అభివృద్ధికి ఆమడ దూరాన గిరిజన తండాలు

May 21,2024 20:57

ప్రజాశక్తి -వీరఘట్టం : దేశానికి స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు కావస్తున్నప్పటికీ గిరిజన తండాలు నేటికీ అభివృద్ధికి నోచుకోలేదంటే పాలకుల పనితీరు ఏ విధంగా ఉందో వీటిని చూస్తే అర్ధం చేసుకో వచ్చు. ప్రసంగాలకే పాలకులు పరిమితమవుతున్నారే తప్ప ఆచరణలో ఎక్కడా కానరావడం లేదు. దీంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఎక్కడి సమస్యలు అక్కడే దర్శనమిస్తున్నాయి. ఈ కారణంగా గిరిజనులకు అవస్థలు తప్పడం లేదు.మండలంలోని హుస్సేనపురం, కత్తులకవిటి, కంబర, చిన గోరకాలనీ, దశమంతపురం, వండవ, చలివేంద్రి, వీరఘట్టం సచివాలయాల పరిధిలో గల పెద్ద గదబవలస, దువ్వనపాడు, నీలంపేట, కొత్తగూడ, శాంతిగూడ, ఎలీషాపురం, సంధిమానుగూడ, పాలమానుగూడ, రాయి మానుగూడ, వంకాయలగెడ్డ, గంగంపేట, రామాపురం, కె.ఇచ్చాపురం, బల్లగుడ్డి, జరడ, కాగితాడ, కొండవానిగోర, మావిడిమానుగోర, గోరకాలనీ, బట్టిగూడ, కొత్తగూడ, గాదిలంక, మూలలంక, పెద్దూరు, సింధు నగర్‌, శృంగరాయపురం, ఎస్‌ గోపాలపురం, ఎస్‌ గోపాలపురంగూడ, అచ్చపువలస తదితర గ్రామాలు ఉన్నాయి. వీటిలో బట్టిగూడ, నీలంపేట, కాగితాడ, గదబవలస, సంధిమానగూడ, రాయిమాను గూడ, బల్ల గుడ్డి, రామాపురం, తదితర గిరిజన గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యాల్లేకపోవడంతో రాకపోకలు సాగించేందుకు గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, గర్భిణులు, రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో 104, 108 వాహనాలు గ్రామాలకు వచ్చే దాఖలాల్లేవు. అడపాదపా కురుస్తున్న వర్షాలకు ఈ రోడ్లు చిత్తడి చిత్తడిగా మారుతుండడంతో వీటిపై రాకపోకలు సాగించేందుకు మరిన్ని అవస్థలకు గురవుతున్నామని గిరిజనులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తాగు నీటి కోసం అవస్థలుమండలంలోని జరడ, కొత్తగూడ, గాదిలంక, దువ్వనపాడు తదితర గ్రామాల గిరిజనులు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కత్తులకవిటి సచివాలయం పరిధిలో కురుపాం మండలం తిక్కర పంచాయతీ జరడకాలనీ నుంచి పది ఏళ్ల కిందట సుమారు 16 కుటుంబాలు వచ్చి జరడ గ్రామంగా ఏర్పాటు చేసుకొని జీవనోపాధి కొనసాగిస్తున్నామని ఎం.గోవింద, ఎ.కేశవరావు, చిన్నారావు, అజాద్‌, సుందర్రావు, అయ్యన్న, ఎం.సన్నాయి తదితర గిరిజనులు వాపోతున్నారు. రేషన్‌ కార్డులు, ఆధార్‌ అన్ని వీరఘట్టం మండలంగా మార్చుకున్నామని, అయినా ఇంత వరకు ఒక ఇల్లు కూడా మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ప్రస్తుతం తాము పూరిళ్లలోనే కాలం గడుపుతున్నామని గిరిజనులు వాపోతున్నారు. గ్రామంలో తాగునీటికి తీవ్ర అవస్థలుపడుతున్నామన్నారు. తమ ఇబ్బందులను క్రిస్టియన్‌ సంస్థ చెందిన వారు గ్రామంలో బోరు బావి ఏర్పాటు చేశారన్నారు. అయితే ఈ బోరు ద్వారా వచ్చే నీరు కిలుము వాసన వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గుక్కెడి నీటి కోసం వంకాయలగెడ్డ, కత్తులకవిటి గ్రామాలకు మోటార్‌ సైకిల్‌కు క్యానల్‌ కట్టి మంచినీరు తీసుకువచ్చి దాహార్తి తీర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని జరడ గిరిజనులు తెలిపారు. అలాగే బట్టిగూడ గ్రామానికి సమీపంలో కొత్తగూడ గ్రామం ఉన్నప్పటికీ అక్కడ జలజీవన్‌ మిషన్‌ పనులు చేసినా వాటి ద్వారా చుక్క నీరు రాకపోవడంతో సమీపానున్న గెడ్డ నుంచి మంచినీళ్లు తోడుకొని దాహార్తిని తీర్చుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అర్ధాంతరంగా నిలిచిపోయిన కల్వర్టు పనులుమండలంలోని మూలలంక నుండి బట్టిగూడ, కొత్తగూడ గ్రామాల మీదుగా నర్సిపురానికి అనుసంధానం చేసేందుకు పదేళ్ల కిందట కల్వర్టు పనులు చేపట్టారు. ఇక్కడ పనులు పూర్తి కాకపోవడంతో అధికంగా వర్షాలు కురిస్తే వచ్చే వరదల వల్ల ఆయా గ్రామాలకు సంబంధాలు తెగిపోయే పరిస్థితి ఏర్పడుతుందని గిరిజనులు చెబుతున్నారు.

➡️