నియమావళిని పటిష్టంగా అమలు చేయాలి..రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్‌ కుమార్‌ మీనా

Mar 17,2024 22:32
నియమావళిని పటిష్టంగా అమలు చేయాలి..రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్‌ కుమార్‌ మీనా

ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌: ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాల్లో రాజకీయ ప్రకటనలతో ఉన్న హార్డింగ్‌లను, పోస్టర్లు, కటౌట్లను తక్షణమే తొలగించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలుపర్చేందుకు జిల్లా ఎన్నికల అధికారులు తీసుకుంటున్న చర్యలను ఆదివారం రాష్ట్ర సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఈఓ సమీక్షించగా తిరుపతి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ, సీఈఓ కార్యాలయం నుండి హాజరై జిల్లాలో సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై, జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ సందర్బంగా సిఈఓ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుండి 24 గంటల్లో ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాల్లోను, 48 గంటల్లో ప్రైవేటు వ్యక్తుల స్థలాల్లోనూ అనుమతి లేకుండా ఉన్న రాజకీయ ప్రకటనలను తొలగించాల్సి ఉందన్నారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్లు క్షేత్రస్థాయిలో విస్తతంగా పర్యటిస్తూ ఈ నియమ నిబంధనలను పటిష్టంగా అమలు పర్చేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సి-విజిల్లో అందే ఫిర్యాదులపై 100 నిమిషాల్లోపు, ఎన్నికల సంఘం నుండి అందే ఫిర్యాదులపై అదే రోజున చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

➡️