సిఐటియు నేతలకు పోలీసు నోటీసులుప్రభుత్వ చర్య అప్రజాస్వామికం: కందారపు మురళి

Feb 11,2024 22:36
సిఐటియు నేతలకు పోలీసు నోటీసులుప్రభుత్వ చర్య అప్రజాస్వామికం: కందారపు మురళి

ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌: ఈనెల 12వ తేదీన యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు అనుబంధం) ఆధ్వర్యంలో విజయవాడలో తలపెట్టిన ధర్నాకు హాజరు కావద్దని తిరుపతి అలిపిరి పోలీసులు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి, మరి కొందరు నేతలు, విద్యుత్‌ కార్మికులకు ఆదివారం నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా కందారపు మురళి మాట్లాడుతూ విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులకు ఎన్నికలకు ముందు జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా తాజా పిఆర్‌సి ప్రకారం వేతనాలు కూడా పెంచలేదని ఆరోపించారు. కాంట్రాక్ట్‌ కార్మికుల పట్ల తీవ్రమైన వివక్షను ప్రభుత్వం ప్రదర్శిస్తున్నదని తీవ్రంగా విమర్శించారు. వాచ్‌మెన్‌ నుంచి షిఫ్ట్‌ ఆపరేటర్లుగా ప్రమోషన్‌ పొందిన కార్మికుల విషయంలోనూ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్నదని అన్నారు. ప్రమోషన్‌ ఇచ్చి ఆపరేటర్లుగా ఉద్యోగాల్లోకి తీసుకున్న విద్యుత్‌ సంస్థ పాత ఆపరేటర్లకి ఒక వేతనం కొత్త ఆపరేటర్లకి మరో వేతనం అందిస్తూ వివక్ష చూపుతున్నదని ఆరోపించారు. విద్యుత్‌ సంస్థలో వేలాది మంది కార్మికులు కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌, మీటర్‌ రీడర్లులు, స్టోర్‌ హమాలీలు వంటి రకరకాల పేర్లతో శ్రమ దోపిడికి గురిఅవుతున్నారని కందారపు మురళి ఆరోపించారు. సమస్యలు పరిష్కరించాలని, ఆందోళనలకు పిలుపు ఇచ్చినప్పుడల్లా తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించడం ప్రభుత్వంకు ఆనవాయితీగా మారిందని ఆఖరికి ఎన్నికల సమయంలోనూ ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకుండా అ ప్రజాస్వామిక పద్ధతులకు పాల్పడుతూ నోటీసులు ఇవ్వడం అన్యాయమని కందారపు మురళి విమర్శించారు. ఎవరెన్ని ఆటంకాలు కల్పించినా విజయవాడలో ధర్నా చౌక్‌ వద్ద వేలాది మందితో విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు తమ నిరసన తెలియజేస్తారని సమస్యల పరిష్కారంకై పోరాటాన్ని కొనసాగిస్తారని పేర్కొన్నారు.

➡️