పులివర్తి నానిని విచారించిన పోలీసులు

May 23,2024 21:51
పులివర్తి నానిని విచారించిన పోలీసులు

ప్రజాశక్తి -తిరుపతి సిటీ చంద్రగిరి టిడిపి కూటమి అభ్యర్థి పులివర్తి నానిని తిరుపతి డిఎస్పి రవి మనోహర్‌ ఆధ్వర్యంలో పోలీసులు గురువారం విచారణ నిర్వహించారు. ఎన్నికల పోలింగ్‌ మరుసటి రోజు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఈవీఎం ఫ్యాడ్లు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌ సమీపంలో పులివర్తి నాని పై హత్యాయత్నం జరిగిన విషయం విదితమే. చంద్రగిరి నియోజకవర్గంలో పోలింగ్‌ రోజు చంద్రగిరి మండలం రామ్‌ రెడ్డి గారి పల్లి పంచాయతి కూచువారిపల్లి గ్రామంలో జరిగిన అల్లర్లు, దాడులు, పద్మావతి మహిళ యూనివర్సిటీలో జరిగిన అల్లర్లపై ఎన్నికల సంఘం సీరియస్‌ కావడంతో, విచారణ కోసం సిట్‌ బందాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తిరుపతి సిట్‌ బందానికి నేతత్వం వహిస్తున్న రవి మనోహర్‌ ఆచారి ప్రస్తుతం తిరుపతి డిఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో హత్యాయత్నం బాధితుడు పులివర్తి నానిని ఎస్‌వీయూ క్యాంపస్‌ పోలీస్‌ స్టేషన్‌ కి పిలిపించారు. మహిళా వర్సిటీ ఆవరణలో పులివర్తి నానిపై హత్యాయత్నం ఘటనపై విచారణ చేపట్టారు. అనంతరం నాని విలేకరులతో మాట్లాడుతూ తనపై జరిగిన హత్యాయత్నం ఘటనపై ఇప్పటికే పోలీసులకు పలు ఆధారాలతో వివరించానని, ఈ ఘటన కారకులపై తగిన చర్యలు తీసుకొని, తనకు న్యాయం చేయాలని కోరారు.హైకోర్టులో చెవిరెడ్డికి చుక్కెదురు చంద్రగిరి నియోజకవర్గంలో పోలింగ్‌ సందర్భంగా నాలుగు బూత్‌ లలో రిగ్గింగ్‌ జరిగిందని ఆరోపిస్తూ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఎన్నికల అధికారులు పోలింగ్‌ నాడు ఎలాంటి అవకతవకలు జరగలేదని నివేదిక సమర్పించంతో చెవిరెడ్డి పిటిషన్‌ ను ధర్మాసనం కొట్టివేసిందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని పేర్కొన్నారు. ఓటమి భయంతో దాడులు చేయించడం, అధికారులను బెదిరించడం, రి పోలింగ్‌ కోరడం పరిపాటిగా మారిందని ఆయన మండిపడ్డారు. జిల్లావ్యాప్తంగా కార్డన్‌ సెర్చ్‌ ఎన్నికల కౌంటింగ్‌ సమీపిస్తుండడంతో జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్‌ రాజు ఆదేశాల మేరకు గురువారం జిల్లావ్యాప్తంగా పలు పోలీస్‌ స్టేషన్ల పరిధిలో కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. రేణిగుంట అర్బన్‌ సీఐ మల్లికార్జున ఆధ్వర్యంలో గురువారం తెల్లవారుజామున రేణిగుంట టౌన్లోని వేణు గోపాలపురం ప్రాంతంలో కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. అనుమానితులను విచారించి సరైన ధ్రువపత్రాలు లేని ఎనిమిది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని రేణిగుంట పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. పుత్తూరు అర్బన్‌ సీఐ ఓబులేసు ఆధ్వర్యంలో పుత్తూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం తెల్లవారుజామున పుత్తూరు టౌన్‌ లో కామరాజనగర్‌, గేట్‌ పుత్తూరు ప్రాంతాలలో నిర్వహించి సరైన రికార్డులు లేని 20 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. తిరుచానూరు సిఐ శ్రీకాంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో తిరుచానూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని దామినేడు ఇందిరమ్మ గహాల ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున నిర్వహించి 15 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. నాయుడుపేట అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సిఐ ఆధ్వర్యంలో మాలయకోట ప్రాంతంలో అనుమానితులను విచారించారు. నాయుడుపేట రూరల్‌ సీఐ జగన్మోహన్‌ రావు ఆధ్వర్యంలో పెళ్లకూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చిల్లకూరు గ్రామం వడ్డీ పాలెం గ్రామాలలో గురువారం నాడు తెల్లవారుజామున నాయుడుపేట రూరల్‌ సర్కిల్‌ పోలీసులు కార్డెన్‌ అండ్‌ సెర్చ్‌ కార్యక్రమాన్ని నిర్వహించి, అనుమానితులను విచారిస్తూ 10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని పెళ్లకూరు పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు. సూళ్లూరుపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సూళ్లూరుపేట సర్కిల్‌ సీఐ మధు బాబు ఆధ్వర్యంలో నాయుడుపేట టౌన్‌ లోని వట్రపాలెం ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున నాయుడుపేట సబ్‌ డివిజన్‌ పోలీసులు కార్డెన్‌ అండ్‌ సెర్చ్‌ కార్యక్రమాన్ని నిర్వహించి, అనుమానితులను విచారించి సరైన పత్రాలు లేని 16 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని సూళ్లూరుపేట పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు.

➡️