మరుగున మెగా ఖ’నిజం’శ్రీ రాళ్ల సంగతి తేల్చని అధికారులు శ్రీ పట్టుకున్న లారీలనూ వదిలేసిన వైనం

మరుగున మెగా ఖ'నిజం'శ్రీ రాళ్ల సంగతి తేల్చని అధికారులు శ్రీ పట్టుకున్న లారీలనూ వదిలేసిన వైనం

మరుగున మెగా ఖ’నిజం’శ్రీ రాళ్ల సంగతి తేల్చని అధికారులు శ్రీ పట్టుకున్న లారీలనూ వదిలేసిన వైనం ప్రజాశక్తి-శ్రీకాళహస్తి/తొట్టంబేడు తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం కాసరం చెరువులో ‘మెగా’ తవ్వకాల్లో బయటపడ్డ విలువైన రాళ్ల సంగతిని తేల్చడంలో సంబంధిత అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. మెగా తవ్వకాల్లో విలువైన ఖనిజపు రాయి బయటపడి నాలుగు రోజులు గడుస్తున్నా ఆ నిజాన్ని అధికారులు ఎందుకు దాస్తున్నారనే అనుమానం వ్యక్తమవుతోంది. కాసరం చెరువులో బయటపడ్డ ఆ రాయి ఏ కోవకు చెందిందో తెలుసుకునేందుకు సంబంధిత అధికారులు కనీస ప్రయత్నం చేయకపోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అది విలువైన రాయి కాబట్టే, దాన్ని మెగా యాజమాన్యం చౌర్యం చేసిందనీ, కొందరు అధికారి పార్టీ నేతల ఒత్తిళ్ల కారణంగా అధికారులు ‘ఖ’నిజాన్ని దాస్తున్నారంటూ ప్రజలు మండిపడుతున్నారు. లారీలనూ వదిలేశారు! నాయుడుపేట నుంచి మదనపల్లి వరకు ఆరు లైన్ల రోడ్డును ఏర్పాటు చేస్తున్న విషయం అందరికీ విదితమే. మొదటి దశలో భాగంగా ఈ పనులను ప్రముఖ సంస్థ మెగా కంపెనీ రూ.5 వేల కోట్ల వ్యయంతో చేపడుతోంది. ఇప్పటికే 50 శాతం పైగా పనులు పూర్తయ్యాయి అయితే పనులను చేసే సమయంలో వీరికి అవసరమైన మట్టిని చెరువుల నుంచి ఇష్టారాజ్యంగా తరలించడంతో చెరువులు లోయలుగా మారిపోతున్నాయి. పరిమితికి మించి లోతుకు తొట్టంబేడు మండలంలోని కాసరం చెరువులో గత రెండు నెలల నుంచి భారీ టిప్పర్లతో మట్టిని తరలించడంతో ఈనెల 13వ తేదీ మంగళవారం కొన్ని విలువైన రాళ్లు బయటపడ్డాయి. వాటిని గుట్టు చప్పుడు కాకుండా మెగా యాజమాన్యం ఊరు దాటించినట్లు సమాచారం. సుమారు మూడు టిప్పర్ల రాళ్ళను అక్రమంగా తరలించినట్లు సమాచారం. వీటి విలువ చాలానే ఉంటుందన్నది గ్రామస్తుల అనుమానం. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు తొట్టంబేడు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో స్పందించిన ఎస్సై రాఘవేంద్ర మట్టి తరలిస్తున్న ఒక టిప్పర్ను స్వాధీనం చేసుకుని అందులో ఉన్న రాళ్లను పరిశీలించారు. అయితే అది ఏ రకం రాయో తెలియక పోలీసులు రెవెన్యూ అధికారులకు అప్పజెప్పారు. అయితే తవ్వకాల్లో బయటపడ్డ ఆ రాయి ఏ కోవకు చెందిందో అధికారులు ఇప్పటి వరకు తేల్చలేదు. ఆ రాయిని మైనింగ్‌ శాఖ అధికారులకు కూడా పంపనట్లు తెలుస్తోంది. విలువైన రాయిని మెగా యాజమాన్యం దొంగలించిందని కాసరం గ్రామస్తుల నుంచి రాతపూర్వకంగా ఎలాంటి ఫిర్యాదూ అందలేదనీ, కేవలం ఫోన్‌ ద్వారా సమాచారం అందిస్తే విచారించి వదిలిపెట్టామని తొట్టంబేడు పోలీసులు తెలపడం గమనార్హం. ఏదిఏమైనా రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు ‘మెగా’కు కొమ్ముకాస్తూ ‘మైనింగ్‌’ను తరలించేస్తున్నారన్న వాస్తవాన్ని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఆరోపణలపై కనీసం ఆయా శాఖలు స్పందించకపోవడం గమనార్హం.

➡️