స్విమ్స్‌లో ‘గోవిందనామ’ భజనరోగులకు ఆత్మస్థైర్యం నింపేదుకట..

స్విమ్స్‌లో 'గోవిందనామ' భజనరోగులకు ఆత్మస్థైర్యం నింపేదుకట..

స్విమ్స్‌లో ‘గోవిందనామ’ భజనరోగులకు ఆత్మస్థైర్యం నింపేదుకట..ప్రజాశక్తి – తిరుపతి అత్యాధునిక వైద్య సౌకర్యాలతో రోగులకు సేవలందించాల్సిన స్విమ్స్‌ ఆధ్యాత్మిక అడుగులు వేస్తోంది. సైన్స్‌కు మూఢనమ్మకాలను మిళితం చేస్తోంది. ఆధునిక టెక్నాలజీతో రోగిని బతికించి ఆత్మస్థైర్యం నింపాల్సిన వైద్యులు ‘భజన’ కార్యక్రమాలను ప్రారంభించారు. శనివారం సాయంత్రం ఆరు గంటలకు స్విమ్స్‌ శ్రీ వేంకటేశ్వర ఆలయంలో విష్ణు సహస్ర నామ స్తోత్రం పారాయణం, గోవిందనామ భజన కార్యక్రమాలను స్విమ్స్‌ డీన్‌ డాక్టర్‌ అల్లాడి మోహన్‌ ప్రారంభించారు. ఉపకులపతి ఆర్‌వి కుమార్‌కు ఈ బృందం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. డాక్టర్‌ అల్లాడి మోహన్‌ మాట్లాడుతూ ప్రస్తుతం అమల్లో ఉన్న వైద్య విధానంలో రోగానికి వైద్యం అందుతుందని, సనాతన ధర్మంలో భారతీయ సంస్కృతిలో అనాదిగా కేవలం రోగానికే కాకుండా రోగికి, వారి పరివారానికి వైద్యసేవలు అందించడం పరిపాటన్నారు. అందుకు మందులు, శస్త్ర చికిత్సలతో పాటు భగవదనుగ్రహం పొందేందుకు శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం పారాయణం, గోవింద నామాల పారాయణం, ధన్వంతరి మంత్రి జపం తోడ్పడతాయన్నారు. ప్రతి శనివారం జరిగే .జనహితం, సమాజహిత పారాయణ కార్యక్రమం ప్రశంసనీయమన్నారు. వికాస తరంగిణి నాగేంద్రసాయి మాట్లాడుతూ మనిషి ఎంత ఒత్తిడికి గురైనా మనిషి ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండటానికి విష్ణు సహస్ర నామం ఎంతగానో దోహదపడుతుందన్నారు. ధన్వంతరి మంత్రం జపిస్తే ఆరోగ్యంగా ఉంటారని, గోవింద నామం స్వామికి ప్రియమైనదని, గోవిందా అని పిలిస్తే పలుకుతారని తెలిపారు. నాగేంద్రసాయి, వికాస తరంగిణి కన్వీనర్‌ డాక్టర్‌ సుధావాణి, ఎన్‌.హేమలత, సౌందర్యలహరి బృందం పాల్గొన్నారు.

➡️