డ్రైనేజీలను శుభ్రంగా ఉంచాలి : కమిషనర్‌

Nov 28,2023 22:50
డ్రైనేజీలను శుభ్రంగా ఉంచాలి : కమిషనర్‌

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: వర్షాల నేపథ్యంలో నగరంలోని డ్రైనేజీలు, కల్వర్టర్లు, లోతట్టు ప్రాంతాల వద్ద ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని నగర కమిషనర్‌ డాక్టర్‌ జె,అరుణ ప్రజారోగ్య విభాగం అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం కమిషనర్‌ నగరంలో పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు. ఎమ్మెస్సార్‌ సర్కిల్‌ వద్దనున్న మేజర్‌ డ్రైన్‌ను తనిఖీ చేశారు. కాలువలో నీటిప్రవాహానికి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు వ్యర్ధాలను తొలగించాలన్నారు. అనంతరం కట్టమంచి మార్కెట్‌ యార్డ్‌ వద్ద కల్వర్టర్‌ వద్ద మురుగునీటి ప్రవాహాన్ని పరిశీలించారు. లిల్లీ వంతెన వద్ద పరిస్థితిని సమీక్షించారు. సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ కల్వర్టర్ల వద్ద వ్యర్థాలు చిక్కుకోకుండా ఇనుప మెస్‌ ఏర్పాటు చేయాలన్నారు. లోతట్టు ప్రాంతాలు, వర్షాల సమయంలో నీరు పొంగే ప్రాంతాల్లో నీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. కార్మికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి పారిశుద్ధ్య పనులు నిర్వహించే సమయంలో కార్మికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, చేతికి గ్లౌజులు, ఆప్రాన్‌, మాస్క్‌, ఐడి కార్డు కచ్చితంగా వినియోగించాలన్నారు. పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యపరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని, పారిశుద్ధ్య కార్మికులు ప్రతిఒక్కరి ఆరోగ్య పరిస్థితిని రిజిస్టర్లలో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన సమయంలో మెరుగైన వైద్యం అందించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్‌ వివరించారు. కార్యక్రమంలో ఎంహెచ్వో డాక్టర్‌ లోకేష్‌, శానిటరీ ఇన్స్పెక్టర్లు చిన్నయ్య, నరసింహ, లోకనాథం, వార్డు కార్యదర్శులు పాల్గొన్నారు.

➡️