విద్యార్థులంటే ఎందుకంత నిర్లక్ష్యం!పుత్తేరికి సకాలంలో బస్సు నడపలేరా..!

విద్యార్థులంటే ఎందుకంత నిర్లక్ష్యం!పుత్తేరికి సకాలంలో బస్సు నడపలేరా..!

విద్యార్థులంటే ఎందుకంత నిర్లక్ష్యం!పుత్తేరికి సకాలంలో బస్సు నడపలేరా..!ప్రజాశక్తి-శ్రీకాళహస్తి, బుచ్చినాయుడు కండ్రిగ: ” సొంత లాభం కొంత మానుకో అన్న నినాదం” అన్నింటికీ వర్తిస్తుంది. అయితే శ్రీకాళహస్తి ఆర్టీసీ యాజమాన్యం సొంతలాభానికే అధిక ప్రాధాన్యతనిస్తూ.. సిబ్బంది ప్రజాప్రయోజనాలను పక్కన పెట్టేస్తోంది. ఇప్పటికే తీవ్రమైన పనిఒత్తిడి పెంచి పలువురి డ్రైవర్ల మతి కారణమైన శ్రీకాళహస్తి ఆర్టీసీ యాజమాన్యం, విద్యార్థుల పట్ల కూడా అదే నిర్లక్ష్యపు పంథా అవలంభిస్తోంది. మా మార్గంలో పొద్దుపోక ముందే బస్సు సర్వీసు నడపాలనీ, రాత్రిళ్ళు పొలం గట్లపై నడవాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తోందంటూ పెళ్లకూరు మండలం పుత్తేరి మార్గంలో ప్రయాణించే విద్యార్థులు పలుమార్లు ఆర్టీసీ యాజమాన్యంకు విన్నవించినా పట్టించుకోకపోవడమే ఇందుకు ఉదాహరణ. వివరాల్లోకి పోతే…తిరుపతి జిల్లా పెళ్ళకూరు మండలం పుత్తేరి మార్గంలో దొమ్మరమిట్ట, లింగమనాయుడు పల్లి, రైస్‌ మిల్లు, పునబాకు, ఆర్లపాడు, అర్థమాల, పుత్తేరి గ్రామాలకు చెందిన సుమారు 30మంది విద్యార్థులు నిత్యం స్కూళ్లకు, కాలేజీలకు ఆర్టీసీ బస్సులో రాకపోకలు సాగిస్తుంటారు. అయితే ఉదయం పూట విద్యార్థులను వారివారి గమ్యాలకు సకాలంలో చేరుస్తున్న ఆర్టీసీ యాజమాన్యం, సాయంత్రం తిరిగి ఇళ్లకు చేర్చే క్రమంలో సమయానికి బస్సును నడపడం లేదు. సాధారణంగా శ్రీకాళహస్తి నుంచి పుత్తేరికి సాయంత్రం 5:15 నిమిషాలకు ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి బయలుదేరాల్సి ఉంటుంది. అయితే కోవిడ్‌ కాలం తర్వాత, అంటే మూడేళ్లుగా సాయంత్రం 6 నుంచి 7గంటల మధ్య బస్సు శ్రీకాళహస్తి నుంచి పుత్తేరికి బయలుదేరుతోంది. ఈ క్రమంలో బస్సు పుత్తేరికి చేరుకోవాలంటే రాత్రి 8 గంటలు అవుతోంది. దీంతో పొలం గట్లపై ఊర్లకు చేరుకోవాల్సిన విద్యార్థులు రాత్రిళ్ళు పాములు, విషకీటకాల బెడదతో ఇబ్బంది పడుతున్నారు. ఇదే విషయంపై పలుమార్లు విద్యార్థులు డిపో మేనేజర్‌ కు తెలియజేయడంతో కొద్ది రోజుల పాటు తిరుపతి సర్వీసును కాస్త రేణిగుంటకు మార్చి పుత్తేరికి సమయానికి నడిపారు. మళ్ళీ పరిస్థితి యధాస్థితికి చేరడంతో విద్యార్థుల పరిస్థితి అగమ్యచోరంగా మారింది. ఇకనైనా అధికారులు తీరు మార్చుకుని విద్యార్థుల శ్రేయస్సు కోసం పుత్తేరి బస్సును సకాలంలో నడపాల్సి ఉంది. లేకుంటే విద్యార్థులు ఆందోళన బాట పడతామంటూ హెచ్చరిస్తున్నారు.ఈ విషయంపై డిపో మేనేజర్‌ రాజవర్ధన్‌ రెడ్డిని వివరణ కోరగా తిరుపతికి వెళ్ళే మార్గంలో ఉన్న ట్రాపిక్‌ కారణంగా బస్సు ఆలస్యం అవుతోందని చెప్పారు. తిరుపతికి ఓ సర్వీసును రద్దు చేసి పుత్తేరికి సకాలంలో బస్సు నడిపేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.

➡️