పేదలపై ప్రతాపం

పేదలపై ప్రతాపం

పేదలపై ప్రతాపంప్రజాశక్తి- తిరుపతి సిటి: వైసిపి పాలనలో పేదలపై, కర్షకులు, కార్మికులు, మహిళలపై అధికార ప్రతాపం మితిమీరి పోయింది. దోపిడికి కాదేది అనర్హం అనే రీతిలో వ్యవహరిస్తూ అధికారులు, పోలీసులు అండతోనే అధికార పార్టీ నాయకులు ఇసుక, మట్టి, గంజాయి, ఎర్రచందనం, అక్రమ మద్యం తరలింపులకు పాల్పుడుతూ, ఇది చాలదన్నట్లు భూముల కబ్జాలకు కూడా పాల్పడుతున్నారు. ప్రభుత్వ భూములే కాదు సుమా, అండబలం, అధికార బలం, ఆర్ధిక బలంతో ప్రైవేట్‌ స్థలాల్లో కూడా అడుగేసి, అంతా మాదే అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. వీరిని కనీసం ప్రశ్నించని, రెవెన్యూ, జిల్లా అధికారులు, పోలీసులు పేదలు నిలువ నీడ కోసం కబ్జాదారులు అక్రమంగా ఆక్రమించిన ప్రభుత్వ భూములను తమకు అప్పగించాలని అడిగితే లాఠీదెబ్బలు, అక్రమకేసులు తప్పడం లేదు. ఇటీవల చోటు చేసుకున్న కొన్ని సంఘటనలే అందుకు నిదర్శనాలు.ఆహర్నిశలు కష్టపడి, రెక్కాడితేకాని డొక్కాడనివి పేదల బతుకులు. రోజంత కష్టించిన చాలీచాలని కూలీలు, దాంతో కుటుంబాలను పస్తులతో లేకుండా పోషించుకోవడమే కష్టం. పైగా అద్దె ఇంటికి బాడుగు, విద్యుత్‌ బిల్లులు, డ్రైనేజి బిల్లు, చెత్త బిల్లు, ఇతరాత్రవి చెల్లించాలి. ఇవ్వన్ని చెల్లించే స్తోమత లేకుండా అల్లాడుతున్న పేదలు తమకు సెంట్‌ స్థలం కేటాయించి, ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరితే అది అక్రమం. ప్రభుత్వ భూములను చూపి, ఇక్కడే తమకు స్థలాలు ఇవ్వాలని కోరితే అది దిక్కారం. అదే వందల ఎకరాలు అధికార పార్టీ నాయకులు స్వాధీనం చేసుకుంటే అది సక్రమం, దానికి అధికారులు సైతం మద్దతు. పోలీసులు కాపలా. ఈ కోవలోవే ఇటీవల జరిగిన ఘటనలు… తిరుపతి అర్బన్‌, రూరల్‌ ప్రాంతంలోని పలువురు పేదలకు ప్రభుత్వం ఇంటిస్థలాలు ఇస్తామని ప్రకటించి, పట్టాలు సైతం ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు స్థలాలు చూపలేదు. ఎక్కడో సుదీర ప్రాంతంలోని చిందేపల్లెలో ఇళ్లస్థలాలు చూపిస్తామని అధికారులు చెప్పారు. ఇది అన్యాయం దగ్గరగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని బాధితులు కోరారు. వారందరు ఎర్రజెండా (సిపిఎం) సహకారంతో ఉమ్మడి శెట్టిపల్లి పంచాయతీలోని చెన్నాయగుంటల లెక్కదాఖలు సర్వేనెంబరు 195/2లో ఉన్న 41ఎకరాల ప్రభుత్వం స్థలాన్ని కొంత మంది కబ్జాకు పాల్పడుతున్నారని, ఇక్కడ తమకు స్థలాలు కేటాయించాలని కోరారు. పేదలందరు కలిసి అక్కడ ఎర్రజెండాలు నాటారు. అంతే అధికారపార్టీ నాయకులు కన్నుసైగతో పోలీసులు హుటాహుటీన అక్కడకు చేరుకుని, ముందస్తుగా సిపిఎం నాయకులను హౌస్‌ అరెస్టులు చేసి, పేదలపై లాఠీ ఝులిపించారు. మహిళలను సైతం మగ పోలీసులు ఈడ్చిపడేసి గోలగోల చేశారు. అడ్డొచ్చిన సిపిఎం నాయకులపై సైతం పోలీసులు దాడులు చేసి గాయపరిచారు. కరకంబాడీలో మరీ బీభత్సం బిటిఆర్‌ కాలనీ ఘటన మరుసటి రోజే కరకంబాడీ వద్ద గుట్టలో పేదల నిర్మించుకున్న గుడిసెలపై పోలీసులు విరుచకపడ్డారు. ప్రభుత్వానికి సంబంధించిన 150 ఎకరాలకుపైగా ఉన్న స్థలాన్ని అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తి లీజు పేరుతో ఆక్రమించుకని, కొండలు, గుట్టలు తవ్వేసి, అక్రమంగా మైనింగ్‌ చేసి కోట్లాది రూపాయలను దోచుకుంటున్నా అధికారులు స్పందించలేదు. ఇది అక్రమం, అన్యాయం అని ప్రజలే ఎదురుతిరిగి, అదే ప్రాంతంలో ఎర్రజెండా (సిపిఎం) సహకారంతో గుడిసెలు వేసుకున్నారు. సుమారు నెల రోజుల పాటు ముళ్లు, చెట్లపొదల్లో చిన్నచిన్న గుడిసెల్లోనే కాపురం ఉంటున్న పేదలపై రాక్షేసత్వాన్ని ప్రదర్శించారు పోలీసులు. అధికార పార్టీ ఆదేశాలతో, జిల్లా అధికారుల ప్రోద్బలంతో పోలీసులు వేకువజామున 3 గంటలకే ఆ ప్రాంతానికి చేరుకుని, ఉగ్రవాదులతో యుద్ధాన్ని తలపించే రీతిలో 600మంది పోలీసులు, పైర్‌ ఇంజన్లు, అంబులెన్సులు, జెసిబిలు, హిటాచీలతో పేదలపై ప్రతాపం చూపారు. కనిపించిన వారిని కనిపించినట్లు చావబాదారు. గుడిసెలను పీకేసి, సామాన్లను విసిరేసి అబ్బో అదో పెద్ద ప్రపంచ యుద్ధాన్నే తలపించారు. దీన్నిపై కనీసం బూర్జవ రాజకీయ పార్టీలు స్పందించన కూడా తెలపలేదు. అంటే వారి మద్దతు ఎవ్వరికో ఇట్టే అర్దమవుతోంది. ఈ ఘటనకు రెండు రోజుల ముందు తిరుపతి రూరల్‌ కుంట్రపాకం వద్ద ప్రభుత్వస్థలంలో పేదలు సిపిఐ ఆధ్వర్యంలో గుడిసెలు నిర్మించుకునేందుకు ప్రయత్నిస్తే పోలీసులు సహాయంతో వారందర్ని తరిమివేసి, స్థలం జోలికి వస్తే ఖబడ్దార్‌ అంటూ హెచ్చరికలు జారీచేసి, అక్రమ కేసులు బనాయించారు. ప్రభుత్వ భూములు సరే ప్రైవేట్‌ భూములను కూడా అధికారపార్టీ వారు వదలడం లేదు. తిరుచానూరు పంచాయతీలోని యోగమల్లవరంలో స్థానికుడైన పెరుమాళ్‌ ఏప్పడు 30ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన ప్రయివేట్‌ స్థలంలోకి అధికార పార్టీకి చెందిన స్థానిక ఎంపిటిసి నకిలీ పత్రాలతో ప్రవేశించి, రాత్రికిరాత్రే భవన నిర్మాణాన్ని చేపట్టారు. ప్రశ్నించిన సొంతదారులపై మా ఇష్టం, నీకేదైన ఆధారాలు ఉంటే పోలీసులకు చెప్పకో అంటూ బెదిరించారు. పోలీసుల అండతోనే కబ్జాకు పాల్పడ్డాడు. బాధితులు విధిలేక సిపిఎంను ఆశ్రయించడంతో విషయం తెలుసుకున్న నాయకులు, కార్యకర్తలు, ప్రజాసంఘాల నాయకులు అక్కడికి చేరుకుని పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు. వారికి స్థానికులు కూడా మద్దతు ఇవ్వడంతో చేసేది లేక పోలీసులు సలహామేరకు తాత్కాలికంగా వెనక్కి తగ్గారు. కానీ మార్చి మొదటి వారంలో తిరిగి భవనాన్ని నిర్మించేందుకు అధికారులు సహకారాన్ని ముమ్మరం చేయనున్నారు. ఇలా ఎక్కడ చూసిన అధికార కబ్జాలు అధికమయ్యాయి. పేదలకు అడుగు స్థలం కూడా దొరకని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు, అధికారులు ఆలోచించి, నిజమైన అర్హులకు ప్రభుత్వస్థలంలో ఇళ్లస్థలాలను ఇచ్చి, కబ్జాదారుల నుంచి ఇటు ప్రభుత్వ భూములు కాపాడి, మరో పక్క పేదలకు ఇళ్లస్థలాలు అందించాలని ప్రజలు కోరుతున్నారు.

➡️