పేరుకే ‘సిరి’పురం కాలనీకనీస సౌకర్యాలు ‘కరువు’

పేరుకే ‘సిరి’పురం కాలనీకనీస సౌకర్యాలు ‘కరువు’ప్రజాశక్తి – తిరుపతి (మంగళం) తిరుపతి పట్టణం సిరిపురం కాలనీ పేరుకే ‘సిరి’పురం.. కనీస సౌకర్యాలు కరువు. ఈ కాలనీలో దాదాపు వంద కుటుంబాలు కాపురం ఉంటున్నాయి. తిరుపతి నడిబొడ్డున ఆర్టీసీ బస్టాండ్‌కు కూతవేటు దూరంలో ఈ కాలనీ ఉంది. ఈ కాలనీకి రోడ్డు సౌకర్యం ఉన్నప్పటికీ మట్టిరోడ్డు వేయడంతో కొద్దిపాటి వర్షానికే చెరువును తలపిస్తూ రాకపోకలకు ఇబ్బందిగా మారుతోంది. రోడ్డు పూర్తిగా బురదమయంగా మారి ద్విచక్రవాహనాలు సైతం పోలేని పరిస్థితి నెలకొంది. బాటసారులు నడవడానికి ఇబ్బంది పడుతూ ఒక్కోసారి జారిపడుతున్నారని స్థానికులు వాపోతున్నారు. ఈ కాలనీలో డ్రైనేజీ కాల్వలు లేవు. విద్యుత్‌ దీపాలు లేకపోవడంతో పలు ఇబ్బందులకు గురవుతున్నారు. బ్లిస్‌ హోటల్‌ వెనుక వైపున ఉన్న సిరిపురం కాలనీకి ఎలాంటి సౌకర్యం కల్పించకపోవడం బాధాకరమని స్థానికులు వాపోతున్నారు. తిరుపతి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్న అధికారులకు ఈ కాలనీ దుస్థితి కనిపించదా అని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా తమ కాలనీ వైపు రాజకీయ నాయకులు వస్తారు తప్ప, మిగిలిన సందర్భాల్లో రారని, ఈసారి ఎన్నికలకు వస్తే మాత్రం తమ కాలనీలో కనీస సౌకర్యాలు కల్పించిన వారికే ఓటేస్తామని వారు స్పష్టం చేస్తున్నారు. సిసిరోడ్డు వేసి, విద్యుత్‌ దీపాల సౌకర్యం కల్పించి, డ్రైనేజీ కాల్వలు ఏర్పాటుచేయాలని కాలనీవాసులు కోరుతున్నారు.

➡️