పింఛన్‌ కోసం వచ్చి…

పింఛన్‌ కోసం వచ్చి...

పింఛన్‌ కోసం వచ్చి…ప్రజాశక్తి- వెంకటగిరిఎపుడూ ఒకటో తేదీ ఇచ్చే పింఛన్‌ రాకపోవడంతో విషయం తెలుసుకుందామని సచివాలయానికి వెళ్లిన వెంకటయ్య (80) గుండెపోటుతో మృతిచెందాడు. ఈ ఘటన తిరుపతి జిల్లా వెంకటగిరిలో సోమవారం చోటు చేసుకుంది. కుటుంబీకుల వివరాల మేరకు… వెంకయ్య చిన్న కుమార్తె బొడిచర్ల చిన్నమ్మ తిరుపతిలో ఉంటుంది. ఆమె వద్దనే ఉంటూ ప్రతినెలా వెంకటగిరికి వచ్చి పింఛన్‌ తీసకుని వెళుతుంటాడు. వెంకటయ్య ఒకటో తేదీ పింఛన్‌ కోసం తిరుపతి నుంచి వెంకటగిరికి వెళ్లి మొదట వాలంటీర్‌ను కలిసాడు. అయితే వాలంటీర్లు ఇవ్వడం లేదని, సచివాలయంలో ఇస్తారని చెప్పడంతో మండుటెండలోనే సచివాలయానికి వెళ్లాడు. మూడో తేదీ నుంచి ఇస్తామని చెప్పడంతో వెంకటగిరిలోని స్వగృహానికి వెళ్లాడు. ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికి మృతిచెందాడు. ఆయనకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని, పింఛన్‌ తీసుకుని రావడానికి వచ్చారని తెలిపారు. బంగారుపేటలోని ప్రాథమిక పాఠశాల వీధిలోని ఆయన స్వగృహంలో మంగళవారం అంత్యక్రియలు జరిగాయి. వెంకటగిరి వైఎసఆర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి రాంకుమార్‌రెడ్డి ఇది ప్రతిపక్షాల వల్లే జరిగిందని, పింఛన్‌ అందలేదని మృతిచెందాడని మీడియాకు తెలిపారు. టిడిపి మాజీ ఎంఎల్‌ఎ కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు అంతమంది ఉండగా ఇంటింటికి వెళ్లి ఎందుకు పింఛన్‌ ఇవ్వలేదని, అధికార పార్టీ చేతగానితనం వల్లే ఇది జరిగిందని మండిపడ్డారు. ఇంటి వద్దనే పింఛన్‌ ఇవ్వాలని మున్సిపల్‌ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు.

➡️