బెదిరించినా కాంగ్రెస్‌ వైపే నిలబడ్డాను: అన్నపూర్ణమ్మ

బెదిరించినా కాంగ్రెస్‌ వైపే నిలబడ్డాను: అన్నపూర్ణమ్మ

బెదిరించినా కాంగ్రెస్‌ వైపే నిలబడ్డాను: అన్నపూర్ణమ్మ ప్రజాశక్తి-తిరుపతి (మంగళం) కాంగ్రెస్‌ పార్టీ వెంట ఉన్నానని స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు తన కుటుంబంపై బెదిరింపులకు దిగారని అయినా ధైర్యంగా కాంగ్రెస్‌ పార్టీ వైపే నిలబడ్డానని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షురాలు జంగాలపల్లి అన్నపూర్ణమ్మ తెలిపారు. బుధవారం తిరుపతి ప్రెస్‌ క్లబ్‌ లో ఆమె విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ కోసం 1999 నుండి అనేక దశల్లో కష్టించి పనిచేశానని, నేడు పార్టీ కోసం కష్టపడిన వారిని కాకుండా వేరొక వ్యక్తికి శ్రీకాళహస్తి టికెట్టు ఇవ్వడం బాధించిందన్నారు. 33 శాతం రిజర్వేషన్‌ ఇస్తామని చెప్పి, తిరుపతి జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా మహిళలకు ఇవ్వకపోవడం దారుణం అన్నారు. ఎమ్మెల్యే సీటు కేటాయించాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేసిన ఫలితం లేకుండా పోయిందన్నారు. అంటే పార్టీ కోసం కష్టపడిన వారిని కాకుండా డబ్బున్న వాళ్ళకే సీట్లు కేటాయిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తన సీనియారిటీని గుర్తించి కాంగ్రెస్‌ పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం టికెట్టు తనకు ఇవ్వాలని అన్నపూర్ణమ్మ డిమాండ్‌ చేశారు. మహిళలకు ప్రాధాన్యత ఏది? నగరి: కాంగ్రెస్‌ పార్టీలో మహిళలకు ప్రాధాన్యత ఎక్కడ…? అని ఆ పార్టీ గంగాధర నెల్లూరు అసెంబ్లీ సీటుకు ధరఖాస్తు చేసుకున్న టి.అములు ప్రశ్నించారు. బుధవారం ఆమె నగరిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో వైఎస్సార్‌ నేతత్వంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇద్దరు మహిళలకు అసెంబ్లీ స్థానాలు కేటాయించేవారని ప్రస్తుతం ఆ ప్రాధాన్యత ఏమైందన్నారు. షర్మిలమ్మ అనే మహిళ నేతత్వంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీలోనే మహిళలకు ప్రాధాన్యత దక్కడం లేదన్నారు. జిల్లాలో ఒక్క వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి ఇద్దరికి అవకాశం కల్పించిందన్నారు. మిగిలిన పార్టీలు ఏవీ మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గంగాధర నెల్లూరులోను, పూతలపట్టులోను కనీసం సీటుకోసం ధరఖాస్తు చేసుకోని వారికి సీట్లు కేటాయించారన్నారు. ఆర్ధిక బలమే వారికి దరఖాస్తుగా మారిందన్నారు. కార్వేటినగరం మండలానికి చెందిన కాంగ్రెస్‌ నాయకుడు టికెట్‌ విషయమై రూ.లక్ష డిమాండ్‌ చేశారన్నారు. దాన్ని తిరస్కరించడమే సీటు రాకపోవడానికి కారణమైందన్నారు. రాష్ట్ర పీసీసీ ఉపాధ్యక్షులుగా ఉన్న డాక్టర్‌ నరసింహులు రెండు పర్యాయాలు గంగాధర నెల్లూరు నుంచి తలపడ్డారని ఆయనకు కూడా సీటు కేటాయించలేదన్నారు.

➡️