ఫలితాలపైనే అందరి దృష్టి

ఫలితాలపైనే అందరి దృష్టి

ఫలితాలపైనే అందరి దృష్టిప్రజాశక్తి – డక్కిలిఎన్నికల ఫలితాలకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. మరో 9 రోజులలో ఫలితాలు వెలువడనున్నాయి. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మే 13న పోలింగ్‌ జరిగింది. జూన్‌ 4వ తేదీన ఓట్లను లెక్కించనున్నారు. ఆ ఎన్నికల ఫలితాల కోసం నాయకులతోపాటు ఆయా పార్టీల కోసం పనిచేసిన ద్వితీయ శ్రేణి నాయకులతోపాటు, కార్యకర్తలు నియోజకవర్గ ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సరిగ్గా ఇంకో 9 రోజులు ఎదురుచూడక తప్పడం లేదు. వెంకటగిరిలోని తెలుగుదేశం, వైసిపి క్యాడర్‌ ఏ చోట కలిసినా ఎన్నికల ఫలితాలు పై చర్చలు సాగుతున్నాయి. నాయకుడు గెలిచి , పార్టీ ఓడితే ఏం చెయ్యాలి? ఏంపనులు చేసుకోవాలి? ఒక వేళ నాయకుడు ఓడి పార్టీ గెలిస్తే పరిస్థితి ఏంటి? నాయకుడు ఓడి, పార్టీ కూడా ఓడిపోతే ఎదుటి పార్టీ స్పీడును ఎలా తట్టుకోవాలి?. ఒక వేళ నాయకుడు గెలిచి పార్టీ కూడా గెలిస్తే. ఎలాంటి పనుల కోసం నాయకుడి వద్దకు వెళ్ళాలి? ఇవే ఆలోచనలతో క్యాడర్‌ సతమతమవుతున్నారు. అదేమి అభ్యర్థులకు రాని ఆలోచనేమీ కాదు. కానీ అన్నింటికీ టైమ్‌ రావాలి. జూన్‌ 4 రావాలి. ఆ రోజున మన వెంకటగిరి లెక్క తేలాలి. మన రాష్ట్రం లెక్క తేలాలి … అంటూ కబుర్లతో ఇరు పార్టీల క్యాడర్లు కాలాన్ని భారంగా వెళ్లదీస్తున్నారు. జూన్‌ 4వ తేదీ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఈసారి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు అధికంగా పోలయ్యాయి. ఎన్నికల విధుల్లో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వివిధ సంస్థల ఉద్యోగులు జర్నలిస్టులకు పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశాన్ని ఎన్నికల కమిషన్‌ ఇవ్వడంతో అవకాశాన్ని వారు వినియోగించుకున్నారు. ఇక 85 ఏళ్లు దాటిన వయోవద్ధులతోపాటు దివ్యాంగులకు హౌం ఓటింగ్‌ అవకాశం కల్పించారు. ఇవన్నీ లెక్కించిన తర్వాతే ఈవీఎం మిషన్‌లోని ఓట్లు లెక్కిస్తారు. ఫలితంగా తొలి రౌండు ఫలితాలు వచ్చేసరికి జాప్యం జరిగే అవకాశం ఉందని అధికారులు తెలియజేస్తున్నారు.హోరెత్తనున్న ఎగ్జిట్‌ పోల్స్‌…జూన్‌ 1తేదీ సాయంత్రం 6.30 గంటల నుంచి టీవీ చానళ్ళు, పత్రికలు, సోషల్‌ మీడియా వేదికల మీద ఎగ్జిట్‌ పోల్స్‌ హోరెత్తనున్నాయి. ఎన్నికల సంఘం ఏప్రిల్‌ 19 నుంచి జాన్‌1 సాయంత్రం వరకు 7 విడతల్లో లోక్‌ సభతో పాటు కొన్ని రాష్ట్రాల్లో శాసనసభలకు ఎన్నికలు నిర్వహిస్తున్నందున ఎలాంటి ఎగ్జిట్‌ ఫలితాలను వెల్లడించ కూడదని మీడియా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో జాన్‌ 1వ తేదీ సాయంత్రానికి ఎన్నికల సంఘం గడువు ముగియనుంది. ప్రతి మీడియా సంస్థ తాను వెల్లడించే ఎగ్జిట్‌ ఫలితాలకు ఎక్కువగా విశ్వసనీయత దక్కేలా జాగ్రత్తలు తీసుకుంటాయి. ఏ రాజకీయ పార్టీని మెప్పించే ప్రయత్నాల్లోకి వెళ్ళకుండా జనాభిప్రాయం ఆ రోజున ఎలా వుంటే అలా చెప్పడానికి ప్రయత్నాలు చేస్తుంటాయి. అందుకే ఎలాంటి తప్పటడుగులు వేసినా ప్రజల్లో తమ సంస్థకు ఉన్న క్రెడిబిలిటీ దెబ్బతినే ప్రమాదం వుందని భావించి చాలా జాగ్రత్తలు తీసుకుంటాయి. ఒక్కో సంస్థ నెట్వర్క్‌, సేకరణలో శాస్త్రీయత, సరైన విధంగా సాంకేతికత వినియోగించి ప్రజల భావోద్వేగాలను పసిగట్టి విశ్లేషించి అంచనాలన్నింటిని క్రోడీకరించి ఎగ్జిట్‌ పోల్స్‌ గా వెలువరిస్తాయి. దీంతో ఎగ్జిట్‌ పోల్స్‌ ఆధారంగా జూన్‌ ఒకటో తేదీ సాయంత్రానికి ఎన్నికల ఫలితాలపై ఓ అంచనాకు రావచ్చని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

➡️