‘జూడో’లకు స్టైఫండ్‌ ‘బకాయిలు’

Feb 15,2024 21:41
'జూడో'లకు స్టైఫండ్‌ 'బకాయిలు'

ప్రజాశక్తి-తిరుపతి సిటి బకాయిలు.. బకాయిలు.. ఇది రాష్ట్రంలో జరుగుతున్న నిరసన శిబిరాల వద్ద పదేపదే వినిపిస్తున్న పదం. ఇటీవల ఉపాధ్యాయులు ఆర్థిక బకాయిల కోసం ఆందోళన చేస్తుంటే, నిన్నమొన్న ఉద్యోగులు భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. తాజాగా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే జూనియర్‌ వైద్యులకు ఆరునెలలుగా స్టైఫండ్‌ బకాయి పడి పేరుకుపోయింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాల్లో పని చేయాల్సిన జూనియర్‌ వైద్యులు, సొంత ఖర్చులతో విధులకు హాజరుకాలేక అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వానికి, అధికారులకు ఎన్ని సార్లు విన్నవించినా ఫలితం శూన్యం. ఘనత వహించిన రుయాలో విధులు నిర్వహించే జూడోలు బకాయిల కోసం బాధపడుతూనే ఉన్నారు. శ్రీవెంకటేశ్వర మెడికల్‌ కళాశాల. ఎంతో మంది ప్రముఖ వైద్యులను, మహనీయులను అందించిన ఘనత గలది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ సిఎం డాక్టరు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వంటి వారు ఆ కళాశాల నుంచే వైద్యపట్టా పొందారు. దీనికి అనుబంధంగా ఉన్న శ్రీవేంకటేశ్వర రామనారాయణ రుయా గవర్నమెంట్‌ జనరల్‌ ఆసుపత్రి (ఎస్‌విఆర్‌ఆర్‌జిజిహెచ్‌) రాయలసీమలోనే అదిపెద్ద పేదల ప్రభుత్వ ఆసుపత్రి. దీనికి తోడు రాష్ట్రంలోనే ఏకైక మహిళా ప్రసూతి వైద్యశాల, చిన్నపిల్లల ఆసుపత్రి ఉంది. ఎస్‌వి మెడికల్‌ కళాశాలలో చదువుకుంటూ ఈ మూడు ఆసుపత్రుల్లో విధులు నిర్వహిస్తుంటారు జూనియర్‌ డాక్టర్లు. ఎస్‌విఎంసి పరిధిలో 200 మంది విద్యార్థులు ఎంబిబిఎస్‌ వైద్యవిద్యను అభ్యశిస్తున్నారు. వీరికి ప్రతి నెలా స్టయిఫండ్‌గా ప్రభుత్వం 22వేల రూపాయలను మంజూరు చేస్తుంది. కానీ గత ఆరు నెలలుగా స్టయిఫండ్‌ విడుదల చేసిన పాపాన పోలేదు. తరచూ నెల, రెండు నెలలు ఆలస్యంగా స్టయిఫండ్‌ వచ్చినా వైద్య విద్యార్థులు ఎలాగోలా నెట్టుకొచ్చారు. గత ఆరు నెలలుగా రాకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. పైగా కర్నూలు, నెల్లూరు, నాయుడుపేట, గూడూరు ప్రాంతాల్లో వీరు అప్రెంటీస్‌ పద్దతిలో విధులు నిర్వహించేందుకు వెళ్లాలి. దీనికి అదనంగా ఎలాంటి టిఏ, డిఏలు ఇవ్వరు. తప్పని పరిస్థితుల్లో సొంత ఖర్చులతోనే దూర ప్రాంతాల్లో సైతం విధులకు హాజరవుతారు. కానీ ఆరు నెలలుగా స్టయిఫండ్‌ విడుదల కాకపోవడంతో ఇంటి నుంచి ఖర్చులుగా డబ్బులు తెచ్చుకోలేక, అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పైగా మరో 15 ,20 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ రానుంది. ఈ నేపధ్యంలో తమ బకాయిలు మాట పరిస్తితి ఏంటో అర్ధం కానీ పరిస్థితి. రుయా అధికారుల వల్లే జూడోలకు ఈ పరిస్థితి దాపురించింది. సరైన సమయంలో తమకు సంబంధించిన రికార్డులు ఉన్నతాధికారులకు చేర్చకపోవడం వల్లే నేడు జూడోలకు ఇబ్బందులు తప్పడం లేదు. అధికారులు ఏదోలా చేస్తారని సరిపుచ్చుకున్న వైద్య విద్యార్థులు అనేక సార్లు విన్నవించిన పట్టించుకోకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో పోరాటాలకు సిద్దమయ్యారు. నాలుగైదు రోజుల్లో సమస్య పరిష్కారం కాకపోతే దశలవారీ విధులు బహిష్కరిస్తామని, అందర్ని కలుపుకుని సమ్మె బాట పడతామని తాజాగా అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. జూడోల నిరసనస్టైఫెండ్‌ బకాయిలు చెల్లించాలని కోరుతూ జూనియర్‌ డాక్టర్లు నిరసన వ్యక్తం చేశారు. స్థానిక రుయా ఆసుపత్రి పరిపాలన భవనం ఎదుట గురువారం జరిగిన కార్యక్రమంలో జూడోల ఉపాధ్యక్షులు వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ గత ఏడాది సెప్టెంబర్‌ నెల నుంచి తమకు స్టయిఫండ్‌ విడుదల చేయలేదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తాము ఇబ్బందులు పడ్డామన్నారు. ప్రతినెలా తమ సమస్యలు స్థానిక అధికారులకు విన్నవించిన ఫలితం శూన్యం అన్నారు. జనవరి మూడో తేదీ నిరసన తెలిపినా స్పందించలేదని, ఇప్పుడు మరోసారి నిరసనకు దిగాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. మూడు రోజుల్లో సమస్య పరిష్కరించకపోతే, విద్యార్థులందరినీ కలుపుకొని సమ్మె బాట పడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భార్గవ్‌, ఇద్రాష్‌, జూనియర్‌ డాక్టర్లు పాల్గొన్నారు.

➡️