జడ్జీల బదిలీలు

Apr 4,2024 22:54

ప్రజాశక్తి – గుంటూరు లీగల్‌ : రాష్ట్రవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో పనిచేస్తున్న జిల్లా జడ్జిలను, సివిల్‌ జడ్జి (సీనియర్‌ డివిజన్‌)లను బదిలీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు విజిలెన్స్‌ రిజిస్ట్రార్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి గుంటూరులో మూడవ అదనపు జిల్లా జడ్జిగా పనిచేస్తున్న జి.అర్చనను తిరుపతిలోని నాలుగవ అదనపు జిల్లా కోర్టు (ఎస్సీ, ఎస్టీ కోర్టు)కు బదిలీ చేశారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు మూడవదనపు జిల్లా కోర్టు బాధ్యతలను గుంటూరు రెండవ అదనపు జిల్లా జడ్జి నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గుంటూరులో ఫ్యామిలీ కోర్టు (12వ అదనపు జిల్లా కోర్టు)లో అదనపు జిల్లా జడ్జిగా పనిచేస్తున్న పివిఎస్‌ సూర్యనారాయణ మూర్తిని రాజమండ్రిలోని ఏసీబీ కోర్టుకు స్పెషల్‌ జడ్జిగా బదిలీ చేశారు. ఖాళీ అయిన ఆ స్థానంలో ప్రస్తుతం రాష్ట్ర జ్యుడీషియల్‌ అకాడమీ, మంగళగిరిలో ఎడిషనల్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్న జి.చక్రపాణిని యమించారు. గుంటూరు పోక్సో కోర్టులో స్పెషల్‌ జడ్జిగా పనిచేస్తున్న కె.సీతారామకృష్ణారావును విజయవాడలో ఖాళీగా ఉన్న సిబిఐ కోర్టుకు స్పెషల్‌ జడ్జిగా నియమించారు. గుంటూరు పోక్సో కోర్టు బాధ్యతలను తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ ఐదవ అదనపు జిల్లా జడ్జి నిర్వహించాలని ఆదేశించారు. గురజాలలో అదనపు జిల్లా జడ్జిగా పనిచేస్తున్న జి.వెంకటేశ్వర్లును మచిలీపట్నంలోని పోక్సో కోర్టుకు స్పెషల్‌ జడ్జిగా బదిలీ చేశారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు గురజాల కోర్టు బాధ్యతలను గుంటూరు నాలుగవ అదనపు జిల్లా జడ్జి నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలో నెల్లూరులో ఆరవ అదనపు జిల్లా జడ్జిగా పనిచేసిన ఎన్‌.సత్యశ్రీని తిరిగి విధుల్లోకి తీసుకొని నరసరావుపేటలో ఖాళీగా ఉన్న 13వ అదనపు జిల్లా కోర్టులో నియమించారు. అనంతపురం ఎస్సీ, ఎస్టీ కోర్టులో స్పెషల్‌ జడ్జిగా పనిచేసిన డి.శ్రీనివాసులును తిరిగి వీధిలోకి తీసుకొని తెనాలిలో ఖాళీగా ఉన్న 11 జిల్లా కోర్టుకు నియమించారు. బదిలీ అయిన జిల్లా జడ్జిలు ఈనెల 24 లోగా తమ తమ కొత్త స్థానాల్లో బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించారు. నరసరావుపేటలో ప్రిన్సిపల్‌ సివిల్‌ జడ్జి (సీనియర్‌ డివిజన్‌)గా పని చేస్తున్న ఎ.శోభారాణిని ప్రకాశం జిల్లా కందుకూరుకు బదిలీ చేశారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు నరసరావుపేట ప్రిన్సిపల్‌ సివిల్‌ జడ్జి బాధ్యతలను అడిషనల్‌ సివిల్‌ జడ్జ్‌ నిర్వహించాలని ఆదేశించారు. గురజాలలో సివిల్‌ జడ్జి సీనియర్‌ డివిజన్‌గా పనిచేస్తున్న బి.లీలా వెంకట శేషాద్రిని కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా బదిలీ చేశారు. ఖాళీ అయిన ఆ స్థానంలో ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో సివిల్‌ జడ్జిగా పనిచేస్తున్న ఎలమర్తి శ్రీనివాసరావును నియమించారు. సత్తెనపల్లిలో సీనియర్‌ సివిల్‌ జడ్జిగా పనిచేస్తున్న డి.నాగ వెంకటలక్ష్మి అద్దంకి కోర్టుకు బదిలీ చేసి ఖాళీ అయిన ఆ స్థానంలో ప్రస్తుతం కర్నూలులో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా పనిచేస్తున్న సిహెచ్‌ వెంకట నాగ శ్రీనివాసరావును నియమించారు.

➡️