నేడు తుమ్మలపాలెం అమరుల స్మారక సభ

Apr 12,2024 23:53

ప్రజాశక్తి – య‌డ్ల‌పాడు : తుమ్మలపాలెంలో జరుగుతున్న అమరవీరుల స్మారక సభకు అనేక ప్రత్యేకతలున్నాయి. 27 మంది అమరవీరుల స్మారక కట్టడాలు ఒకేచోట ఉండడం, ఈ ప్రాంతంలో పని చేస్తున్న కమ్యూనిస్టు గ్రూపులన్నీ ఐక్యంగా సభ జరపడం ఏడు దశాబ్ధాలుగా నిరాటంకంగా జరిగే సభలు కావడం దీని ప్రత్యేకత. 1950 ఏప్రిల్‌ 13వ తేది కలకత్తా – మద్రాసు గ్రాండ్‌ట్రంక్‌ రోడ్‌ పక్కగా తుమ్మలపాలెం వద్ద ఆళ్ల వెంకయ్య (వేలూరు), దండా అంకమ్మ (వేలూరు), బండారు వెంకటప్పయ్య (వేలూరు), కట్టా దామోదరం (వేలూరు), దావల గంగయ్య (యద్దనపూడి) మూకిరి మోషే (పురుషోత్తపట్నం) అనే అరుగురు వీరుల్ని పట్టుకొని కాల్చి చంపి ఎందురు కాల్పుల కథ అల్లారు. వీరితోపాటు ఆ రోజుల్లో తెలంగాణ రైతాంగ పోరాటానికి దన్నుగాను, స్థానిక సమస్యలపై భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడుతున్న క్రమంలో చంపబడ్డ దండా నారాయణస్వామి (గోరంట్లవారిపాలెం), పిల్లి అంకమ్మ (చిలకలూరిపేట), కొండ్రగుంట రాములు (వేలూరు), మామిడాల సుబ్బారావు (జొన్నలగడ్డ), కాకాని రాంచంద్రయ్య (లింగారావుపాలెం) ఏనుగుపాలెం కోటయ్య (ఏనుగుపాలెం), నెలకుదుటి సత్యనారాయణ (దొండపాడు), తల్లం శ్రీమన్నారాయాణ (దొండపాడు), కోనేటి బ్రహ్మయ్య (యడ్లపాడు), గడ్డం మోషే (వేలూరు) స్మారకార్థం మొత్తం 17 మంది పేర్లతోనూ ఇక్కడ స్మారక కట్టడాలు నిర్మించబడ్డాయి. 1952 ఏప్రిల్‌ 13న జరిగిన తొలి ఆవిష్కరణ సభలో కమ్యూనిస్టు పార్టీ అగ్ర నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య, మాకినేని బసవపున్నయ్య, చండ్ర రాజేశ్వ రరావు, కొల్లా వెంకయ్య, ఎంబి సుబ్రమణ్యం, కరణం రంగారావు తదితరులు పాల్గొన్నారు. నాటి నుండి క్రమం తప్పకుండా జరుగుతున్న ఈ స్మారక సభలో రాష్ట్ర, జాతీయ కమ్యూనిస్టు పార్టీ అక్రగనేలంతా ఏదో ఒక సంవత్సరం పాల్గొన్నారు. 1973లో జిల్లాలో చనిపోయిన నక్సల్స్‌ అమరవీరుల జ్ఞాపకంగా వారొక స్తూపం నిర్మించారు. ఆ తర్వాత సంవత్సరం జరిగిన ఘర్షణలో ఒక నక్సల్‌ కార్యకర్త చనిపోవడంలో మళ్లీ సభ నిర్వహణ ఆగిపోయింది.క్రమక్రమంగా స్తూపాలు శిథిలావస్థకు చేరుకోవటం, స్థలం ఆక్రమణలకు గురయ్యే ప్రమాదం ఏర్పడడంతో ఉద్యమ శ్రేయోభిలాషులు చెరుకూరి సత్యనారాయణ, చిలుకూరి భరతుడు తదితరులు స్థానిక సిపిఎం సహకారంతో వీటిని పున:నిర్మించటమేగాక 1997 నుండి అన్ని కమ్యూనిస్టు పార్టీలు ఐక్యంగా సభలు నిర్వహిస్తున్నాయి. దీనికోసం చెరుకూరి సత్యనారాయణ కన్వీనర్‌గా ఒక ట్రస్టు రిజిస్టర్‌ చేయబడి, రోడ్డు విస్తరణతో సగం స్థలం కోల్పోయినా కట్టడాల్ని, స్థలాన్ని కాపాడుకొని అభివృద్ధి చేసి 1997 నుండి ఈనాటి వరకు ఐక్య వేదికగా సభా నిర్వహణ జరుగుతోంది. ఈ క్రమంలో శనివారం జరిగే సభలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ, సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరుకుమార్‌, సిపిఐ (ఎంఎల్‌) రాష్ట్ర నాయకులు ఉల్లిగడ్డల నాగేశ్వరరావు, సిపిఐ (ఎంఎల్‌) రెడ్‌స్టార్‌ నాయకులు మన్నవ హరిప్రసాద్‌, ఎంసిపిఐ నాయకులు ఎం.వెంకటరెడ్డి, షేక్‌ ఖాదర్‌బాషా, సిపిఐ (ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ నాయకులు ఎం.వెంకటేశ్వర్లు ప్రసంగిస్తారు. – చెరుకూరి సత్యనారాయణ

➡️