినతితిరుపతి టౌన్‌: అంగన్వాడీలపై రాష్ట్రంలో సాగుతున్న అణిచివేత దోరణులను తక్షణం ఉపసంహరించుకోవాలని, వారిపై నిర్బంధాన్ని ఆపివేయాలని తొలగింపుల పేరుతో సాగుతున్న డ్రామాలు ఆపి వారి న్యాయమైన సమస్యల పరిష్కారానికి తోడ్పడాలని తిరుపతి జిల్లా అఖిలపక్ష నేతలు కలెక్టర్‌ వెంకట రమణారెడ్డి ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో జి.నరసింహ యాదవ్‌, పులివర్తి సుధ, మనోహరాచారి (తెలుగుదేశం) వి.నాగరాజు, కందారపు మురళి, ఎస్‌.జయచంద్ర, పి.హేమలత (సిపిఎం), పూతలపట్టు అంజయ్య (రిపబ్లికన్‌ పార్టీ), మురళి (కాంగ్రెసు)లు కలెక్టర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.

➡️