జిల్లా ఎస్‌పిగా కృష్ణకాంత్‌ పటేల్‌ బాధ్యతలు స్వీకరణ

జిల్లా ఎస్‌పిగా కృష్ణకాంత్‌ పటేల్‌ బాధ్యతలు స్వీకరణ

జిల్లా ఎస్‌పిగా కృష్ణకాంత్‌ పటేల్‌ బాధ్యతలు స్వీకరణప్రజాశక్తి- తిరుపతి సిటి: తిరుపతి జిల్లా నూతన ఎస్‌పిగా కృష్ణకాంత్‌ పటేల్‌ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. 2018 బ్యాచ్‌ ఐపిఎస్‌ అధికారి అయిన ఆయన గతంలో రంపచోడవరం ఏసిపిగా, కర్నూలు జిల్లా సెబ్‌ అదనపు ఎస్‌పిగా, విజయవాడ కమిషనరేట్‌లో శాంతిభద్రతల డిసిపిగా విధులు నిర్వహించారు. సాధరణ బదిలీల్లో భాగంగా తిరుపతి జిల్లా ఎస్‌పిగా బదిలీపై వచ్చిన ఆయన మంగళవారం వేకువజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుపతి ప్రకాశం రోడ్డులోని జిల్లా పోలీసు కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం ఆయన ఎస్‌పిగా బాధ్యతలు స్వీకరించి మీడియాతో మాట్లాడారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి, స్వేచ్చగా, న్యాయబద్ధంగా, కచ్చితత్వంతో ప్రణాళికలను రూపొందించి ముందుకు తీసుకువెళ్తామన్నారు. తిరుపతికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుందని, మానవసేవయే మాధవ సేవగా భావించి, వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా శాంతిభ్రదతలను కాపాడుకుంటూ అన్ని రకాల భద్రతాచర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో శ్రీహరికోట రాకెట్‌ ప్రయోగ కేంద్రం, శ్రీసిటీ పారిశ్రామిక వాడ, వంటి సంక్లీష్టమైన మౌలిక సదుపాయాలు నెలకొని ఉన్నాయి, ఇక్కడ కూడా తగిన గట్టి భద్రత చర్యలు తీసుకుంటామన్నారు. తిరుపతి జిల్లా తమిళనాడు రాష్ట్రంలో ఎక్కువుగా సరిహద్దు ఉందని, కర్ణాటక దగ్గరగా ఉందని, ఇరుగుపొరుగు జిల్లాల పోలీసు అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి సరిహద్దుల ద్వారా ఎలాంటి అక్రమ రవాణా జరగకుండా తనిఖీలను ముమ్మరం చేస్తామన్నారు. విధి నిర్వహణలో పోలీసులకు అనేక బాధ్యతలు ఉంటాయి, కానీ సమస్య గురించి స్టేషన్‌కు వచ్చే వారితో మర్యాదగా మాట్లాడి వారి పట్ల సానుభూతిపరులై సహనంతో వ్యవహరించి, వారికి పరిష్కారమార్గం చూపాలని సూచించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు మీడియా కూడా సహకారం అందించాలని కోరారు. ట్రైనీ ఐపిఎస్‌ కదేవరాజ్‌ మనీష్‌ పాటిల్‌, ఎఎస్‌పిలు వెంకట్రావు, కులశేఖర్‌, విమలకుమారి, సెబ్‌ ఎఎస్‌పి రాజేంద్ర, డిఎస్‌పిలు, సిఐలు పాల్గొన్నారు.

➡️