విద్యుత్‌ షాక్‌తో చేయి కోల్పోయిన గిరిజనుడు

విద్యుత్‌ షాక్‌తో చేయి కోల్పోయిన గిరిజనుడు

విద్యుత్‌ షాక్‌తో చేయి కోల్పోయిన గిరిజనుడుప్రజాశక్తి – ఓజిలి విద్యుత్‌ అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా ఓ గిరిజనుడు విద్యుత్‌ షాక్‌కు గురై తన చేయిని కోల్పోయాడు. దీంతో ఇంటికి ఆధారమైన పెద్దదిక్కుకు చేయి లేకపోవడంతో ఆ కుటుంబం వీధినపడింది. ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్నా పట్టించుకునే దిక్కులేదని వారు వాపోతున్నారు. మండల పరిధిలోని భువనగిరిపాలెం గ్రామానికి చెందిన మాణికల మణి (40) పశువుల కాపరి. ప్రతిరోజూలానే పశువులను మేతకు తీసుకెళుతుండగా ఓడూరు నుంచి చిల్లమానుచేను మీదుగా వెళుతున్న 11 కెవి విద్యుత్‌ లైన్‌ కిందకు వేలాడుతూ కనిపించింది. దీంతో విద్యుత్‌ షాక్‌కు గురయ్యాడు. వైద్యసేవల కోసం నెల్లూరుకు హుటాహుటిన తరలించగా చేయిభాగం దెబ్బతిందని, కుడిచేయిని తొలగించాలని వైద్యులు తెలిపారు. కుటుంబ పోషణ కోసం వెళ్లి జీవనాధారం కోల్పోయామని సభ్యులు ఆవేదన చెందుతున్నారు. విద్యుత్‌ ఉన్నతాధికారులు స్పందించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని వారు వేడుకొంటున్నారు. మణికి ఇద్దరు కుమార్తెలు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం వారిది. విషయం తెలుసుకున్న సిపిఎం నాయకులు శివకవి ముకుంద, చంద్రకళ వారిని పరామర్శించారు. డిస్కం ఉన్నతాధికారులు స్పందించి నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్‌చేశారు.

➡️