సమస్యలు పరిష్కారమయ్యేంత వరకూ…పోరాటం ఆపే ప్రసక్తే లేదు..

సమస్యలు పరిష్కారమయ్యేంత వరకూ...పోరాటం ఆపే ప్రసక్తే లేదు..

సమస్యలు పరిష్కారమయ్యేంత వరకూ…పోరాటం ఆపే ప్రసక్తే లేదు..ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌: అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం దౌర్జన్యంగా తాళాలు పగలగొట్టడం కాదని, వారి సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నించాలని, పిల్లలకు ఇబ్బందులు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అంగన్వాడీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.వాణిశ్రీ, సిపిఎం నగర కార్యదర్శి సుబ్రహ్మణ్యం తెలిపారు. అంగన్వాడీల సమ్మె ఆదివారం ఆరవ రోజుకు చేరుకుంది. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ సమస్యను శాంతియుతంగా ప్రభుత్వం పరిష్కరించాల్సినపోయి, కక్ష సాధింపులు దిగడం దారుణం అన్నారు. అంగన్వాడీలు తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం కోసం సమ్మెలోకి దిగితే వైసీపీ ఎమ్మెల్యేలు అనుచిత వాక్యాలు చేసి అంగన్వాడీ కార్మికులను మరింత రెచ్చగొట్టడానికి పూనుకుంటున్నారని అన్నారు. బొబ్బిలి ఎమ్మెల్యే నిన్నటి రోజున అంగన్వాడీలు ఒళ్ళు కొవ్వెక్కి సమ్మె చేస్తున్నారన్న మాటలు వెనక్కి తీసుకోవాలని, అంగన్వాడీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. మహిళల పట్ల మర్యాద గౌరవం లేని బొబ్బిలి ఎమ్మెల్యే వెంకట చినప్పలనాయుడును ఎమ్మెల్యే పదవికి బర్త్‌రఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అంతకుముందు హమాలి నగర కార్యదర్శి రమేష్‌ బందం మద్దతుపలికారు. సిఐటియు నగర కార్యదర్శి వేణుగోపాల్‌, అంగన్వాడి కార్యకర్తలు హెల్పర్లు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి: తమ న్యాయపరమైన డిమాండ్ల సాధనే లక్ష్యంగా స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు శ్రీకాళహస్తి నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి బొజ్జల వెంకట సుధీర్‌ రెడ్డి ఆదివారం భోజన వసతి కల్పించారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ గుమ్మడిపూడి దశరదాచారి, తిరుపతి పార్లమెంట్‌ తెలుగు మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష, మాజీ జెడ్పిటిసి జయచంద్రనాయుడు, పట్టణ యువత అధ్యక్షుడు అడ్డంకి కిట్టు అంగన్వాడీలకు భోజనాలు అందివ్వడం జరిగింది. రేణిగుంట: రేణిగుంట మంచినీళ్ళ గుంట పాత తహశీల్దార్‌ కార్యాలయం శిబిరం వద్ద ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ 6వ రోజు సమ్మె కొనసాగింది. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు వినూత్నరీతిలో వేపాకులతో గంగమ్మ కరుణించు అంటూ చేతులెత్తి దండం పెడుతూ నిరసన తెలిపారు. అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ ప్రాజెక్టు అధ్యక్షురాలు ధనమ్మ, ఐఎఫ్‌టియు కార్యదర్శి రాధమ్మ పాల్గొన్నారు. పిచ్చాటూరు: అంగన్వాడీ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించిన ప్రభుత్వ వైఖరికి నిరసనగా పిచ్చాటూరు ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసు నుండి ర్యాలీగా వెళ్లి అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి తమ సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. సిపిఎం సత్యవేడు నియోజకవర్గ ఇన్చార్జి దాసరి జనార్ధన్‌ మాట్లాడుతూ మడమతిప్పని, మాట తప్పని, ముఖ్యమంత్రిగా పేరుగాంచిన జగన్మోహన్‌ రెడ్డి అంగన్వాడీలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేసి మాట నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీ నాయకులు ఇంద్రాణి, రాజేశ్వరిలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని తెలిపారు. సిఐటియు నాయకులు నాగరాజు, రామచంద్రారెడ్డి, మురుగన్‌, అంగన్వాడీలు శ్రీవాణి, పూర్ణమ్మ, కళ్యాణి, కష్ణవేణి, శ్రీదేవి, భారతి, దేవి, నాగభూషణమ్మ, సావిత్రి, ప్రమీల, కళ్యాణి పాల్గొన్నారు పుత్తూరు టౌన్‌: అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని గత 6 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆదివారం అంగన్వాడీలు ఒటి కాలిపై నిలబడి చెవిలో పువ్వు పెట్టుకుని నిరసన తెలిపారు. సిఐటియు ఆధ్వర్యంలో తహశీల్దార్‌ కార్యాలయం వద్దకు చేరుకొని ధర్నా నిర్వహించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్‌.వెంకటేష్‌, ఏఐటీయూసీ పట్టణ నాయకులు డి.మహేష్‌, వై.నందయ్య, మునికుమారి, విజయ కుమారి, ధనమ్మ, రాధా, హైమావతి, అంబికా, లలిత, ప్రమీల, అన్నపూర్ణ, యశోద పాల్గొన్నారు. పాకాల: అంగన్వాడీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఐటియు సీనియర్‌ నాయకులు మధుసూదన్‌ రావు డిమాండ్‌ చేశారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లు మినీ వర్కర్లు ఆయాలు దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించకుండా అంగన్వాడీల పట్ల చిన్నచూపు చూడడం సరికాదని అన్నారు. అంగన్వాడీల సమ్మెకు తమ సంపూర్ణ మద్దతును తెలిపారు.

➡️