నేటినుంచి మున్సిపల్‌ కార్మికుల నిరవధిక సమ్మె

నేటినుంచి మున్సిపల్‌ కార్మికుల నిరవధిక సమ్మె

నేటినుంచి మున్సిపల్‌ కార్మికుల నిరవధిక సమ్మెప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఫెడరేషన్‌ సిఐటియు అనుబంధ సంఘం రాష్ట్రవ్యాప్తంగా 26వ తేదీ మంగళవారం నుండి చేపట్టనున్న నిరవధిక సమ్మెను జయప్రదం చేయాలని యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు జి.బాలసుబ్రమణ్యం, సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి కె.వేణుగోపాల్‌ పిలుపునిచ్చారు. తిరుపతి సిఐటియు కార్యాలయంలో విలేకరులతో వారు మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికుల సమ్మెపై అనేకమార్లు ఇప్పటికే ఆందోళన చేసినా, అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదన్నారు. కరోనా సమయంలో పారిశుధ్య కార్మికుల పనిని ప్రశంసించారని, మీరే దేవుళ్లని చెప్పడం తప్ప వారి సమస్యలను మాత్రం పరిష్కరించలేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 70 మంది కరోనా బారిన పడి చనిపోతే వారి కుటుంబాలకు ఎటువంటి ఆర్థిక సాయం చేయలేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పుప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఉద్యోగ విరమణ పొందిన తర్వాత పెన్షన్‌ గ్యారెంటీ చేయాలని, కొన్ని విభాగాల వారికి సిపిఎస్‌ రద్దుచేసి ఓపిఎస్‌ అమలు చేస్తానన్న వాగ్దానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్‌చేశారు. ఒక్కరోజు పారిశుధ్య కార్మికులు విధుల్లోకి రాకపోతేనే చెత్త పేరుకుపోతుందని, వీధిలైట్లు వెలగవని, దోమలకు ఫాగింగ్‌చేసే దిక్కు ఉండదని, రాష్ట్రం మొత్తం స్తంభించిపోతుందన్నారు. మున్సిపల్‌ కార్మికులు సమ్మె చేస్తే రాష్ట్రవ్యాప్తంగా జనం రోగాల బారిన పడతారన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మున్సిపల్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో సిఐటియు నేతలు బుజ్జి, బాలాజీ, పి, మునిరాజా, జయంతి, రవి తదితరులు పాల్గొన్నారు.పుత్తూరులో ఎఐటియుసి మున్సిపల్‌ కార్మికుల గౌరవాధ్యక్షులు డి.మహేష్‌ ఆధ్వర్యంలో సమ్మె నోటీసును మున్సిపల్‌ మేనేజర్‌కు సోమవారం అందించారు.

➡️