4న ‘ఏపీ 175’ చిత్రం విడుదల

May 23,2024 21:49
4న 'ఏపీ 175' చిత్రం విడుదల

ప్రజాశక్తి-శ్రీకాళహస్తి ఈ ఏడాది జూన్‌ 4న ”ఏపీ 175” చిత్రం విడుదల కానుంది. నిర్మాణ సహకారం- రాష్ట్ర ప్రజలు, దర్శకత్వం – కేంద్ర ఎన్నికల సంఘం, సహ దర్శకత్వం -రాష్ట్ర ఎన్నికల సంఘం, పర్యవేక్షణ – పోలీసులు, ఎన్నికల అధికారులు, హీరోలు, విలన్లు – రాజకీయ నాయకులు, స్టంట్‌ మాస్టర్లు – రాజకీయ నాయకులు, కార్యకర్తలు, బాధితులు – ప్రజలు, శాంతిభద్రతల పర్యవేక్షణ – పోలీసులు, గెలిచేది – నాయకులు, ఓడేది- ప్రజలు. ఏ భాషకు సంబంధించిన సినిమా ( చిత్రం) అయినా విడుదల కావాలంటే ముందుగా చిత్రీకరణ పూర్తి చేసుకోవాలి. ఎడిటింగ్‌, మ్యూజిక్‌ కంపోజింగ్‌, డబ్బింగ్‌ తదితర సాంకేతిక సహకారం తర్వాత మంచి ముహూర్తంలో చిత్రం విడుదలవుతుంది. సినిమా హిట్టా.. ఫట్టా అనేది ప్రేక్షకులు తేల్చాలి. పాతకాలంలో అయితే సినిమా 100 రోజులు, 200 రోజులు, 365 రోజులు ఆడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఈనెల 13వ తేదీన జరిగిన ”ఏపీ 175 ఎన్నికలు” అనే చిత్రం ఒకే రోజు షూటింగ్‌ పూర్తి చేసుకుంది. కొన్ని అవాంతరాలు, రాళ్లు, రాడ్లు, కర్రల యుద్ధాలు జరిగినా… తలలు పగిలినా… రక్తం కారినా చిత్రీకరణ మాత్రం ఆగలేదు. సినిమాల్లో లాగానే అన్నీ అయిపోయిన తర్వాత పోలీసులు రావడం.. నానా హంగామా చేయడం.. కేసులు కట్టడం చకచకా జరిగి పోయాయి. సినిమా లాగా కాకుండా ”ఏపీ 175” సినిమా ఐదు సంవత్సరాలు ఆడాల్సిందే. ప్రేక్షకుల ఆదరణ ఉన్నా… లేకపోయినా చిత్రం పేరు పలకాల్సిందే. హిట్‌ అయినా ఫట్టయినా భరించాల్సిందే. ఎందుకంటే ప్రజలు ఏరి కోరి ఎన్నుకున్న నాయకత్వం, ప్రభుత్వం కాబట్టి.

➡️