కౌంటింగ్‌కు పక్కాగా ఏర్పాట్లు : కలెక్టర్‌

May 22,2024 21:57
కౌంటింగ్‌కు పక్కాగా ఏర్పాట్లు : కలెక్టర్‌

ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌: కౌంటింగ్‌ సజావుగా జరిగేందుకు రిటర్నింగ్‌ అధికారులు బాధ్యతగా మరియు సంబంధిత అధికారులు పక్కాగా ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్‌ కుమార్‌ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నందు 7 నియోజక వర్గాల రిటర్నింగ్‌ అధికారులు, సహాయ రిటర్నింగ్‌ అధికారులు, సంబంధిత జిల్లా అధికారులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించి కౌంటింగ్‌ సజావుగా జరిగేందుకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కౌంటింగ్‌ కౌంటింగ్‌ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని కావున ఉదయం 7 గంటల వరకు కౌంటింగ్‌ సూపర్వైజర్లు అసిస్టెంట్లు మైక్రోఅబ్జర్వర్లు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన సంబంధిత కౌంటింగ్‌ కేంద్రంలో అందుబాటులో ఉండాలన్నారు. ముందుగా ఈటీబిపీఎస్‌, పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌, కంట్రోల్‌ యూనిట్‌ పోల్‌ అయిన ఓట్లు లెక్కించడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల పోటీలో ఉన్న అభ్యర్థులు కౌంటింగ్‌కు సంబంధించిన ఏజెంట్ల ఏర్పాటు కొరకు కౌంటింగ్‌కు మూడు రోజుల ముందు నుంచే దరఖాస్తు చేసుకోవాలని, సంబంధిత రిటర్నింగ్‌ అధికారులు తమ నియోజకవర్గ పరిధిలోని అభ్యర్థులతో సమావేశం రేపు గురువారం నిర్వహించాలని సూచించారు. కౌంటింగ్‌ అనేది సంబంధిత రిటర్నింగ్‌ అధికారి బాధ్యత అని, తప్పక దానిని ఎంతో పక్కాగా చేపట్టాలని సూచించారు. ప్రశాంత కౌంటింగ్‌ లక్ష్యంగా, పక్కాగా పనితీరు ఉండాలని, కౌంటింగ్‌ డేటా క్రోడీకరణ, ఎన్కోర్‌ యాప్‌ నందు అప్లోడ్‌ సక్రమంగా సకాలంలో చేయాలని, ఇంటర్నెట్‌ బ్యాండ్‌ విడ్త్‌ సరిచూసుకోవాలని అన్నారు. జిల్లా కలెక్టరేట్‌లో మోడల్‌ కౌంటింగ్‌ కేంద్రం ఏర్పాటు చేయనున్నామని, ఆన్‌ హ్యాండ్‌ ఎక్స్పీరియన్స్‌ వస్తుందని తెలిపారు. కౌంటింగ్‌ హాల్‌లో కంప్యూటర్లు, ఇంటర్నెట్‌, కుర్చీలు, టేబుల్‌, సిబ్బంది ఏర్పాటుకు సంబంధిత ఆర్‌ఓలు చర్యలు తీసుకోవాలని సూచించారు. మీడియా సెంటర్‌ ఏర్పాట్లు సక్రమంగా ఉండాలని, సమాచార సమన్వయం కొరకు ప్రతి నియోజక వర్గం నుండి ఒక అధికారిని జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారితో సమన్వయం చేసుకుని మీడియా కేంద్రంకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ టేబుల్‌లు గూడూరు 3, వెంకటగిరి 3, సూళ్లూరుపేట 3, చంద్రగిరి 6, తిరుపతి 6, శ్రీకాళహస్తి 4, సత్యవేడు 3 ఏర్పాటు ఉండాలని సూచించారు. వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి ధ్యానచంద్ర, తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి అదితి సింగ్‌, డిఆర్‌ఓ పెంచల కిషోర్‌, రిటర్నింగ్‌ అధికారులు కిరణ్‌ కుమార్‌, నరసింహులు, చంద్రముని, రవిశంకర్‌ రెడ్డి, నిషాంత్‌ రెడ్డి, నోడల్‌ అధికారులు రామ్మోహన్‌, చంద్రశేఖర్‌ రెడ్డి, కోదండ రామిరెడ్డి పాల్గొన్నారు.ఈవిఎం స్ట్రాంగ్‌ రూములను పరిశీలించిన కలెక్టర్‌ క్యాంపస్‌ :పోల్డ్‌ ఈవిఎంలు భద్రపరచిన శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌ కళాశాల స్ట్రాంగ్‌ రూముల వద్ద భద్రత ఏర్పాట్లను సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్‌ కుమార్‌ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. బుధవారం రాత్రి సదరు స్ట్రాంగ్‌ రూమును కలెక్టర్‌ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్ట్రాంగ్‌ రూం భద్రత ఏర్పాట్లు 24/7 అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీసీటీవీ కెమెరాల కంట్రోల్‌ రూములో ఈవిఎంలను పరిశీలించారు. సందర్శకుల రిజిష్టర్‌లో సంతకాలు చేశారు. కలెక్టర్‌ వెంట అదనపు ఎస్పీ రిజర్వ్‌ శ్రీనివాస రావు, ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి సంబంధిత అధికారులు ఉన్నారు.

➡️