నేడే ఓట్ల పండగ

నేడే ఓట్ల పండగ

పోలింగ్‌కు సర్వం సిద్ధం

ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా పటిష్ట పోలీసు బందోబస్తు

ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్‌

సార్వత్రిక ఎన్నికలు మరికొన్ని గంటల్లో ప్రారంభంకానున్నాయి. పోలింగ్‌కు విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. సోమవారం ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. పోలింగ్‌ సందర్భంగా ఎటుంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా పోలీసు అధికారులు గట్టి బందోబస్తును సిద్ధంచేశారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రత్యేక బలగాలను నియమించారు. పోలింగ్‌ సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు ఆదివారం సామగ్రితో బయలుదేరారు.

ప్రజాశక్తి – అనకాపల్లి ప్రతినిధి అనకాపల్లి జిల్లాలో పోలింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు చేశారు. కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి రవి పట్టాన్‌శెట్టి ఇవిఎం పంపిణీ కేంద్రాలను ఆదివారం పరిశీలించారు. అనకాపల్లి నియోజకవర్గంలోని పోలింగ్‌ కేంద్రాలను విశాఖపట్నం రేంజ్‌ డిఐజి విశాల్‌ గున్ని, ఎస్‌పి కెవి.మురళీకృష్ణ సందర్శించి పోలీసు సిబ్బందికి భద్రతాపరమైన సూచనలు చేశారు. జిల్లాలోని 1529 పోలింగ్‌ కేంద్రాల్లో 12,89,371 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 6,27,321 మంది, మహిళలు 6,62,022 మంది, థర్డ్‌ జండర్‌ 28 మంది వున్నారు. పోలింగ్‌ నిర్వహణలో పిఓలు 1759 మంది, ఎపిఓలు 1759 మంది, ఒపిఓలు 1743 మంది, సూక్ష్మపరిశీలకులు 7036 మంది పాల్గొననున్నారు. చోడవరం, మాడుగుల, అనకాపల్లి, యలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం నియోజకవర్గాలకు 3,666 బ్యాలెట్‌ యూనిట్లు, 3,666 కమిషనింగ్‌ యూనిట్లు, 3,968 వివిపాట్‌లు ఉపయోగించనున్నారు. బియులు 996, సియులు 127, వివిపాట్‌లు 506, రిజర్వులో వుంచారు. 1529 పోలింగ్‌ కేంద్రాలలో 340 సమస్యాత్మక కేంద్రాలున్నట్లు గుర్తించారు. ఆ కేంద్రాల వద్ద ప్రత్యేకంగా బలగాలను ఏర్పాటుచేశారు. పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ చేయనున్నారు. బందోబస్తులో పోలీసులతో పాటు కేంద్ర బలగాలు పాల్గొంటున్నాయి. జిల్లాలో 144 సెక్షన్‌, 30 పోలీస్‌ యాక్ట్‌ అమల్లో వుంది. ఐదుగురుకు మించి గుంపుగా తిరగకూడదు. పోలింగ్‌ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో ఓటర్లు మినహా ఇంకెవరూ ఉండరాదు. పోలింగ్‌ కేంద్రానికి 200 మీటర్ల దూరంలో ఓటర్లు తమ వాహనాలు నిలిపివేయాలి. ఓటింగ్‌ విధానాన్ని పరిశీలించేందుకు అభ్యర్థిని మాత్రమే పోలింగ్‌ కేంద్రంలోకి అనుమతించనున్నారు. రూట్‌ మొబైల్‌, క్యూఆర్‌టి టీమ్స్‌, స్ట్రైకింగ్‌ ఫోర్స్‌, స్పెషల్‌ స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేశారు. మద్యం, నగదు పంపిణీ చేస్తున్న వారిపై ఫిర్యాదుచేసేందుకు సి విజిల్‌ యాప్‌ ద్వారాగానీ, స్థానిక పోలీస్‌ స్టేషన్‌కుగానీ తెలియజేస్తే చర్యలు తీసుకునేలా సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఫిర్యాదుకు టోల్‌ ఫ్రీ నెంబర్లు పోలింగ్‌కు సంబంధించి ఫిర్యాదు చేసేందుకు ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో టోల్‌ ఫ్రీ నెంబరు 1950, 112 08924226599 నెెంబర్లను అందుబాటులో వుంచారు. జిల్లా పోలీసు కంట్రోల్‌ రూమ్‌లోని 9440904229 నెంబర్‌కు ఫొటోలు, వీడియోలతో సమాచారం పంపించవచ్చు. సమాచారం పంపించిన వారి వివరాలు గోప్యంగా పోలీసులు వుంచనున్నారు

. ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో

సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ జరుగనున్న సార్వత్రిక ఎన్నికలకు జిల్లా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లతో సిద్ధమైంది. విశాఖ జిల్లాలోని ఒక పార్లమెంట్‌, 7 అసెంబ్లీ స్థానాల్లో 20,12,373 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్‌ సిబ్బంది సుమారు 13 వేల మంది పైచిలుకు విధుల్లో ఉండనున్నారు. వైసిపి, టిడిపి, జనసేన బిజెపి, ఇండియా వేదికలోని కాంగ్రెస్‌, సిపిఎం, సిపిఐ సహా ఇండిపెండెంట్‌ అభ్యర్థులు, జై భారత్‌ నేషనల్‌ పార్టీ, బిఎస్‌పి తదితర పక్షాలు బరిలో ఉన్నాయి. విశాఖ పార్లమెంట్‌ పరిధిలో వైసిపి అభ్యర్థి బొత్స ఝాన్సీలక్ష్మి, టిడిపి నుంచి ఎం.శ్రీభరత్‌, కాంగ్రెస్‌ నుంచి సత్యారెడ్డి, ప్రజాశాంతి పార్టీ నుంచి కెఎ.పాల్‌ తదితరులు పోటీలో ఉన్నారు. విశాఖ తూర్పు, పశ్చిమం, ఉత్తరం, దక్షిణం, గాజువాక, భీమిలి అసెంబ్లీ నియోజకవర్గాలు విశాఖ జిల్లాలో ఉన్నాయి. పలుచోట్ల ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తుండగా గాజువాకలో సిపిఎం, వైసిపి, టిడిపి మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఎన్‌డిఎ కూటమిలోగల టిడిపి, జనసేన, బిజెపి, రాష్ట్రంలోని అధికార వైసిపి అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో రూ.కోట్లు ఖర్చుచేస్తూ ఓటర్లను తమవైపు లాక్కోడానికి గడచిన 10 రోజులుగా ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఓటుకు నోట్లు ఏ పార్టీ అభ్యర్థి ఇస్తే వారివైపు జనం ఓట్లేస్తారన్న నమ్మకంతో వైసిపి, టిడిపి, బిజెపి ప్రధానంగా డబ్బు పంపకంలో విశాఖలో పోటీపడ్డాయి.

అత్యధిక ఓటర్లు భీమిలిలోనే…

విశాఖ జిల్లా పరిధిలోగల ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో భీమిలిలోనే అత్యధికంగా ఓటర్లు 3.63 లక్షల పైచిలుకు ఉన్నారు. మహిళా ఓటర్లు ఇక్కడే అధికం. అత్యల్పంగా ఓటర్లు పశ్చిమంలో 2.13 లక్షల మంది ఉన్నారు. విశాఖ జిల్లా మొత్తంగా పురుష ఓటర్లు 9,92,800 మంది, మహిళా ఓటర్లు 1019,449 మంది ఉన్నారు. వలస ఓటర్లపై దృష్టిసారించిన ప్రధాన పార్టీలువిశాఖ నగరంలో అపార్టుమెంట్‌లు, హోటళ్లు, షాపింగ్‌ కాంప్లెక్స్‌ల్లో పనిచేస్తున్న కార్మికులు, వాచ్‌మెన్‌లు అంతా తమ తమ గ్రామాలకు ఆదివారమే తరలిపోయారు. వీరిలో ఎక్కువ మంది విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలవారే ఉన్నారు. . అలాగే తెలంగాణ, బెంగళూరు, చెన్నరుల్లో ఉన్న విశాఖకు చెందిన వేల సంఖ్యలోని ఓటర్లు ఆదివారం నాటికి విశాఖ చేరుకున్నారు. వలస ఓటర్లపై ప్రధాన పార్టీలు దృష్టి పెట్టాయి. వారికి రవాణా ఖర్చులు, తాయిలాలు ఇచ్చిమరీ స్వస్థలాలకు రప్పించాయి.

➡️