పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వకపోతే …ఎర్రగుట్టను ఆక్రమిస్తాం…

పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వకపోతే ...ఎర్రగుట్టను ఆక్రమిస్తాం...

పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వకపోతే …ఎర్రగుట్టను ఆక్రమిస్తాం…ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌: స్థానిక యశోదానగర్‌లోని సిపిఎం జిల్లా కార్యాలయంలో కరకంబాడీ ఇళ్లస్థలాలు పోరాట కమిటీ మంగళవారం సదస్సును నిర్వహించింది. ఈసందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ కరకంబాడీ పంచాయతీలోని 10వేల ఎకరాల ప్రభుత్వ భూములు భూకబ్జాదారుల చేతుల్లో పెట్టుకుని కంచెలు వేసుకుని ఆక్రమించుకుంటుంటే రెవెన్యూ శాఖ చోద్యం చూస్తోందని విమర్శించారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇళ్లులేని పేదలందరికీ ఇంటిస్థలాలు ఇచ్చి న్యాయం చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చి, అర్హులుగా గుర్తించి జగనన్న పట్టా ఇచ్చిన నిరుపేదలకు సైతం స్థలాలు చూపకపోవడం వారిని మోసం చేయడమే అన్నారు. పట్టాలు ఇచ్చి ఏళ్లు గడిచినా స్థలం చూపకపోవడంతోనే ప్రభుత్వ భుమి అయిన ఎర్రగుట్టపై గుడిసెలు వేసుకోవల్సి వచ్చిందన్నారు. భూకబ్జాదారులను వదిలి పేదలు వేసుకున్న గుడిసెలను అధికారులు, పోలీసులు తెల్లవారు జామున జేసిబిలతో తొలగించడం అడ్డుకున్న మహిళలపై దాడులు చేయడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. 153 /1 సర్వేనెంబర్‌లో ఉన్న 125 ఎకరాల ప్రభుత్వ భూమిని సిద్దులు రవి ఆక్రమించి తప్పుడు రికార్డు కాగితాలతో కోర్టుకు వెళ్లారని, దీనిపై తిరుపతి జిల్లా కోర్టు సిద్దుల రవి దొంగని సిబిఐ, సిబి సిఐడి ఎంక్వయిరీ చేసి సిద్దుల రవిని అతనికి సహకరించిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోమని 2018లో జిల్లా సివిల్‌ జడ్జి జడ్జిమెంట్‌ ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. 2018లో జడ్జిమెంట్‌ ఇచ్చినా ఇప్పటివరకు చర్యలు తీసుకోకుండా కేసులు పెట్టకుండా ఉండడం వెనుక ఆంతర్యమేంటని తెలపాలన్నారు. ఇకనైనా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అలసత్వం వహిస్తే ఎర్రగుట్టను మళ్లీ పేదలు ఆక్రమిస్తారని హెచ్చరించారు. సమావేశంలో కెవిపిఎస్‌ జిల్లా నాయకులు సెల్వరాజు, నగర కార్యదర్శి టి.సుబ్రహ్మణ్యం, నాయకులు సత్యశ్రీ, రాజశేఖర్‌, శివానందం, దీప, అభి, ప్రశాంత్‌, ప్రకాష్‌ పాల్గొన్నారు.

➡️