రాజ్యాంగాన్ని, కాపాడాలంటే మోడీని గద్దె దింపాల్సిందే : సిపిఎం

Dec 23,2023 15:36 #cpm dharna, #Krishna district

ప్రజాశక్తి-కలక్టరేట్‌ (కృష్ణా):పార్లమెంటు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మూకుమ్మడిగా ఎంపీలను బహిష్కరించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని సిపిఎం కృష్ణాజిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌ రఘు అన్నారు. పార్లమెంటులో 146 మంది విపక్ష సభ్యులను మోడీ ప్రభుత్వం ఉమ్మడిగా బహిష్కరించడానికి వ్యతిరేకిస్తూ శనివారం సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్‌ మచిలీపట్నం నియోజకవర్గ కమిటీల ఆధ్వర్యంలో స్థానిక లక్ష్మీ టాకీస్‌ సెంటర్లోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీల ఎంపీలు 146 మందిని సస్పెండ్‌ చేయటం భారత దేశ చరిత్రలో ఉందా అని ప్రశ్నించారు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో సాధారణ ప్రజలకు ప్రశ్నించే హక్కు మాట్లాడే హక్కులు ఉంటాయని, ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంపీలకు కూడా ప్రశ్నించే హక్కు లేదన్న రీతిలో సస్పెండ్‌ చేయడం అప్రజాస్వామికచర్య అన్నారు. ప్రజలు ఎన్నుకున్న పార్లమెంటుకు ప్రభుత్వం జవాబు దారిగా ఉండాలని కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పటికే వ్యవస్థలన్నింటిని ధ్వంసం చేసిందన్నారు. బిజెపి ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే దేశంలో ప్రజాస్వామ్యం ఉండదని కాబట్టి దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడాలంటే మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపు నిచ్చారు. సిపిఐ మచిలీపట్నం నియోజకవర్గ కార్యదర్శి లింగం ఫిలిప్‌ మాట్లాడుతూ దేశ భద్రత అంశంలో విఫలమైన మోడీ, అమిత్‌ షాలు, తక్షణమే రాజీనామా చేయాలని,ఎంపీల సస్పెన్షన్‌ ఎత్తివేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. మచిలీపట్నం నియోజకవర్గ కాంగ్రెస్‌ అధ్యక్షులు కె.చంద్రశేఖర్‌ మాట్లాడుతూ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైన పార్లమెంటుపై జరిగిన దాడికి బాధ్యత వహించి నరేంద్ర మోడీ, అమిత్‌ షా లు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. భారత పార్లమెంటులో 146 మంది ఎంపీలను సస్పెండ్‌ చేయడం అప్రజాస్వామిక చర్యని, సస్పెండ్‌ ను వెంటనే ఎత్తివేయాలని సిపిఎం మచిలీపట్నం నగర కార్యదర్శి బూర సుబ్రహ్మణ్యం డిమాండ్‌ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కే.శర్మ, సిహెచ్‌ రాజేష్‌, సిహెచ్‌ జయ రావు, ఎండి.యునస్‌, బిఎస్‌ఎన్‌ఎల్‌ రిటైర్డ్‌ యూనియన్‌ నాయకులు ఏ.ఏడుకొండలు, ఎల్‌ఐసి ఏజెంట్ల యూనియన్‌ నాయకులు కే.రాజారావు, సిపిఐ నాయకులు ఓఎల్‌ రావు, తదితరులు పాల్గొన్నారు.

➡️