సేవతో గెలవాలి..బోగస్‌ ఓట్లతో కాదు: టిడిపి

సేవతో గెలవాలి..బోగస్‌ ఓట్లతో కాదు: టిడిపి

సేవతో గెలవాలి..బోగస్‌ ఓట్లతో కాదు: టిడిపిప్రజాశక్తి-తిరుపతి(మంగళం): రాష్ట్రంలో గాని, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గాని ఎక్కడా జరగని విధంగా ఒక్క చంద్రగిరి నియోజకవర్గం లోనే దొంగ ఓట్లను చేరుస్తున్నారని, గెలవాలంటే ప్రజలకు సేవ చేసి గెలవాలి కాని బోగస్‌ ఓట్లతో కాదని టిడిపి చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని హితవు పలికారు. తిరుపతి ప్రెస్‌ క్లబ్‌ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాని మాట్లాడుతూ కొందరు అధికారులు అధికార పార్టీ ఎమ్మెల్యేకు దాసోహం అన్నట్లుగా వ్యవహరిస్తూ దొంగ ఓట్లను చేర్చడంలో సహాయ సహకారాలు అందిస్తున్నారని, టిడిపి అధికారంలోకి రాగానే ఎవరైతే అధికారులు ఇలాంటి పనులకు ఉపక్రమించారో వారిపై విచారణ కమిటీ వేయించి న్యాయ పరంగా తగిన శిక్షలు పడేలా చేస్తానన్నారు. గత మూడు నెలలుగా చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి దొంగ ఓట్లను గుర్తించి తగిన ఆధారాలతో కలెక్టర్‌ కు, ఈఆర్‌ఓకు అందించినా ఇప్పటివరకు దొంగ ఓట్లను తొలగించకపోవడం ప్రజాస్వామ్యం పట్ల అధికారులకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందన్నారు. ప్రతి పోలింగ్‌ బూత్‌ కు 100 నుంచి 200 దొంగ ఓట్లు ఎక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గంలో ఫామ్‌ 6 నమోదు చేస్తున్నారన్నారు. రానున్న నాలుగు రోజుల్లో పూర్తిస్థాయిలో దొంగ ఓట్లను తొలగించాలని లేని పక్షంలో ఈఆర్‌ఓ కార్యాలయం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపడుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఈశ్వర్‌ రెడ్డి, జనార్దన్‌ నాయుడు, సుబ్రహ్మణ్యం నాయుడు, నరసింహారెడ్డి, మధు, గౌస్‌ బాష, జనార్ధన్‌ పాల్గొన్నారు.

➡️